ఎవడు ఎక్కడ చెయ్యెస్తాడో తెలియదు..- ట్రైన్ జర్నీలో మహిళకు భయానక అనుభవం
దీపావళి పండగ సీజన్ లో ఏర్పడే ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దేశవ్యాప్తంగా అందుబాటులోకి తీసుకొచ్చిన ప్రత్యేక రైళ్లు కిటకిటలాడాయి. ప్రత్యేకించి- బీహార్, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్ లకు నడిపించిన రైళ్లు కిటకిటలాడాయి. అడుగు తీసి అడుగు పెట్టలేనంత రద్దీ కనిపించింది. అటు రైల్వే స్టేషన్లు సైతం క్రిక్కిరిసిపోయాయి. దేశవ్యాప్తంగా 12,000 అదనపు రైళ్లను నడిపించినట్లు సంబంధిత మంత్రిత్వ శాఖ ప్రకటించినప్పటికీ- అందులో ఎంతమేర వాస్తవం ఉందనే అనుమానాలను రేకెత్తించాయి.
ఉత్తరాది రాష్ట్రాలవారికి ప్రత్యేకించి బీహార్, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్ లల్లో నివసించే వాళ్లు దీపావళి, ఛాత్ పూజ అతిపెద్ద పండగ. అందుకే దేశంలో ఎక్కడ నివసిస్తోన్నా గానీ.. దీపావళికి స్వస్థలాలకు బయలుదేరి వెళ్తుంటారు. ఛాత్ పూజను కుటుంబ సభ్యులతో కలిసి జరుపుకొంటారు. ఈ పండగ సీజన్ లో దక్షిణ- ఉత్తరాదిని కనెక్ట్ చేస్తూ వేల సంఖ్యలో ప్రత్యేక రైళ్లను ప్రవేశపెట్టడం ఆనవాయితీ. ఈ సారి కూడా రైల్వే అధికారులు దీన్ని కొనసాగించారు గానీ.. అవి ఎంతమాత్రం సరిపోలేదనేది క్రిక్కిరిసిన రైళ్లను చూస్తే ఇట్టే తెలిసిపోతుంది.

జనరల్ బోగీలు సరిపోక, స్లీపర్ క్లాస్ లల్లో రిజర్వేషన్ దొరక్క చాలామంది టికెట్లు తీసుకోకుండా ప్రయాణించారు. ఏసీ బోగీలను సైతం వదల్లేదు. ఏసీ బోగీలన్నీ కూడా టికెట్ లెస్ ట్రావెలర్స్ తో నిండిపోయాయి. అడ్వాన్స్డ్ టికెట్స్ తీసుకున్న ప్రయాణికులు కనీసం కూర్చోడానిక్కూడా సీట్ దొరకని దుర్భర పరిస్థితులను ఎదుర్కొన్నారు. దర్జాగా సీట్లను ఆక్రమించుకున్నారని, వారి గుంపును చూసి కనీసం లేవమని చెప్పే ప్రయత్నం కూడా చేయలేకపోయానని ఓ మహిళా ప్రయాణికురాలు చెప్పుకొచ్చారు.
పండగ సీజన్ లో రైలు ప్రయాణం ఇంత భయానకంగా ఉంటుందనుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సీజన్ లో రైలులో ప్రయాణించడం ఎంత కష్టమో బాగా తెలియవచ్చిందని, స్టేషన్ లో రైలు ఎక్కడానిక్కూడా కొట్లాడాల్సి వచ్చిందని, కోచ్ లోకి వచ్చాక సీట్ కోసం మరోసారి గొడవ తప్పట్లేదని పేర్కొన్నారు. క్రిక్కిరిసిపోయిన స్టేషన్ లో రైలు ఎక్కడం ఎంత కష్టమో, అందులో ప్రయాణించడం కూడా అంతే కష్టంగా మారిందని అన్నారు.
ముందస్తు ఏర్పాట్లు చేశామని రైల్వే అధికారులు వెల్లడించినప్పటికీ.. ఈ జనాలను చూస్తోంటే అవి నమ్మదగ్గట్లుగా లేదని నితిన్ జైన్ అనే ప్రయాణికుడు చెప్పాడు. సీట్ల కోసం మహిళలు, పిల్లలు, వృద్ధులు సైతం.. చీకటి, దుమ్ము ధూళిలో ప్లాట్ ఫామ్ కూర్చుని 12 గంటలకు పైగా వేచి ఉన్నారని వివరించాడు. రైలులో నిలబడటానికి కూడా చోటు లేదని, టాయిలెట్లను కూడా ఆక్రమించారని, పరిస్థితి చాలా దారుణంగా ఉందని చెప్పుకొచ్చాడు.












Click it and Unblock the Notifications