NEET: జులై 4న దేశవ్యాప్తంగా విద్యాసంస్థల బంద్..
నీట్(NEET) 2024 నిర్వహణపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. పేపర్ లీక్ అయిందని తీవ్ర ఆరోపణలు వస్తున్నాయి. పేపర్ లీకైనట్లు బీహర్ పోలీసులు గుర్తించారు. నీట్ యూజీ పేపర్ లీక్ కేసులో 20 మంది నిందితులను బీహార్‌లోని పాట్నాలోని బీర్ జైలులో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) ఆదివారం విచారించింది. వీరిలో 13 మంది నిందితులను బీహార్ పోలీసు ఆర్థిక నేరాల విభాగం (ఈఓయూ) అరెస్టు చేయగా, ఏడుగురు సీబీఐ రిమాండ్‌లో ఉన్నారు.
13 మంది నిందితులను ప్రశ్నించేందుకు సీబీఐ ప్రత్యేక అనుమతి కోరింది. 13 మందిలో, ఆరుగురు పరీక్షా మాఫియాలో భాగం కాగా, నలుగురు అభ్యర్థులు మరియు ముగ్గురు తల్లిదండ్రులు ఉన్నారు. సీబీఐ రిమాండ్‌లో ఉన్నవారిలో ఒయాసిస్ స్కూల్ ప్రిన్సిపాల్ ఎహ్సానుల్ హక్, వైస్ ప్రిన్సిపాల్ ఇంతియాజ్ ఆలమ్‌తో పాటు దినపత్రికకు చెందిన ఒక జర్నలిస్టును ఏజెన్సీ ప్రశ్నించింది. ప్రశ్నాపత్రాలను తారుమారు చేశారన్న ఆరోపణలపై వారిని జార్ఖండ్‌లోని హజారీబాగ్ నుంచి పాట్నాకు తీసుకొచ్చారు.

మరోవైపు నీట్ పేపర్ లీక్ పై సుప్రీం కోర్టులో విచారణ కొనసాగుతోంది. నీట్ 2024 రద్దు చేయాలని దేశవ్యాప్తంగా విద్యార్థి సంఘాలు ఆందోళన చేస్తున్నాయి. నీట్ పరీక్ష కేంద్రం తీరుకు వ్యతిరేకంగా విద్యార్థి సంఘాలు జులై 4న దేశవ్యాప్తంగా విద్యాసంస్థల బంద్ కు పిలుపునిచ్చాయి. విద్యాసంస్థల బంద్ ఉంటుందని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి సీహెచ్ వినోద్, పీడీఎస్‌యూ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్ రాజశేఖర్ చెప్పారు..
బంద్‌ను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. నీట్ పరీక్షను వెంటనే రద్దు చేయాలని కోరారు. కేంద్రం నిర్వాకం వల్ల లక్షలాది విద్యార్థుల భవిష్యత్తు ప్రమాదంలో పడిందన్నారు. దేశవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల మూసివేతను ఆపాలని, ఐఐటి ప్రవేశాల్లో రాజకీయ ప్రమేయం లేకుండా చూడాలని డిమాండ్ చేశారు. యూనివర్సిటీల్లో ప్రజాస్వామ్యాన్ని నెలకొల్పాలని కోరారు.












Click it and Unblock the Notifications