రైల్వేలో షాకింగ్ మోసం: తత్కాల్ టికెట్లు దొరక్కపోవడానికి అసలు కారణమిదే!

Subscribe to Oneindia Telugu
  తత్కాల్ టికెట్లు దొరకట్లేదా ? కారణమిదే!

  న్యూఢిల్లీ: రైల్వేలో జరుగుతున్న భారీ మోసం వెలుగుచూసింది. తత్కాల్ టికెట్ల కోసం ఎప్పుడు ప్రయత్నించినా దొరక్కపోవడానికి కారణాన్ని సీబీఐ బట్టబయలు చేసింది. కాగా, సీబీఐలో పనిచేస్తున్న వ్యక్తే ఈ మోసాలకు పాల్పడుతుండటం గమనార్హం.

  అందుకే ఆన్‌లైన్ ద్వారానో లేదా రైల్వే టికెట్‌ కౌంటర్ల ముందో ఎంతసేపు పడిగాపులు కాసి, ఎన్ని ప్రయత్నాలు చేసినా కస్టమర్లకు టికెట్లు దొరకడం లేదు. అయితే, ఈ టికెట్లు కొంతమంది దళారులకు మాత్రం పుష్కలంగా దొరుకుతున్నాయి. ఈ వ్యవహారంపై లోతుగా దర్యాప్తు జరిపిన సీబీఐ.. బుధవారం ఈ గుట్టురట్టు చేసింది.

   సీబీఐలో పనిచేస్తూనే..

  సీబీఐలో పనిచేస్తూనే..

  ఆ వివరాల్లోకి వెళితే.. సీబీఐలో సహాయ ప్రోగ్రామర్‌గా ఉన్న అజయ్‌గార్గ్‌ (35) అనే వ్యక్తి రైల్వే కంప్యూటర్‌ వ్యవస్థలో దళారులు చొరబడేందుకు వీలు కల్పించే ప్రోగాంను రూపొందించాడు. అంతేగాక, తత్కాల్ టికెట్లను వారికి విక్రయించి భారీగా సొమ్ము చేసుకుంటున్న తీరు సీబీఐ అధికారులను సైతం ఆశ్చర్యానికి గురిచేసింది.

  చివరకు చిక్కారు

  చివరకు చిక్కారు

  2007 నుంచి నాలుగేళ్లపాటు భారతీయ రైల్వే ఆహార విహార సంస్థ (ఐఆర్‌సీటీసీ)లో పనిచేసిన అనుభవం ఉండడంతో అక్కడి కంప్యూటర్‌ వ్యవస్థలో లోపాలపై బాగా అవగాహన పెంచుకున్న అజయ్.. చివరకు ఈ అక్రమానికి తెరతీశాడని అధికారులు తెలిపారు. గార్గ్‌ను, అతనికి సహాయంగా ఉంటున్న అనిల్‌గుప్తాను అరెస్టు చేసినట్లు తెలిపారు. వీరిద్దరితో సహా 13 మందిపై కేసులు నమోదు చేశారు. అరెస్టయిన ఇద్దరినీ న్యాయస్థానంలో హాజరుపరచగా 5 రోజుల పాటు సీబీఐ కస్టడీకి అప్పగిస్తూ న్యాయమూర్తి ఆదేశాలిచ్చారు.

