ఒకే ఆపరేషన్: ప్రాణాలు కోల్పోయిన భార్యాభర్తలు
మహారాష్ట్రలోని పుణెలో జరిగిన ఒక హృదయ విదారక సంఘటన చోటుచేసుకుంది. భర్త ప్రాణాలను కాపాడేందుకు భార్య తన లివర్‌ను దానం చేసింది. అయితే వైద్యులు కాలేయ మార్పిడి శస్త్రచికిత్సలో దురదృష్టవశాత్తూ భార్యాభర్తలిద్దరూ ప్రాణాలు కోల్పోయారు. పుణెకు చెందిన ఓ వ్యక్తి కొంతకాలంగా తీవ్రమైన కాలేయ సమస్యతో బాధపడుతూ ఉన్నాడు. వైద్యులు లివర్ మార్పిడి చేయడమే చవరి మార్గమని సూచించారు. ఈ క్రమంలో తన భార్య ప్రాణాలను సైతం లెక్క చేయకుండా భర్తకు కాలేయం దానం చేసింది. అవసరమైన టెస్టులు పూర్తి కావడతో వైద్యులు ఆపరేషన్‌కు సిద్ధం చేశారు.
కానీ దురదృష్టవశాత్తు ఆపరేషన్ సమయంలో పరిస్థితి విషమించింది. ముందుగా కాలేయం దానం చేసిన భార్య ప్రాణాలు కోల్పోయింది. ఆ వెంటనే చికిత్స పొందుతున్న భర్త కూడా ప్రాణాలను కోల్పోవడంతో కుటుంబంలో విషాదం నెలకొంది. ప్రాణం పణంగా పెట్టి భర్తను కాపాడాలనుకున్న భార్య చేసిన త్యాగం చివరికి ఇద్దరి మరణంతో ముగియడంతో ప్రతి ఒక్కరి కళ్లు చెమర్చాయి. బాపు కోమ్కార్ అనే రోగికి.. అతని భార్య కామిని తన లివర్‌లో కొంత భాగాన్ని దానం చేశారు. ఆగస్టు 15న ఆస్పత్రిలో ఆపరేషన్లు చేయించుకున్నారు. లివర్ మార్పిడి ఆపరేషన్ తర్వాత బాపు కోమార్ ఆరోగ్యం క్షీణించి ఆగస్టు 17న ప్రాణాలు విడిచారు. అతని భార్య కామిని ఆగస్టు 21న ఇన్ఫెక్షన్ వచ్చి చికిత్స సమయంలో మరణించింది. ఈ నేపథ్యంలో వైద్యుల నిర్లక్ష్యం వల్లే ఈ మరణాలు జరిగాయని వారి కుటుంబ సభ్యులు ఆరోపించారు. దీనిపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు. మరో వైపు ప్రామాణిక వైద్య ప్రోటోకాల్స్ ప్రకారం ఆపరేషన్లు జరిగాయని ఆస్పత్రి తెలిపింది.

శస్త్రచికిత్స ప్రమాదాల గురించి కుటుంబానికి, దాతకు ముందుగానే పూర్తిగా కౌన్సెలింగ్ అందించామని ఆస్పత్రి వెల్లడించింది. దర్యాప్తులో తాము పూర్తిగా సహకరిస్తున్నామని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. మహారాష్ట్ర ఆరోగ్య శాఖ పుణెలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి నోటీసు జారీ చేసిందని ఒక అధికారి పేర్కొన్నారు. లివర్ మార్పిడి ప్రక్రియకు సంబంధించిన అన్ని వివరాలను సమర్పించాలని సహ్యాద్రి ఆసుపత్రిని ఆదేశించినట్లు ఆరోగ్య సేవల డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ నాగనాథ్ యెంపల్లె తెలిపారు. నాగనాథ్ యెంపల్లె తెలిపిన వివరాల ప్రకారం, సహ్యాద్రి ఆసుపత్రిలో జరిగిన ఈ ఆపరేషన్ వివరాలను సోమవారం నాటికి సమర్పించాలని ఆదేశించారు.
ఈ విషాద సమయంలో బాధిత కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, అత్యున్నత ప్రమాణాల సంరక్షణను అందిస్తామని ఆసుపత్రి ప్రకటనలో హామీ ఇచ్చింది. మొత్తం మీద, భర్తకు ప్రాణం పోయడానికి ముందుకు వచ్చిన భార్య, చివరికి ఇద్దరూ ప్రాణాలు కోల్పోవడం పూణేలో చర్చనీయాంశంగా మారింది. దీనిపై ఆరోగ్య శాఖ విచారణ కొనసాగుతోంది.












Click it and Unblock the Notifications