భారత్ పై పంతం నెగ్గించుకున్న ట్రంప్?
India US Trade deal: భారత్ పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన పంతాన్ని నెగ్గించుకున్నారు. భారత్ తో ట్రేడ్ డీల్ కొలిక్కి వచ్చింది. ప్రస్తుతం ఇది తుది మెరుగులు దిద్దుకుంటోంది. ఇంకో వారం రోజుల వ్యవధిలో ఈ రెండు దేశాల మధ్య వాణిజ్య ఒప్పందం కుదరడం ఖాయంగా కనిపిస్తోంది.
పాకిస్తాన్ పై భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ ను నిలిపివేయడానికి ట్రేడ్ డీల్ ను తెర మీదికి తెచ్చినట్లు గతంలో పలుమార్లు చెప్పుకొంటూ వచ్చారు డొనాల్డ్ ట్రంప్. సౌదీ అరేబియా, నెదర్లాండ్స్ వంటి విదేశీ పర్యటనల సమయంలోనూ ఇదే అంశాన్ని ప్రస్తావిస్తూ వచ్చారు. యుద్ధాన్ని కొనసాగిస్తే ట్రేడ్ డీల్ ను కుదుర్చుకోమంటూ హెచ్చరించారు.

కారణాలు ఏవైనప్పటికీ- ఆపరేషన్ సింధూర్ ను రెండు రోజుల వ్యవధిలోనే ముగించింది కేంద్రం. ఇప్పుడు అదే వాణిజ్య ఒప్పందాలు త్వరలో కుదరబోతోన్నాయి.. భారత్- అమెరికా మధ్య. దీనిపై ఇప్పటివరకు సాగించిన చర్చలు కొలిక్కి వచ్చాయి. త్వరలో ఇరు దేశాల అధికారులు సంతకాలు చేయనున్నారు.
దీనిపై త్వరలోనే ఓ అధికారిక ప్రకటన వెలువడుతుందని వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ తెలియజేశారు. డొనాల్డ్ ట్రంప్- ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మధ్య సత్సంబంధాలు ఉన్నాయని, అవి కొనసాగుతాయని అన్నారు. ఆపరేషన్ సింధూర్ విషయంలో విభేదాలు తలెత్తినట్లు వచ్చిన వార్తలను ఆమె తోసిపుచ్చారు.
ఆ దేశ కాలమానం ప్రకారం.. సోమవారం సాయంత్రం ఆమె వైట్ హౌస్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. భారత్-అమెరికా మధ్య ట్రేడ్ డీల్ గురించి విలేకరులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలను ఇచ్చారు. తాను ఇంతకుముందే తమ దేశ వాణిజ్య మంత్రితో మాట్లాడానని, ప్రస్తుతం ఆయన ట్రంప్ తో కలిసి ఓవల్ ఆఫీస్ లో ఉన్నారని వివరించారు.
భారత్ తో కుదుర్చుకోవాల్సిన ట్రేడ్ డీల్ పై చర్చిస్తోన్నారని కరోలిన్ లీవిట్ తెలిపారు. దీని గురించి డొనాల్డ్ ట్రంప్ త్వరలోనే అధికారిక ప్రకటన చేస్తారని పేర్కొన్నారు. ఆసియా పసిఫిక్ రీజియన్ లో భారత్ ఒక వ్యూహాత్మక మిత్ర దేశమని ఆమె స్పష్టం చేశారు. ప్రధాని మోదీతో ట్రంప్ కు సుదీర్ఘకాలంగా సత్సంబంధాలు ఉన్నాయని గుర్తు చేశారు. అవి కొనసాగుతాయనీ అన్నారు.
కాగా- కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ ప్రత్యేక కార్యదర్శి రాజేష్ అగర్వాల్ నేతృత్వంలోని భారత బృందం ప్రస్తుతం అమెరికాలో పర్యటిస్తోన్న విషయం తెలిసిందే. ఆ దేశంతో కుదర్చుకోవాల్సిన వాణిజ్య ఒప్పందాలపై ఏర్పాటు చేసిన చర్చల్లో పాల్గొంటోంది.
నిజానికి- ఈ బృందం అమెరికా పర్యటన జూన్ 26వ తేదీ నాటికి ముగియాల్సి ఉన్నప్పటికీ- ఒప్పందాలు తుదిదశకు చేరుకున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఈ తేదీని కేంద్ర ప్రభుత్వం పొడిగించింది. జులై 2వ తేదీ వరకు రాజేష్ అగర్వాల్ టీమ్ అమెరికాలోనే పర్యటించే అవకాశాలు ఉన్నాయి.
ఈ చర్చలు చాలా కీలకమైనవి. డొనాల్డ్ ట్రంప్ ఏప్రిల్ 2వ తేదీన విధించిన రెసిప్రొకల్ టారిఫ్‌ల గడువు జూలై 9వ తేదీతో ముగియాల్సి ఉంది. ఈలోగా వాణిజ్య ఒప్పందాలను ఖరారు చేయడానికి రెండు దేశాలు కూడా తమ ప్రయత్నాలు సాగిస్తోన్నాయి. ఏప్రిల్ 2న అమెరికా భారత వస్తువులపై అదనంగా 26 శాతం రెసిప్రొకల్ టారిఫ్‌ను విధించింది. దీన్ని 90 రోజుల పాటు నిలిపివేసింది.












Click it and Unblock the Notifications