• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

మోదీ ఏడేళ్ల పాలనలో భారత ఆర్థిక వ్యవస్థ ఎలా ఉందో ఈ ఏడు చార్టులు చెప్పేస్తాయి

By BBC News తెలుగు
|

మోదీ

ఉద్యోగాల కల్పన, అభివృద్ధి, రెడ్ టేపిజం లేకుండా చేయడం వంటి గొప్పగొప్ప హామీలు గుప్పించి నరేంద్ర మోదీ భారతదేశ ప్రధానమంత్రి పదవి చేపట్టారు.

తొలుత 2014లో, ఆ తరువాత 2019లో ప్రజలు భారీ మెజారిటీతో గెలిపించడంతో అందుకు తగ్గట్టుగానే మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం దేశంలో గొప్ప సంస్కరణలను తీసుకొస్తుందని చాలామంది ఆశించారు.

కానీ, ప్రధానిగా మోదీ ఏడేళ్ల పదవీకాలంలో దేశ ఆర్థిక వ్యవస్థ వెలవెలబోయింది.

ఆసియాలో మూడో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన భారత్, ప్రధాని మోదీ ఏడేళ్ల పదవీకాలంలో ఎలాంటి పనితీరు కనబరిచిందో ఇక్కడ ఏడు చార్టులలో చూద్దాం..

నత్తనడకన వృద్ధి

2025 నాటికి 5 ట్రిలియన్ డాలర్ల (సుమారు రూ. 37 కోట్ల కోట్లు) ఆర్థిక వ్యవస్థగా భారత్‌ను పరుగులు తీయిస్తానని మోదీ హామీ ఇచ్చారు. ద్రవ్యోల్బణం నేపథ్యంలో సవరించిన అంచనాల ప్రకారం చూసినా ఆ లక్ష్యం 3 ట్రిలియన్ డాలర్లు (సుమారు రూ. 22 కోట్ల కోట్లు). కానీ ఈ లక్ష్యం చేరుకోవడం కలగానే కనిపిస్తోంది.

కోవిడ్‌కు ముందున్న ఆర్థిక వృద్ధి పరిస్థితుల ప్రకారం చూసినా 2025 నాటికి వాస్తవ అంచనా 2.6 ట్రిలియన్ డాలర్లే.

అంతర్జాతీయంగా చమురు ధరలు పెరగడం వంటి కారణాలతో పెరుగుతున్న ద్రవ్యోల్బణం ఆందోళన కలిగిస్తోందని ఆర్థికవేత్త అజిత్ రానాడె అన్నారు.

భారత ఆర్థిక వ్యవస్థ

అయితే, భారత ఆర్థిక వ్యవస్థ ప్రస్తుత పరిస్థితికి కోవిడ్ ఒక్కటే కారణం కాదు.

మోదీ ప్రధాని పదవి చేపట్టే నాటికి భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటు 7 నుంచి 8 శాతం ఉండేది. 2019-20 ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికం నాటికి అది దశాబ్దంలో అత్యంత కనిష్ఠ స్థాయి 3.1 శాతానికి పడిపోయింది.

2016లో పెద్ద నోట్లను రద్దు చేయడం వల్ల 86 శాతం కరెన్సీ చలామణీ లేకుండా పోవడం, ఆ తరువాత జీఎస్టీ అమలు చేయడం వల్ల దేశంలో వ్యాపారాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి.

ఈ రెండు నిర్ణయాలు విపరిణామాలకు దారితీశాయి.

భారత ఆర్థిక వ్యవస్థ

పెరుగుతున్న నిరుద్యోగం

''2011-12 ఆర్థిక సంవత్సరం నుంచి భారత్‌లో పెట్టుబడులు నిదానించాయి. ఇది అతిపెద్ద సవాలు'' అన్నారు సెంటర్ ఫర్ మానిటరింగ్ ది ఇండియన్ ఎకానమీ (సీఎంఐఈ) సీఈవో మహేశ్ వ్యాస్.

''ఆ తరువాత వరుసగా ఆర్థిక అలజడులు ఎదుర్కొన్నాం. నోట్ల రద్దు, జీఎస్టీ, లాక్‌డౌన్.. ఇవన్నీ ఉద్యోగాల కోతకు కారణమయ్యాయి'' అన్నారాయన.

అధికారిక గణాంకాల ప్రకారం.. 2017-18లో నిరుద్యోగిత 6.1 శాతానికి చేరింది. ఇది గత 45 ఏళ్లలో ఎన్నడూ లేనంత గరిష్ఠ స్థాయి.

