బ్యాంకుకు పెద్ద కన్నం: లాకర్లు పగలగొట్టి రూ.కోటికిపై నగదు, నగలు చోరీ
న్యూఢిల్లీ: దేశ రాజధాని ప్రాంతంలోని ఓ బ్యాంకులో భారీ దోపిడీ జరిగింది. బ్యాంకుకు పెద్ద రంధ్రం చేసిన దొంగలు.. కోటికిపైగా విలువ చేసే నగదు, బంగారు ఆభరణాలను ఎత్తుకెళ్లడం కలకలం రేపుతోంది. ఔటర్ ఢిల్లీలోని ముంద్కాలో ఈ ఘటన చేసుకుంది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.
దొంగలు మొత్తం 15 లాకర్లు బద్దలుగొట్టినట్టు పోలీసులు వెల్లడించారు. బ్యాంకు పక్కనే ఉన్న ప్లాటు నుంచి ఎలక్ట్రానిక్ కట్టర్లు, 8 గ్యాస్ సిలిండర్లు ఉపయోగించి దొంగలు బ్యాంకులోకి రంధ్రం చేశారు. లోపలికి చొరబడ్డాక సీసీ టీవీ కెమెరాలు, డిజిటల్ వీడియో రికార్డులను ధ్వంసం చేశారు. అనంతరం లాకర్లను తెరిచి అందులోని నగదు, బంగారు ఆభరణాలను ఎత్తుకెళ్లారు.

శనివారం, లేదంటే ఆదివారం రాత్రి ఈ ఘటన జరిగి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. సొత్తుతో ఉడాయించిన దొంగలు గ్యాస్ సిలిండర్లు, రంధ్రం చేసేందుకు ఉపయోగించిన వస్తువులను అక్కడే వదిలేసి వెళ్లిపోయారు. వాటిని స్వాధీనం చేసుకున్న పోలీసులు అవి కొత్తగా ఉన్నాయని, దోపిడీ కోసమే వాటిని కొనుగోలు చేసినట్టున్నారని తెలిపారు.
బ్యాంకుకు రంధ్రం చేయడానికి రెండు మూడు గంటలు పట్టి ఉంటుందని, అయితే బ్యాంకు రద్దీ రోడ్డు పక్కగా ఉండటంతో రంధ్రం చేస్తున్న చప్పుడు వాహనాల శబ్దాల్లో కలిసిపోయి వినిపించి ఉండకపోవచ్చని అభిప్రాయపడుతున్నారు. చోరీ ఘటనలో బ్యాంకు సిబ్బంది హస్తం కూడా ఉండొచ్చన్న అనుమానంతో వారిని కూడా విచారిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. నిందితులను త్వరలోనే పట్టుకుంటామని చెప్పారు.












Click it and Unblock the Notifications