దేశంలో చరిత్ర సృష్టించిన పొడవైన వందేభారత్ ఎక్స్‌ప్రెస్
కేంద్ర ప్రభుత్వం, ప్రధానమంత్రి నరేంద్రమోడీ అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే వందేభారత్ రైళ్లను భారతీయ రైల్వే రోజురోజుకు ప్రవేశపెడుతూ వస్తోంది. దాదాపుగా దేశంలోని అన్ని ప్రధాన నగరాల మధ్య ఇవి శరవేగంగా పరుగులు తీస్తున్నాయి. ఛార్జీలు ఎక్కువగా ఉన్నాయనే ఫిర్యాదు మినహా మిగతా విషయంలో ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండటంతో ప్రయాణికులు కూడా నెమ్మదిగా వీటికి అలవాటు పడుతున్నారు. ఛార్జీలు తక్కువగా ఉండే సౌకర్యంతో వందే సాధారణ్ రైళ్లను కూడా ప్రవేశపెడుతున్నారు. వీటిల్లో అన్నీ నాన్ ఏసీ స్లీపర్ బోగీలే ఉంటాయి.
11 గంటల 30 నిముషాల్లో చేరుకుంది
మనదేశంలో న్యూఢిల్లీ నుంచి పాట్నా మధ్య నడుస్తున్న వందేభారత్ రైలు చరిత్ర సృష్టించింది. దీపావళి పండగను పురస్కరించుకొని అత్యంత ఎక్కువ దూరం ప్రయాణించింది. పండగరోజు ఉదయం ఢిల్లీలో 8.25 గంటలకు బయలుదేరి రాత్రి 8.00 గంటలకు బీహార్ రాజధాని పాట్నా చేరుకుంది. ఈ క్రమంలో 994 కిలోమీటర్లను 11 గంటల 30 నిముషాల్లో అందుకుంది. కన్పూర్, ప్రయాగ్ రాజ్, డీడీయూ, బుక్సర్, అర్రా స్టేషన్లలో మాత్రమే హాల్టింగ్ సౌకర్యం కల్పించారు. ఢిల్లీ నుంచి వారానికి మూడు రోజులు నడుస్తుంది. బుధ, శుక్ర, ఆదివారాల్లో పాట్నాకు బయలుదేరుతుంది. తిరిగి పాట్నా నుంచి సోమవారం, గురువారం, శనివారాల్లో బయలుదేరుతుంది. పాట్నాలో ఉదయం 7.30 గంటలకు బయలుదేరి న్యూఢిల్లీకి సాయంత్రం 7.00 గంటలకు చేరుకుంటుంది. ఈ మార్గంలో త్వరలోనే వందేభారత్ స్లీపర్ ను ప్రవేశపెట్టబోతున్నారు.

రైల్వే సంఘాలన్నీ ఏకం కావాలి
గతంలో ఢిల్లీ నుంచి వారణాసి వరకు అత్యంత దూరం వందేభారత్ ప్రయాణించింది. ఎనిమిది గంటల్లో 771 కిలోమీటర్లు ప్రయాణించి గమ్యస్థానాన్ని చేరుకుంది. అంతసేపు కూర్చొని ప్రయాణించడం కష్టమనే భావనతో ఈ మార్గంలో కూడా వందేభారత్ స్లీపర్ ను ప్రవేశపెట్టబోతున్నారు. దేశవ్యాప్తంగా 16 మార్గాల్లో స్లీపర్ రైళ్లు అందుబాటులోకి రానున్నాయి. సిట్టింగ్ ఛార్జీలే అధికం అనుకుంటే స్లీపర్ ఇంకా అధికంగా ఉంటాయని, వాటిని సామాన్యులు భరించలేరని రైల్వే సంఘాల నాయకులు గగ్గోలు పెడుతున్నారు. క్రమేణా వీటిని అలవాటు చేసి సాధారణ రైళ్లను తగ్గించే ఆలోచనలో కేంద్రం ఉందని, ఇటువంటి కుయుక్తులను తిప్పికొట్టడానికి రైల్వే సంఘాలన్నీ ఏకం కావాలని ఆ సంఘ నాయకులు పిలుపునిస్తున్నారు.












Click it and Unblock the Notifications