తీరని శోకం.. గంటల వ్యవధిలో ముగ్గురు బిడ్డలు మృతి !!
తల్లిదండ్రుల ముందే కన్నబిడ్డ కన్నుమూస్తే ఆ దుఃఖాన్ని మాటల్లో వర్ణించలేం. ఆ కడుపు కోతను తీర్చడం ఎవరి వల్ల కాని పని. అల్లారుముద్దుగా పెంచుకుంటున్న చిన్నారులకు అప్పుడే నూరేళ్లు నిండడం అంటే బ్రతికున్న వారిని సైతం జీవచ్చవాళ్ల లాగే మార్చేస్తుంది. అదే కేవలం గంటల వ్యవధిలోనే ముగ్గురు పిల్లలు మరణిస్తే ఆ కుటుంబం వేదనను అంచనా కూడా వెయ్యలేం.
ఇటీవల తెలంగాణలో జరిగిన బస్సు ప్రమాదంలో ఈ తరహా ఘటనే చోటు చేసుకుంది. ముగ్గురు కుమార్తెలను ఒకేసారి పోగొట్టుకున్నారు ఈ తల్లిదండ్రులు. ఇప్పుడు అలానే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది. అయితే తెలంగాణ ఘటనలో మరణించిన వారు మధ్య వయసు గల వారైతే.. యూపీలో మాత్రం చనిపోయిన వారి ఏడేళ్ల లోపు వారే కావడం మరింత శోకాన్ని మిగులుస్తోంది.

అసలేం జరిగిందంటే..?
యూపీ లోని నెబువా నౌరంగియా బ్లాక్‌లో ఉన్న గులార్హియా తోలాలో పింటు గౌర్ అనే వ్యక్తి కుటుంబంతో కలిసి నివసిస్తున్నారు. ఒక వారం క్రితం ఆయన కుమార్తె మంజు (7) తీవ్ర జ్వరంతో అస్వస్థతకు గురైంది. ఇంట్లో అందరూ ఆందోళన చెందడంతో ఆమెను స్థానిక వైద్యుడికి చూపించారు. కానీ మందులు వేసినా చిన్నారి ఆరోగ్యం క్రమంగా క్షీణించడంతో ఆమెను వెంటనే మరో ఆసుపత్రికి తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయింది.
అయితే మాటల్లో వర్ణించలేని విషాదం చోటుచేసుకున్న గంటల వ్యవధిలోనే గౌర్ చిన్న కుమార్తె ఖుషి (3), కుమారుడు కృష్ణ (5) జ్వరంతో మృతి చెందారు. గంటల వ్యవధిలోనే తండ్రి, తల్లి కళ్లముందే ముగ్గురు చిన్నారులు ఒక్కొక్కరిగా చివరి శ్వాస విడవడం సర్వత్రా కలకలం రేపింది. ఈ ఊహించని ఘటన గ్రామంలో భయాందోళనలను సృష్టించింది. వరుసగా చిన్నారుల మృతి నేపథ్యంలో వైద్యశాఖ అధికారులు అప్రమత్తమయ్యారు.
వైద్య బృందాలు గ్రామానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించాయి. పిల్లలు ఏ రకమైన ఇన్ఫెక్షన్ కారణంగా ప్రాణాలు కోల్పోయారో తెలుసుకునేందుకు దర్యాప్తు ప్రారంభించారు. మలేరియా, డెంగీ, వైరల్ ఫీవర్ వంటి వ్యాధులపై ప్రత్యేక పరీక్షలు చేస్తున్నారు. అధికారుల ప్రకారం ఇప్పటివరకు 57 మంది పిల్లలకు వైద్యపరీక్షలు నిర్వహించగా, అవసరమైన వారికి చికిత్స అందిస్తున్నారు. అలానే గ్రామంలో వైద్యశిబిరం ఏర్పాటు చేసి జ్వరం లక్షణాలు కనిపించిన పిల్లలను వెంటనే పరీక్షిస్తున్నారు. ఇళ్ల చుట్టుపక్కల పారిశుధ్యాన్ని మెరుగుపరిచేందుకు చర్యలు చేపట్టారు. దోమల నివారణ కోసం కూడా గ్రామంలో ఫాగింగ్ నిర్వహిస్తున్నారు.












Click it and Unblock the Notifications