ట్రైన్‌లో నుంచి జారిపడి ఐదుగురు మృతి, పలువురికి సీరియస్ .. ఎక్కడంటే ?
రోజూ చేసే ప్రయాణం ఈరోజు మాత్రం వారికి చివరి ప్రయాణంగా మారింది. మరి కొద్దిసేపట్లో గమ్యస్థానాల్ని చేరుకుంటాం అనుకునే లోపే వారిని మృత్యువు కబళించింది. రద్దీగా ఉన్న లోకల్ ట్రైన్ నుంచి ప్రయాణికులు జారి పడటంతో ఐదుగురు మృతి చెందగా.. మరి కొందరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ విషాద ఘటన మహారాష్ట్ర రాజధాని ముంబైలో చోటు చేసుకుంది.
ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్ నుంచి థానే జిల్లాలోని కసార ప్రాంతానికి వెళ్తుండగా.. ముంబ్రా- దివా రైల్వే స్టేషన్ల మధ్య ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. తీవ్రమైన రద్దీ వల్ల కొందరు ప్రయాణికులు డోర్ల వద్ద వేలాడుతూ ప్రయాణించడమే ఇందుకు కారణమని అధికారులు స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే వారు అదుపుతప్పి కిందపడిపోయారని వెల్లడించారు.

ఈ దుర్ఘటనలో 12 మంది ప్రయాణికులు రైలు నుంచి కింద పడిపోయినట్లు అధికారులు తెలిపారు. ఐదుగురు స్పాట్ లోనే మరణించగా.. మిగతా వారికి తీవ్ర గాయాలయ్యాయని వెల్లడించారు. ప్రమాదం జరిగిన వెంటనే రైల్వే అధికారులు సంఘటనా స్థలానికి చేరుకొని.. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన వారి పరిస్థితి గురించి ఇంకా తెలియాల్సి ఉంది.
మరోవైపు ఈ ఘటనపై రైల్వే శాఖ దర్యాప్తు ప్రారంభించింది. ప్రమాదానికి గల కచ్చితమైన కారణాలు, పరిస్థితులపై అధికారులు లోతుగా విచారణ జరుపుతున్నారు. ముంబై లోకల్ ట్రైన్లలో తరచూ కనిపించే రద్దీ సమస్య మరోసారి ఈ ఘటనతో వెలుగులోకి వచ్చింది. బాధితులను ప్రభుత్వం ఆదుకొని న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు.












Click it and Unblock the Notifications