Azaadi ke deewane: 9 లక్షల కోట్లు ఇచ్చాం: మీరు చేయాల్సిందిదే
PM Modi: దేశ 78వ స్వాతంత్ర్య దినోత్సవాలను పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కొద్ది సేపటి కిందటే దేశ రాజధానిలోని ఎర్రకోటపై జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయడం వరుసగా ఇది 11వ సారి. 2014 ఆగస్టు 15వ తేదీ నుంచి ఇప్పటివరకు ఆయన వరుసగా రెడ్ ఫోర్ట్‌పై మువ్వన్నెలను రెపరెపలాడించారు.
ఎర్రకోటకు చేరుకున్న వెంటనే త్రివిధ దళాల నుంచి గౌరవ వందనాన్ని స్వీకరించారు. అనంతరం త్రివర్ణ పతకాన్ని ఎగురువేశారు. ఆ సమయంలో వైమానిక దళానికి చెందిన అడ్వాన్స్డ్ లైట్ హెలికాప్టర్లు పూల వర్షాన్ని కురిపించాయి. అనంతరం జాతిని ఉద్దేశించి ప్రసంగించారు మోదీ.

వికసిత భారత్ లక్ష్య సాధనలో భాగంగా 2047 నాటికి నిర్దేశించుకున్న లక్ష్యాలు, వాటిని అందుకోవడానికి రూపొందించుకున్న భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికలను వివరించారు. దేశం కోసం ప్రాణాలను అర్పించిన మహనీయులను స్మరించుకున్నారు. వారిని ఆజాదీ కే దీవానేగా అభివర్ణించారు. ఈ దేశం వారికి రుణపడి ఉంటుందని చెప్పారు.
ప్రకృతి వైపరీత్యాల వల్ల మరణించిన వారికి మోదీ నివాళి అర్పించారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. స్వాతంత్ర్యం కోసం 40 కోట్ల మంది ప్రజలు ఐకమత్యంగా పోరాడారని గుర్తు చేశారు. వారి పోరాటం 140 కోట్ల మంది దేశ ప్రజలకు మాత్రమే కాకుండా ప్రపంచానికే స్ఫూర్తిదాయకమని చెప్పారు.
ఇన్ని కోట్లమంది ప్రజల సంకల్పం.. ఇప్పుడు సరైన దిశలో ప్రయాణించాల్సిన అవసరం ఉందని, 2047 నాటికి అన్ని అడ్డంకులను అధిగమించి విక్షిత్ భారత్‌గా మారవచ్చని అన్నారు. తాము తీసుకొచ్చిన వోకల్ ఫర్ లోకల్ అనే కాన్సెప్ట్ ఆర్థిక వ్యవస్థకు దిశానిర్దేశం చేస్తోందని వ్యాఖ్యానించారు మోదీ. దీని కింద దేశంలో ప్రతి జిల్లా కూడా సొంత ఉత్పత్తులపై చేపట్టిందని గుర్తు చేశారు.
వికసిత్ భారత్ కోసం దేశ ప్రజలు తమకు అనేక సూచనలు చేశారని, అవి వారి ఆకాంక్షలను ప్రతిబింబించాయని మోదీ చెప్పారు. దేశాన్ని స్కిల్ కేపిటల్‌గా, తయారీ కేంద్రంగా మార్చాలని దేశ ప్రజలు బలంగా కోరుకుంటోన్నారని అన్నారు. పాలన, న్యాయ వ్యవస్థలో సంస్కరణలను తీసుకురావాల్సిన అవసరాన్ని గుర్తు చేశారని చెప్పారు.
వికసిత్ భారత్‌లో భాగంగా పర్యాటకం, విద్య, ఆరోగ్యం, ఎంఎస్ఎంఈ, రవాణా, వ్యవసాయం, వ్యవసాయ ఆధారిత రంగాలు.. ఇలా ప్రతి సెగ్మెంట్‌లోనూ ఓ సరికొత్త ఆధునిక వ్యవస్థను సృష్టిస్తోన్నామని మోదీ పేర్కొన్నారు. గత 10 సంవత్సరాల్లో 10 కోట్ల మంది మహిళలు మహిళా స్వయం సహాయక సంఘాలలో చేరారని, వారు ఆర్థిక స్వావలంబన సాధించారని చెప్పారు.












Click it and Unblock the Notifications