ఘోర ప్రమాదం: రైల్వే సిబ్బందిపైకి దూసుకెళ్లిన రైలు, ముగ్గురు మృతి
ముంబై: రైలు దూసుకురావడంతో ముగ్గురు రైల్వే సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘోర ప్రమాద ఘటన సోమవారం రాత్రి మహారాష్ట్రలోని వాసాయి వద్ద చోటు చేసుకుంది. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పాల్ఘర్ జిల్లాలో సిగ్నల్ సమస్య తలెత్తడంతో వాటిని బాగుచేసేందుకు పశ్చిమరైల్వే విభాగానికి చెందిన ముగ్గురు సిబ్బంది వెళ్లారు.
రాత్రి సమయంలో పని జరుగుతుండగా పట్టాలపై ఉన్న సిబ్బంది సమీపిస్తున్న రైలును గమనించలేదు. ఈ క్రమంలో రైలు వారిపై నుంచి దూసుకెళ్లడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. వారి మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు.

మృతులను సిగ్నలింగ్ ఇన్‌స్పెక్టర్ వాసు మిత్ర, నిర్వాహకుడు సోమనాథ్ ఉత్తమ్, సహాయకుడు సచిన్ వాంఖడేగా గుర్తించారు. ప్రమాద ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మృతుల కుటుంబాలకు తక్షణ సాయం కింద ఒక్కొక్కరికి రూ. 55 వేలు అందించినట్లు రైల్వే అధికారులు తెలిపారు.
ఎక్స్‌గ్రేషియా చెల్లింపు, ఇతర చెల్లింపులు మరణించిన వారి కుటుంబసభ్యులకు 15 రోజులలోపు అందజేస్తారు. వాంఖడే, సోమనాథ్ కుటుంబాలకు ఒక్కొక్కరికి సుమారు రూ. 40 లక్షలు, వాసు మిత్ర కుటుంబానికి రూ. 1.24 కోట్లు అందించనున్నారు. ప్రమాద ఘటనపై పశ్చిమరైల్వే విచారణకు ఆదేశించింది.












Click it and Unblock the Notifications