సీఎంఐఈ సర్వే గణాంకాల ప్రకారం చూస్తే ఆ తరువాత కాలంలో అది రెట్టింపైంది.

2021 ప్రారంభం నుంచి ఇప్పటివరకు 2.5 కోట్ల కంటే ఎక్కువ మంది ఉద్యోగాలు కోల్పోయారు. 7.5 కోట్ల మందికిపైగా భారతీయులు మళ్లీ పేదరికంలో చిక్కుకున్నారు.

భారత ఆర్థిక వ్యవస్థకు ఏటా 2 కోట్ల కొలువులు అవసరం కాగా మోదీ ప్రభుత్వం ఉద్యోగాల కల్పనలో ఆ సంఖ్యకు సుదూరంగానే ఉండిపోయిందని ఆర్థికవేత్త రానాడె అన్నారు.

గత దశాబ్దకాలపు గణాంకాలు చూస్తే భారత్‌లో ఏటా సగటున 43 లక్షల కొత్త ఉద్యోగాలు మాత్రమే ఇవ్వగలుగుతున్నారు.

భారత ఆర్థిక వ్యవస్థ

తయారీ తగినంత లేదు.. ఎగుమతి ఏమాత్రం పెరగలేదు

మోదీ ఘనంగా ప్రకటించిన 'మేక్ ఇన్ ఇండియా' లక్ష్యం ప్రకారం దేశ జీడీపీలో తయారీరంగానిది 25 శాతం వాటా కావాలి. మోదీ ప్రధాని పదవి చేపట్టినప్పటి నుంచి ఏడేళ్లలో ఎన్నడూ ఈ శాతం 15కి మించలేదు. అంతేకాదు, గత అయిదేళ్లలో తయారీరంగంలో సగం ఉద్యోగాలు తగ్గిపోయినట్లు 'సెంటర్ ఫర్ ఎకనమిక్ డాటా అండ్ అనాల్సిస్' లెక్కలు చెబుతున్నాయి.

గత దశాబ్దకాలంగా ఏ ఏడాది కూడా ఎగుమతులు 30 వేల కోట్ల డాలర్లకు మించలేదు.

మోదీ హయాంలో భారత్.. ఎగుమతుల్లో బంగ్లాదేశ్ వంటి పోటీ దేశాలకు తన మార్కెట్ వాటాను కోల్పోయింది.

మరోవైపు ఆత్మనిర్భరత పేరుతో మోదీ ఇటీవల కాలంలో పన్నులు పెంచి రక్షణాత్మక ఆర్థిక విధానాలను అనుసరిస్తున్నారు.

భారత ఆర్థిక వ్యవస్థ

మౌలిక వసతుల కల్పన అంతంతమాత్రమే..

మోదీ ప్రభుత్వం సగటున రోజుకు 36 కిలోమీటర్ల పొడవున హైవేలను నిర్మిస్తోందని.. మోదీకి ముందున్న ప్రధానుల హయాంలో ఈ సగటు 8 నుంచి 11 కిలోమీటర్లు మాత్రమేనని ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సంస్థ 'ఫీడ్ బ్యాక్ ఇన్‌ఫ్రా' సహ వ్యవస్థాపకుడు వినాయక్ చటర్జీ చెప్పారు.

గత అయిదేళ్లలో సౌర, పవన్ విద్యుదుత్పత్తి స్థాపన సామర్థ్యం రెట్టింపైంది. ప్రస్తుతం 100 గిగావాట్ల సామర్థ్యం భారత్‌కు ఉంది. 2023 నాటికి 175 గిగావాట్ల సామర్థ్యం సాధించాలన్న లక్ష్యం దిశగా భారత్ సాగుతోంది.

బహిరంగ మల విసర్జన అలవాటు నిర్మూలించేలా కొత్తగా మరుగుదొడ్ల నిర్మాణం, గృహ రుణాలు, రాయితీపై వంటగ్యాస్, పేదలకు నీటి సరఫరా వంటి మోదీ పథకాలను ఆర్థికవేత్తలు స్వాగతిస్తున్నారు.

అయితే, నీటి సదుపాయం లేకపోవడంతో కొత్తగా నిర్మించిన మరుగుదొడ్లలో చాలావరకు నిరుపయోగంగానే ఉంటున్నాయి. మరోవైపు ఇంధన ధరల పెరుగుదల కారణంగా వంట గ్యాస్ రాయితీ ప్రయోజనాలు నిష్ఫలమయ్యాయి.

పన్నులు, ఎగుమతుల ఆదాయంతో పొంతన లేకుండా చేస్తున్న వ్యయం వల్ల ఏర్పడుతున్న ద్రవ్య లోటు ఆర్థికవేత్తల ఆందోళనకు కారణమవుతోంది.

