ఢిల్లీలో ఆప్ ను ముంచేసింది ఆ మూడే? పద్మవ్యూహంలో చిక్కి విలవిల..!
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ హ్యాట్రిక్ ను అడ్డుకుని 26 ఏళ్ల విరామం తర్వాత హస్తిన పీఠాన్ని కైవసం చేసుకునేందుకు కాషాయ పార్టీ బీజేపీ అడుగులేస్తోంది. ఇవాళ జరుగుతున్న ఎన్నికల ఓట్ల లెక్కింపులో ఆది నుంచీ ఆధిక్యాన్ని చాటుకుంటున్న బీజేపీ.. భారీ విజయం నమోదు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇరు పార్టీల మధ్యఓట్ల శాతంలో తేడా నాలుగైదు శాతమే కనిపిస్తున్నా .. సీట్ల విషయంలో మాత్రం భారీ తేడా ఉంది. అయితే ఇంత భారీ తేడాతో ఆప్ ఓటమిపాలవుతుండటం వెనుక మూడు కీలక కారణాలు కనిపిస్తున్నాయి.
వీటిలో ప్రధాన మైనది ప్రజా వ్యతిరేకతే. దశాబ్దకాలంగా ఢిల్లీని ఏలుతున్న కేజ్రివాల్ ప్రభుత్వం .. ఈ పదేళ్లలో విద్య, వైద్య రంగాల్లో పెను మార్పులు తెచ్చింది. అలాగే విద్యుత్, తాగునీటి సబ్సిడీలు కూడా ఓటర్లను సంతోషంగానే ఉంచాయి. అయితే ఢిల్లీలో కాలుష్యాన్ని నియంత్రించడంలో పూర్తిగా విఫలమైన ఆప్ సర్కార్.. కేంద్రంపై నెపం నెట్టేసింది. అలాగే ఢిల్లీకి తాను ఏం చేయాలన్నా కేంద్రం అడ్డుపడుతోదంటూ కేజ్రివాల్ పదే పదే చెప్పిన కారణాన్ని ఇన్నాళ్లూ నమ్మిన ఓటర్లు.. ఇక చేసేది లేక అదేదో బీజేపీకే అధికారం ఇచ్చి చూద్దామని భావించారని ఫలితాలు నిరూపిస్తున్నాయి. ముఖ్యంగా ఢిల్లీలో అభివృద్ధి విషయంలో
కేజ్రివాల్ పదేళ్ల క్రితం ఇచ్చిన చాలా హామీలు నెరవేరలేదన్న అసంతృప్తి జనంలో అలాగే ఉంది.

మరోవైపు ఢిల్లీలో ఆప్ సర్కార్ తో పాటు కీలక నేతలకు మచ్చతెచ్చిన అంశాల్లో ప్రధానమైనది లిక్కర్ స్కాం. మద్యం కుంభకోణంలో 100 కోట్ల అవినీతి జరిగిందంటూ సీబీఐ, ఈడీ పదే పదే కేసులు నమోదు చేసి సీఎం కేజ్రివాల్ తో పాటు ఆప్ కీలక నేతలందరినీ జైలుకు పంపేశాయి. ఇందులో 100 కోట్లు ఎక్కడికి పోయాతో సీబీఐ, ఈడీ నిరూపించలేకపోయినా కోర్టులు మాత్రం వీరిని సుదీర్ఘకాలం జైల్లో ఉంచేందుకు అనుమతిచ్చాయి. అంతిమంగా ఇదే వారిపై మచ్చను నిజం చేసేసింది. ఈ కేసులో ఆప్ నేతలపై అభియోగాల్ని ఇప్పటికీ దర్యాప్తు సంస్థలు నిరూపించలేకపోయాయి. కానీ జనంలో మాత్రం వారు అవినీతిపరులుగా ముద్ర వేసుకున్నారు.
అలాగే ఆమ్ ఆద్మీ(సాధారణ ప్రజల్లో ఒకడు)గా పార్టీ పెట్టి విజయం సాధించిన అరవింద్ కేజ్రివాల్ .. ఆ తర్వాత కూడబెట్టుకున్న ఆస్తులు, ముఖ్యంగా విలాసవంతమైన భవనం, అందులో వస్తువుల్ని బీజేపీ శీష్ మహల్ రూపంలో జనంలోకి తీసుకెళ్లింది. దీంతో కేజ్రివాల్ పై ఉన్న ఆమ్ ఆద్మీ ముద్రను పోగొట్టింది. ఢిల్లీ వంటి రాజధాని నగరంలో ఉంటూ ఓ ముఖ్యమంత్రి స్దాయి వ్యక్తికి ఆమాత్రం ఇల్లు, వస్తువులు ఎందుకు ఉండవని జనం ఆలోచించలేదు. కేజ్రివాల్ ను ఇంకా ఆమ్ ఆద్మీగానే భావిస్తూ.. ఆయన మారిపోయారని భావించారు. దీంతో బీజేపీ ఆరోపణల్ని జనం నమ్మి కేజ్రివాల్ తో పార్టీని ఇంటి ముఖం పట్టిస్తున్నారు.












Click it and Unblock the Notifications