సీఎం కారుకు ఫైన్ వేసి ఝలక్ ఇచ్చిన ట్రాఫిక్ పోలీసులు.. కట్ చేస్తే !
కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రయాణించే అధికారిక కారుపైనా ట్రాఫిక్ ఉల్లంఘనల చలానాలు ఉండటం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. సీఎం వాహనంపై మొత్తం ఏడు చలానాలు నమోదయ్యాయని ట్రాఫిక్ శాఖ వెల్లడించింది. ఈ విషయం వెలుగులోకి రావడంతో జోరుగా చర్చ నడిచింది.
సీటు బెల్ట్ ఉల్లంఘనలే ఎక్కువ..
ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కారుపై నమోదైన చలానాల్లో ఆరుసార్లు సీటు బెల్ట్ ధరించకపోవడం.. ఒకసారి అతివేగం కారణంగా జరిమానా పడిందని తెలుస్తోంది. సీఎం వాహనం మీదే ఇలాంటి ఉల్లంఘనలు నమోదవడం సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీసింది. సాధారణ ప్రజలు తప్పులు చేస్తే భారీగా జరిమానాలు వసూలు చేస్తున్నారు. సీఎం కారుపై ఉన్న చలానాలు ఎందుకు చెల్లించడం లేదు?" అంటూ నెటిజన్లు ప్రశ్నలు లేవనెత్తారు.

మరోవైపు కర్ణాటక ప్రభుత్వం వాహనదారులకు ఊరట కల్పిస్తూ ట్రాఫిక్ చలానాలపై 50 శాతం డిస్కౌంట్ స్కీమ్‌ను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆగస్టు 21న ప్రారంభమైన ఈ స్కీమ్ సెప్టెంబర్ 19 వరకు కొనసాగనుంది. జరిమానా పడిన వాహనదారులు సగం మొత్తం చెల్లిస్తే.. మిగతా మొత్తాన్ని మాఫీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఈ రాయితీ వలన వాహనదారులు పెద్ద ఎత్తున లబ్ధి పొందుతున్నారు. ఇప్పటికే వేలాది మంది ఈ పథకాన్ని ఉపయోగించుకున్నారు.
డిస్కౌంట్ స్కీమ్‌తో జరిమానా చెల్లింపు..
ఈ విమర్శల నేపథ్యంలో సీఎం యంత్రాంగం ముందుకు వచ్చి తాజాగా అమలులోకి వచ్చిన 50% డిస్కౌంట్ స్కీమ్‌ను వినియోగించుకుంది. మొత్తం జరిమానాపై రాయితీ లభించగా.. చివరికి రూ.8,750 చెల్లించినట్లు అధికారులు తెలిపారు. దీంతో సాధారణ వాహనదారుల మాదిరిగానే సీఎం కూడా ఈ పథకం కింద జరిమానా చెల్లించినట్టయింది.

ఇక రాయితీ పథకంతో ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు సుమారు రూ.40 కోట్ల వరకు వసూళ్లు జరిగాయని సమాచారం. సాధారణంగా చలానాలు చెల్లించకుండా వదిలిపెట్టే వారు కూడా, ఇప్పుడు సగం మొత్తాన్ని చెల్లించి కేసులు క్లియర్ చేసుకోవడానికి ముందుకొస్తుండడం మంచి విషయం అని భావిస్తున్నారు. అంతే కాకుండా ఈ పథకం వలన రోడ్లపై క్రమశిక్షణ పెరగవచ్చని అధికారులు భావిస్తున్నారు. సామాన్య ప్రజలపై భారం తగ్గుతుందని కూడా అంటున్నారు.












Click it and Unblock the Notifications