   బిట్‌కాయిన్లు, హవాలా పద్ధతులకు తెర.. కుటుంబసభ్యులు కూడా

  బిట్‌కాయిన్లు, హవాలా పద్ధతులకు తెర.. కుటుంబసభ్యులు కూడా

  కాగా, గార్గ్ తన సాఫ్ట్‌వేర్‌ ద్వారా ఒక్క క్లిక్‌తో కొన్ని వందల టికెట్లను ఏజెంట్లు సంపాదించగలుగుతున్నారని సీబీఐ అధికారులు వెల్లడించారు. అక్రమ సాఫ్ట్‌వేర్‌ను దళారులకు అమ్మిన తర్వాత డబ్బును వసూలు చేసుకోవడంలో అజయ్ గార్గ్‌కు అతని తల్లిదండ్రులు, భార్య, సోదరి, బావమరిది సహకరించేవారని ప్రాథమిక సీబీఐ జరిపిన దర్యాప్తులో బయటపడింది. ఎక్కడా ఎవరికీ దొరక్కుండా చూసుకోవడం కోసం బిట్‌కాయిన్లు, హవాలా మార్గాల ద్వారా వసూళ్లు జరిపేవారని సీబీఐ అధికారులు గుర్తించారు. ఈ విధంగా వీరు రూ.కోట్ల ఆస్తుల్ని కూడగట్టడం గమనార్హం.

   భారీగా ఆస్తుల స్వాధీనం

  భారీగా ఆస్తుల స్వాధీనం

  ఢిల్లీ, ముంబై సహా 14 ప్రాంతాల్లో సీబీఐ నిర్వహించిన సోదాల్లో రూ.89.42 లక్షల నగదు, రూ.61.29 లక్షల విలువైన ఆభరణాలు, 15 లాప్‌టాప్‌లు, 15 హార్డ్‌డిస్క్‌లు, 52 మొబైల్ ఫోన్లు, 24 సిమ్‌కార్డులు, ఆరు రూటర్లు, 19 పెన్‌డ్రైవ్‌లు లభ్యమయ్యాయి. సాఫ్ట్‌వేర్‌ను ఒకసారి ఏజెంట్ల కంప్యూటర్లో వేశాక దానిని వాడాలంటే వాడుకదారు పేరు, సంకేతపదం అవసరం. ఎక్కువ డబ్బులు పిండుకోవడం కోసం గార్గ్‌ వీటిని ఎప్పటికప్పుడు మార్చేసేవాడని అధికారులు తెలిపారు. ఈ అక్రమ వ్యవహారం బయటపడకుండా అనేక జాగ్రత్తలు తీసుకుని, విదేశీ సర్వర్లను వాడేవాడని సీబీఐ అధికారులు వెల్లడించారు.

   వినియోగదారులకు చుక్కలు

  వినియోగదారులకు చుక్కలు

  సాధారణంగా ఒక టికెట్‌కు పీఎన్‌ఆర్‌ రావాలంటే 120 సెకెన్లయినా తీసుకుంటుంది. అక్రమ సాఫ్ట్‌వేర్‌ సాయంతో మాత్రం అంతకంటే తక్కువ వ్యవధిలోనే అనేక టికెట్లను పొందే వీలుంది. అన్ని వివరాలనూ ముందే నమోదు చేసుకుని, తత్కాల్‌ మొదలుకాగానే సెకన్ల వ్యవధిలోనే భారీ సంఖ్యలో టికెట్లు కొట్టేయడానికి ఇది వీలు కల్పిస్తోంది. ఈ అక్రమంతో సంబంధం ఉన్న 10 మంది ఏజెంట్లను ఇప్పటి వరకు గుర్తించారు. టికెట్లను ఏజెంట్లు ఎక్కువ ధరకు అమ్ముకున్నా రైల్వేకు మాత్రం ఆదాయనష్టం వాటిల్లలేదు. సంస్థలో అవినీతికి ఏమాత్రం ఆస్కారం ఇవ్వకూడదన్న విధానంలో భాగంగా ఈ కేసు వెలుగు చూసిందని సీబీఐ డైరెక్టర్‌ అలోక్‌వర్మ చెప్పారు. కాగా, తాజా అక్రమం వెలుగుచూసిన నేపథ్యంలో ఐఆర్‌సీటీసీ, రైల్వే సమాచార వ్యవస్థల కేంద్రం (క్రిస్‌)లలో ఉన్న లోపాలను సరిదిద్ది, బలోపేతం చేయాని రైల్వేశాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ ఆదేశించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  If you have to run after a travel agent each time you are unable to book a berth under the Tatkal scheme, then perhaps you have been conned by this CBI official.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి