Conjunctivitis: దేశవ్యాప్తంగా పెరుగుతోన్న కళ్లకలక కేసులు..
దేశవ్యాప్తంగా కళ్లకలక కేసులు వేగంగా పెరుగుతోన్నాయి. వైరస్ ఒకరి నుంచి ఒకరికి త్వరగా వ్యాపిస్తోంది. కళ్లకలకతో ఢిల్లీ ఎయిమ్స్ ఆస్పత్రిలో రోజుకు 100 మందికి పైగా రోగులు వస్తున్నారు. మొన్నటి వరకు వరదలతో ఇబ్బంది పడిన ఢిల్లీ వాసులు ఇప్పుడు కళ్లకలకతో చుక్కలు చూస్తున్నారు. ఢిల్లీలోనే కాదు దాదాపు దేశవ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉంది. మహారాష్ట్రలోని ముంబై, పూణే, నాగ్‌పూర్ భారీగా కేసులు నమోదయ్యాయి. కర్ణాటకలోనూ ఈ కేసులు పెరుగుతోన్నాయి.
కళ్లకలకపై లోకల్ సర్కిల్స్ సర్వే నిర్వహించింది. మహారాష్ట్ర, ఢిల్లీ, కర్ణాటకలో దాదాపు 14వేల కంటే ఎక్కువ మందిని పరిశీలించింది. వీరిలో 66% మంది పురుషులు కాగా, 34% మంది మహిళలు ఉన్నారు. ఢిళ్లీ ఎన్సీఆర్ లో 27 శాతం మంది తమ ఇంట్లో ఒకరు లేదా అంతకంటే ఎక్కువ మందికి కళ్లకలక వచ్చినట్లు తెలిపారు. మహారాష్ట్రలో జూలైలో 87వేల 761 కండ్లకలక కేసులు వచ్చాయి. ఇది ఇటీవలి సంవత్సరాలలో అత్యంత తీవ్రమైన వ్యాప్తిలో ఒకటిగా నిలిచింది.

మహారాష్ట్రలో, బుల్దానాలో దాదాపు 13వేల 550 కేసులు నమోదయ్యాయి. బీహార్‌లోని పాట్నాలో ఈ వారం 40 కేసులు వచ్చాయి. జూన్ నుంచి గుజరాత్‌లో 2.17 లక్షల కండ్లకలక కేసులు నమోదయ్యాయి. చత్తీస్ ఘఢ్,తెలంగాణ, ఏపీ, తమిళనాడు, మధ్యప్రదేశ్ లో కూడా కళ్లకలక కేసులు నమోదవుతున్నాయి. నిర్మల్ జిల్లా కడెం మండలంలోని నచ్చెన్ ఎల్లాపూర్ బాలికల గురుకుల పాఠశాలలో చదువుతున్న 600 మంది విద్యార్థినుల్లో 402 మందికి కళ్లకలక వచ్చింది.
రెండు రోజులుగా విద్యార్థినులు ఇబ్బందులు పడుతుండగా.. కడెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుంచి కంటి చుక్కల మందు తెప్పించి ఇప్పిస్తున్నామని పాఠశాల ప్రిన్సిపల్ చెప్పారు.
అడెనోవైరస్ కళ్లకలక వస్తుందని వైద్యులు చెబుతున్నారు. కళ్లకలక వస్తే ఒకటి లేదా రెండు కళ్లు ఎరుపుగా మారుతాయి. కళ్లు దురద పెడుతుంటాయి. మండినట్లు అనిపిస్తుంది. కళ్లకలక వచ్చిన వారు వెలుతురును సరిగా చూడలేరు. కంట్లో ఏదో ఇరుక్కుపోయినట్లు అనిపిస్తుంది. కళ్లకలక వచ్చిన వారు తప్పుకుండా కళ్ల అద్దాలు పెట్టుకోవాలి. వారు వాడిన టవల్ ఇతరులు వాడకూడదు. వారు వేరే గదిలో ఉంటే మంచిది. ఇంట్లో చిన్నపిల్లలు మరింత జాగ్రత్త తీసుకోవాలి.












Click it and Unblock the Notifications