భారత ఆర్థిక వ్యవస్థ

బ్యాంకింగ్

డిజిటల్ పేమెంట్స్‌లో గ్లోబల్ లీడర్‌గా అవతరించే దిశగా భారత్ వడివడిగా అడుగులు వేస్తోంది. ఇది మోదీ సాధించిన విజయాల్లో ఒకటిగా చెప్పుకోవాలి. ప్రభుత్వ సహకారంతో నడుస్తున్న డిజిటల్ పేమెంట్ల విధానం దీనికి కారణం.

అంతేకాకుండా మోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన జన్ ధన్ పథకం వల్ల కోట్లాది మంది పేదలు జీరో బ్యాలన్స్‌తో బ్యాంకు ఖాతాలు తెరవగలిగారు.

దీంతో దేశంలో బ్యాంకు ఖాతాలు, డిపాజిట్లు పెరిగాయి. అయితే, జన్ ధన్ ఖాతాల్లో చాలావరకు ట్రాంజాక్షన్లు లేకుండా ఉన్నాయనీ నివేదికలు వెల్లడిస్తున్నాయి.

అయితే, ఆర్థికవేత్తలు మాత్రం దళారుల వ్యవస్థను లేకుండా చేస్తూ నేరుగా లబ్ధిదారుల ఖాతాలకే ప్రభుత్వం అందించే నగదు ప్రయోజనాలు జమ కావడం సరైన ఆర్థిక పరిణామమని చెబుతున్నారు.

ఆరోగ్య రంగంపై అశ్రద్ధ

''గత ప్రభుత్వాల మాదిరే మోదీ ప్రభుత్వమూ ఆరోగ్య రంగాన్ని నిర్లక్ష్యం చేసింది. హెల్త్‌కేర్‌పై ప్రభుత్వం చేసే ఖర్చు చాలా తక్కువగా ఉండే దేశాల్లో భారత్ కూడా ఒకటి'' అని ఎకనమిస్ట్ రితికా ఖేరా అన్నారు.

నివారణ, ప్రాథమిక స్థాయి హెల్త్ కేర్‌ను బలోపేతం చేయడం మానేసి ఆ తరువాత స్థాయిపై ఎక్కువగా దృష్టి పెడుతున్నారని నిపుణులు అంటున్నారు.

భారత ఆర్థిక వ్యవస్థ

'ఈ రకమైన పద్ధతి అమెరికా తరహా ఆరోగ్య వ్యవస్థ దిశగా నడిపిస్తోంది. ఇందులో ఖర్చు ఎక్కువ ఫలితం తక్కువ ఉంటుంది'' అని ఖేరా అన్నారు.

మరోవైపు 2018లో మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన హెల్త్ ఇన్స్యూరెన్స్ స్కీమ్ కోవిడ్ సమయంలో పెద్దగా ఉపయోగపడలేదు.

''ఆరోగ్య రంగ బలోపేతానికి మరిన్ని వనరుల అవసరం ఉంది'' అని ప్రజారోగ్య నిపుణులు డాక్టర్ శ్రీనాథ్ రెడ్డి అన్నారు. ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ వ్యవస్థను బలోపేతం చేసేలా పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టడానికి భారత్ కోవిడ్‌ను ఒక మేల్కొలుపులా భావించాలని ఆయన చెప్పారు.

భారత ఆర్థిక వ్యవస్థ

వ్యవసాయమే..

భారత్‌లోని పనిచేసే వయసు జనాభాలో సగం మందికి ఉపాధి చూపిస్తున్నది వ్యవసాయ రంగమే. అయితే, జీడీపీలో దీని వాటా మాత్రం అందుకు తగ్గట్లుగా లేదు.

భారత వ్యవసాయ రంగంలో సంస్కరణలు రావాలని ప్రతి ఒక్కరూ చెబుతారు. గత ఏడాది మార్కెట్ అనుకూల చట్టాలను తీసుకొచ్చారు. దీనిపై రైతుల నుంచి నిరసనలు ఇంకా వ్యక్తమవుతున్నాయి.

'అరకొర సంస్కరణలు అంతగా ఫలితమివ్వవు. వ్యవసాయం మరింత లాభదాయకంగా మార్చేందుకు ప్రభుత్వం ఈ రంగంలో పెద్దఎత్తున ఖర్చు చేయాలి'' అని ప్రొఫెసర్ ఆర్.రామ్‌కుమార్ అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
These seven charts tell us how the Indian economy was during Modi's seven years in power
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X