పంజా విసిరిన క్యుములోనింబస్ మేఘాలు
తమిళనాడులోని తూత్తుకుడి జిల్లాలో చోటుచేసుకున్న ఓ అరుదైన సంఘటన తీవ్ర భయాందోళనలకు గురిచేసింది. ఆకాశం నుంచి భూమికి తాకుతూ ఏర్పడ్డ టోర్నడో బీభత్సాన్ని సృష్టించింది. ఈ అసాధారణ వాతావరణ మార్పుల వల్ల సంభవించిన ఈ విపత్తు ధాటికి అక్కడ ఏవీ నిలవలేకపోయాయి. నివాసాలు, వాహనాలు, విద్యుత్ స్తంభాలు దెబ్బతిన్నాయి. ఓ ప్రైవేటు థీమ్ పార్క్ సైతం చిత్తయింది. అక్కడి ఓ టోల్ గేట్ నామరూపాల్లేకుండా పోయింది.
తూత్తుకుడి-తిరునెల్వేలి జాతీయ రహదారి వెంబడి ఉన్న వాగైకులం, ముడివైతానేందల్ గ్రామాల పరిసర ప్రాంతాల్లో ఈ వాతావరణ బీభత్సం తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. ఈ గాలుల ధాటికి ఇక్కడ సుమారు 200 ఇళ్ల పైకప్పులు గాలిలోకి ఎగిరిపోయాయి. వందల సంవత్సరాల చరిత్ర కలిగిన భారీ వృక్షాలు సైతం నేలకొరిగాయి. అనేక చోట్ల కరెంటు స్తంభాలు విరిగిపడడంతో వైర్లు రోడ్డుపై పడిపోయి వాహనదారులను ప్రమాదాలకు గురి చేసింది. విద్యుత్ సరఫరాలో తీవ్ర అంతరాయం ఏర్పడింది.

జాతీయ రహదారి వెంబడి ఉన్న ఓ ప్రైవేట్ థీమ్ పార్కులోని వినోద క్రీడా పరికరాలు ఈ బలమైన గాలుల ధాటికి పూర్తిగా ధ్వంసమయ్యాయి. అలాగే ఇక్కడి టోల్ ప్లాజా వద్ద ఉన్న గ్లాస్ కేబిన్లు, కంప్యూటర్లు దెబ్బతినడంతో అధికారులు వాహనాలను ఉచితంగా వదిలివేయాల్సి వచ్చింది. ఈ ప్రాంతంలో దాదాపు రూ. 5 కోట్ల నుంచి రూ. 6 కోట్ల వరకు భారీ ఆస్తి నష్టం వాటిల్లి ఉంటుందని స్థానికులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు.
Rare Tornado in Thoothukudi. This is rarest of the rarest.
— Tamil Nadu Weatherman (@praddy06) June 21, 2026
Credits to the concerned. pic.twitter.com/PP3ONCjOc0
ఇక్కడి గ్రౌండ్ లో క్రికెట్ ఆడుతున్న తొమ్మిది మంది యువకులు ఈ సుడిగాలి తీవ్రతకు గాల్లోకి కొట్టుకుపోయే పరిస్థితి తలెత్తింది. వారు ప్రాణభయంతో ఒకరినొకరు గట్టిగా పట్టుకుని నేలపై పడుకోవడంతో క్షేమంగా బయటపడ్డారు. ఈ ఘటనలో ఇద్దరికి స్వల్ప గాయాలు కావడం మినహా ఎటువంటి ప్రాణనష్టం జరగకపోవడం పెద్ద ఊరటనిచ్చింది. స్థానికులు సామాజిక మాధ్యమాల్లో షేర్ చేసిన వీడియోలు వైరల్ అయ్యాయి.
#WATCH | Thoothukudi, Tamil Nadu | Strong cyclonic winds cause heavy damage in the region.
— ANI (@ANI) June 22, 2026
(Visuals from the Vaagaikulam toll plaza area) pic.twitter.com/39TfpIilzs
చెన్నై రీజినల్ మెటెరొలాజికల్ సెంటర్ దీనిపై స్పందించింది. తూత్తుకుడి తీర ప్రాంతంలో సంభవించింది అసలైన టోర్నడో కాదని తెలిపింది. క్యుములోనింబస్ మేఘాల వల్లే ఏర్పడిన 'థండర్‌స్టార్మ్ అప్‌డ్రాఫ్ట్' గా గుర్తించారు. బంగాళాఖాతంపై సముద్ర మట్టానికి సుమారు 3.1 కిలోమీటర్ల ఎత్తులో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావం ఇందుకు ప్రధాన కారణమని అధికారులు వెల్లడించారు.
నైరుతి రుతుపవనాల కాలంలో తూత్తుకుడి తీర ప్రాంతాల్లో నిజమైన టోర్నడోలు ఏర్పడడానికి వీలైన నిర్దిష్ట వాతావరణ పరిస్థితులు ఉండవు. తీవ్రమైన సుడిగాలి లేదా నిజమైన టోర్నడో ఏర్పడడానికి అవసరమైన అధిక గాలి పీడనం, తీవ్ర గాలి వేగ వ్యత్యాసాలు (విండ్ షీయర్) ఈ దక్షిణ ప్రాంతంలో సాధారణంగా నమోదు కావు. రుతుపవనాల సీజన్ లో ఇలాంటి క్లౌడ్ అప్‌డ్రాఫ్ట్‌లు ఎంతటి హింసాత్మక వినాశనాన్ని సృష్టించగలవో ఈ ఘటన నిరూపించింది.













Click it and Unblock the Notifications