ఆ విప్లవం పేరు రాహుల్ గాంధీ: జైలు నుంచి సిద్ధు విడుదల
చండీగఢ్: పంజాబ్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు నవ్‌జ్యోత్ సింగ్ సిద్ధు.. జైలు నుంచి విడుదలయ్యారు. రోడ్ రేజ్ కేసులో దోషిగా తేలిన ఆయన జైలు శిక్షను అనుభవించారు. పటియాలా జైలు నుంచి ఇవ్వాళ విడుదలయ్యారు. వస్తూ వస్తూనే కేంద్ర ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై విరుచుకుపడ్డారు. మోదీ పాలనలో దేశంలో నియంతృత్వ వాతావరణం నెలకొందని, ప్రశ్నించిన వారిని జైలుపాలు చేస్తోందని ధ్వజమెత్తారు.
రోడ్ రేజ్ కేసులో సుప్రీంకోర్టు ఆయనకు ఏడాది జైలు శిక్షను విధించిన విషయం తెలిసిందే. రెండు నెలలు ముందుగానే ఆయన జైలు నుంచి విడుదల అయ్యారు. అనంతరం తనను కలిసిన విలేకరులతో మాట్లాడారు. తాను మధ్యాహ్నమే విడుదల కావాల్సి ఉన్నప్పటికీ- జైలు అధికారులు ఉద్దేశపూరకంగా జాప్యం చేశారని విమర్శించారు. జైలు వద్ద తనను కలుసుకోవడానికి వచ్చిన మీడియా ప్రతినిధులను కూడా వెళ్లిపోవాలని ఆదేశించినట్లు చెప్పారు.

దేశంలో నియంతృత్వం వచ్చినప్పుడల్లా ఒక విప్లవం పుట్టుకొస్తుంటుందని, ఇప్పుడొచ్చిన ఆ విప్లవం పేరు రాహుల్ గాంధీ అని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించినందు వల్లే రాహుల్ గాంధీపై లోక్‌సభ అనర్హత వేటు వేసిందని మండిపడ్డారు. దేశంలో నియంతృత్వం ఏ స్థాయిలో పెరిగిందనడానికి ఇదే నిదర్శనమని ఆరోపించారు. కాంగ్రెస్ ఎదుగుదలను ఎవరూ అడ్డుకోలేరని, కేంద్ర ప్రభుత్వాన్ని రాహుల్ గాంధీ మట్టికరిపిస్తాడని చెప్పారు.
పంజాబ్ లో రాష్ట్రపతి పాలనను అమలు చేయడానికి లోపాయకారిగా కుట్రలు పన్నుతున్నారని సిద్ధు విమర్శించారు. మైనారిటీలను అనేక ఇబ్బందులకు గురి చేస్తోన్నారని, పంజాబ్ ప్రతిష్ఠను దిగజార్చేలా, మనుగడను దెబ్బతీసేలా కేంద్ర స్థాయిలో ప్రయత్నాలు జరుగుతున్నాయని ధ్వజమెత్తారు. పంజాబ్ లో ప్రభుత్వం అనేది లేదని, వ్యవస్థ మొత్తం ఒకరిద్దరి చేతుల్లో చిక్కుకుపోయిందని నవ్‌జ్యోత్ సింగ్ సిద్ధు ఆరోపించారు.












Click it and Unblock the Notifications