రూటు మార్చిన మమతా బెనర్జీ-రెబెల్స్ పై అటాక్-రంగంలోకి సోనియా..!
పశ్చిమ బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత తృణమూల్ కాంగ్రెస్ (TMC)లో తలెత్తిన తిరుగుబాటు రోజుకో మలుపు తిరుగుతోంది. ఇప్పటికే టీఎంసీలో ఎమ్మెల్యేలు చీలిపోయి ప్రత్యేక వర్గంగా మారి విపక్ష నేత పదవి చేజిక్కించుకున్నారు. అలాగే లోక్ సభలో 20 మంది వరకూ ఎంపీలు తమను ఎన్డీయేలో భాగంగా గుర్తించాలని తాజాగా లోక్ సభ స్పీకర్ కు లేఖ రాశారు. ఈ నేపథ్యంలో గత వారం రోజులుగా ఆత్మరక్షణలో పడినట్లు కనిపించిన టీఎంసీ ఇవాళ రూటు మార్చింది.
పార్టీపై బహిరంగంగా ఆందోళనలు వ్యక్తం చేస్తూ, ఎన్డీఏకు మద్దతు ప్రకటించిన తిరుగుబాటు ఎంపీలకు తృణమూల్ కాంగ్రెస్ ఇవాళ గట్టి సందేశం ఇచ్చింది. టీఎంసీకి చెందిన 28 మంది లోక్‌సభ ఎంపీలలో కనీసం 20 మంది ఎన్డీయేతో పొత్తు పెట్టుకోవాలని నిర్ణయించుకున్నారని పార్టీలోని అసమ్మతి వర్గం పేర్కొన్న నేపథ్యంలో వారిని రాజీనామా చేసి వెళ్లాలని సవాల్ విసిరింది. వీరంతా రాజీనామా చేయకుండా ఫిరాయింపుకు సిద్ధమవుతున్న వేళ టీఎంసీ సవాల్ ప్రాధాన్యం సంతరించుకుంది.

సీనియర్ టీఎంసీ ఎంపీ కళ్యాణ్ బెనర్జీ.. కకోలీ ఘోష్ దస్తిదార్ నేతృత్వంలోని తిరుగుబాటు వర్గం తీరును విమర్శించారు. పార్టీతో అసంతృప్తిగా ఉన్న నాయకులు తమ పదవులకు రాజీనామా చేయాలని ఆయన కోరారు. ఏ నాయకుడికైనా పార్టీతో విభేదాలు ఉన్నా లేదా ఇకపై పార్టీతో కలిసి ఉండలేమని భావించినా, రాజీనామా చేయడమే నైతిక మార్గమని బెనర్జీ తేల్చిచెప్పేశారు. మరోవైపు ఇవాళ సాయంత్రం కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీతో మమతా బెనర్జీ భేటీ అవుతున్నారు. నిన్న ఇండియా కూటమి భేటీలో మమతను ఆప్యాయంగా పలకరించిన సోనియా.. ఇవాళ మాట్లాడేందుకు రమ్మని పిలిచినట్లు తెలుస్తోంది. దీంతో మమత సోనియా ఇంటికి వెళ్తున్నారు. అక్కడ మమతకు సోనియా దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది.














Click it and Unblock the Notifications