56 ఏళ్లుగా ఎవరికీ 'చెప్పుకోలేకపోయిన' ప్రయాణికులు!
తొలితరం రైళ్లలో టాయిలెట్లు లేవు. ఆ సమయంలో ప్రయాణికులు ఎంత ఇబ్బంది పడ్డారో, టాయిలెట్లు ఏర్పాటు చేయడానికి ఏయే అంశాలు దోహదపడ్డాయో తెలుసుకుందాం. భారతదేశం రైళ్లు 1853వ సంవత్సరంలో పట్టాలెక్కాయి. రైలు బండి ఏర్పాటుచేసిన కొత్తల్లో ఎటువంటి టాయిలెట్లు ఉండేవికావు. సమీపంలో ఏదో ఒక రైల్వేస్టేషన్ వచ్చేంతవరకు ప్రయాణికులు మలమూత్రాలను నియంత్రించుకోవల్సి వచ్చేది.
ఏదో ఒక రైల్వే స్టేషన్‌లో పని పూర్తి చేద్దామంటే.. ఇంతలో రైలు వెళ్లిపోతుందేమోననే ఆందోళనతో ప్రయాణికులుండేవారు. రైళ్లల్లో తొలిసారిగా 1909లో టాయిలెట్లను ఏర్పాటు చేశారు. 56 సంవత్సరాలు టాయిలెట్లు లేకుండానే రైలుబళ్లు నడిచాయి. 1909, జూలై 2వ తేదీన పశ్చిమ బెంగాల్‌లోని సాహిబ్‌గంజ్ రైల్వే డివిజన్‌కు ఓఖిల్ చంద్రసేన్ అనే ప్రయాణికుడు లేఖ రాశారు.

ఆ లేఖలో ఏముందంటే..
తాను రైలులో అహ్మద్ పూర్ బయలుదేరానని, మలవిసర్జన్ ఆపుకోవడంతో తన కడుపు బిగపట్టేసిందని, వెంటనే మలవిసర్జన కోసం ట్రాక్ పక్కనే కూర్చున్నట్లు తెలిపారు. అయితే కొంతసేపటికి గార్డు విజిల్ వేయడంతో రైలు బయలుదేరింది. దాన్ని అందుకోవడానికి తాను ఒక చేతిలో చెంబు, మరో చేత్తో ధోతి పట్టుకొని పరిగెత్తినట్లు చెప్పారు. అయితే కిందపడిపోవడంవల్ల అందరిముందు నవ్వులపాలయ్యానని, రైలును ఆపమని గార్డును కోరారని, కానీ ఆయన ఆపలేదని, తాను చాలా ఇబ్బంది పడ్డానన్నారు. ఆ గార్డుకు వెంటనే జరిమానా విధించాలని, లేదంటే తాను ఈ విషయాన్ని పత్రికలవారికి చెబుతానన్నాడు. ఆ లేఖ అందుకున్న రైల్వే శాఖ స్పందించి రైళ్లల్లో టాయిలెట్లు ఏర్పాటు చేసింది.












Click it and Unblock the Notifications