పెళ్లి విందులో విషాదం.. 'చికెన్ ముక్క' కోసం స్నేహితుడి దారుణ హత్య
Karnataka: కర్ణాటకలోని బెళగావి జిల్లాలో ఇటీవల జరిగిన ఒక పెళ్లి విందు విషాదంగా ముగిసింది. అదనపు చికెన్ ముక్క అడిగిన చిన్నపాటి కారణం ఒక స్నేహితుడి ప్రాణం తీసింది. ఈ ఘటన ఆదివారం నాడు బెళగావి జిల్లా యరగట్టి తాలూకాలో చోటుచేసుకుంది. యరగట్టి తాలూకాకు చెందిన వినోద్ మాలశెట్టి(30) తన సన్నిహిత స్నేహితుడు అభిషేక్ కొప్పాడ్ వివాహం చేసుకున్న సందర్భంగా ఏర్పాటు చేసిన విందు వేడుకకు హాజరయ్యాడు. అభిషేక్ తన పొలంలో ఈ వివాహానంతర విందును ఘనంగా ఏర్పాటు చేశాడు. ఈ విందులో మాంసాహార వంటకాలు కూడా ఉన్నాయి.
వివాదం ఎలా మొదలైంది?
పెళ్లి విందులో ఆహారం వడ్డిస్తున్న విఠల్ హరుగొప్ప అనే వ్యక్తి దగ్గర వినోద్ మరో చికెన్ ముక్క వేయాలని అడిగాడు. వినోద్ తనకు తక్కువగా చికెన్ వడ్డించారని ఫిర్యాదు చేశాడు. ఇంకొంచెం చికెన్ వేయాలనే చిన్నపాటి డిమాండ్‌తో వినోద్, విఠల్‌ల మధ్య మొదట మాటల యుద్ధం జరిగింది. అది క్రమంగా తీవ్ర వాగ్వాదానికి దారితీసింది. వాదన తీవ్రస్థాయికి చేరడంతో విఠల్ కోపోద్రిక్తుడయ్యాడు. ఆవేశంలో అక్కడే ఉల్లిపాయలు కోయడానికి ఉపయోగిస్తున్న ఒక కత్తిని తీసుకుని ఎటువంటి ఆలోచన లేకుండా వినోద్‌ను పొడిచాడు. కత్తిపోటు కారణంగా వినోద్ తీవ్ర రక్తస్రావానికి గురై అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.

ఈ దారుణ ఘటన అనంతరం పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. నిందితుడు విఠల్ హరుగొప్పపై హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పోలీసులు ఈ ఘటన వెనుక మరిన్ని కారణాలు ఉన్నాయా అనే కోణంలోనూ విచారణ జరుపుతున్నారు. కేవలం ఒక చికెన్ ముక్క కోసం ఇంత దారుణ జరగడం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.












Click it and Unblock the Notifications