సామూహిక బహిష్కరణ, ఒక్కడు ఓటు వేస్తే ఒట్టు అన్నా, పోరారే పోరా అంటూ !
బెంగళూరు/చామరాజనగర: కర్ణాటకలో 224 అసెంబ్లీ నియోజక వర్గాల్లో బుధవారం ఉదయం 7 గంటలకే పోలింగ్ మొదలైయ్యింది. పలు నియోజక వర్గాల్లో ఓటర్లు ఉదయం నుంచి క్యూలైన్లలో నిలబడి ఓటు వేస్తున్నారు. ఓటు హక్కు అందరూ వినియోగించుకోవాలని ఎన్నికల అధికారులు పదేపదే మనవి చేస్తూనే ఉన్నారు.
అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతి ఓటు విలువైనదే అని ఎన్నికల్లో పోటీ చేస్తున్న బీజేపీ, కాంగ్రెస్, జేడీఎస్ పార్టీ అభ్యర్థులు బావిస్తున్నారు. ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు వచ్చి ఓటు వెయ్యాలని అన్ని పార్టీల నాయకులు ఓటర్లకు మనవి చేస్తున్నారు. అయితే కర్ణాటకలోని చామరాజనగర జిల్లాలోని ఓ పోలింగ్ కేంద్రంలో బుధవారం మద్యాహ్నం వరకు ఒక్కరు కూడా ఓటు వెయ్యలేదు.

మీరు రాత్రి వరకు ఇక్కడే ఉన్నా ఎవ్వరూ వచ్చి ఓటు వెయ్యరని గ్రామస్తులు తేల్చి చెప్పడంతో ఎన్నికల అధికారులు, పోలింగ్ విధులకు వెళ్లిన సిబ్బంది బిత్తరపోయారు. చామరాజనగర జిల్లాలోని గుండ్లుపేట తాలుకాలో చిక్క ఎలచెట్టి అనే గ్రామం. గ్రామంలోని ప్రభుత్వ స్కూల్ లో ఎన్నికల అధికారులు పోలింగ్ బూత్ ఏర్పాటు చేశారు.
ప్రభుత్వ స్కూల్ లోని పోలింగ్ బూత్ లో పోలింగ్ విధులకు హాజరైన సిబ్బంది ఐదు మంది, సాయుధ పోలీసులతో పాటు బీజేపీ, కాంగ్రెస్, జేడీఎస్ పార్టీలకు చెందిన ఏజెంట్లు కుర్చుని ఉన్నారు. ఉదయం 7 గంటల నుంచి గ్రామస్తులు వచ్చి ఓటు వేస్తారని పోలింగ్ విధుల్లో ఉన్న సిబ్బంది ఎదురు చూశారు. బుధవారం మధ్యాహ్నం 1.30 గంటల వరకు కూడా ఒక్కరు కూడా ఓటు వెయ్యడానికి పోలింగ్ బూత్ లోకి వెళ్లలేదు.

పోలింగ్ విధుల్లో ఉన్న సిబ్బంది, ఎన్నికల అధికారులు గ్రామంలోకి వెళ్లి ఓటు వెయ్యడానికి రావాలని గ్రామస్తులకు మనవి చేశారు. మా గ్రామంలో ఇంత వరకు ఒక్క పని జరగలేదని, తాగడానికి మంచినీరు లేదని, నడవడానికి రోడ్లు లేవని, డ్రైనేజ్ లు లేవని, ఎన్నిసార్లు నాయకులకు చెప్పినా పట్టించుకోలేదని గ్రామస్తులు ఆరోపించారు.
ఎన్నికల సమయంలో మాత్రమే మా గ్రామం ఇక్కడి నాయకులకు గుర్తుకు వస్తుందని, తరువాత ఐదు సంవత్సరాలు ఈ పక్కకుకూడా చూడరని, అందుకే ఎన్నికలను బహిష్కరిస్తున్నామని గ్రామస్తులు మండిపడ్డారు. మేము కచ్చితంగా ఓటు వెయ్యమని గ్రామస్తులు తేల్చి చెప్పడంతో ఎన్నికల అధికారులు షాక్ తిన్నారు.

అటవి ప్రాంతానికి ఆనుకుని ఉన్న ఈ గ్రామంలో సరైన వసతులు లేవని నాయకులు అందరికి తెలిసినా వారు ఏమాత్రం పట్టించుకోలేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. పోలింగ్ కేంద్రాలకు వచ్చి ఓటు వెయ్యాలని చెప్పిన కొందరు నాయకులకు పోరారే పోరా అంటూ గ్రామస్తులు ఎదురుతిరగడంతో ఆ నాయకులు కాలికి పని చెప్పారని తెలిసింది.












Click it and Unblock the Notifications