సంవత్సరానికి 10 వంటగ్యాస్ సిలిండర్లు ఉచితం: మేనిఫెస్టోలో హైలైట్
Mamata Banerjee: ఈ నెల 19వ తేదీన లోక్‌సభ ఎన్నికల పర్వం మొదలు కాబోతోంది. ఏడు దశల్లో ముగిసే ఎన్నికలు ఇవి. తొలి విడత పోలింగ్ 19వ తేదీన షెడ్యూల్ అయింది. మొత్తం 21 రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాల్లో 102 స్థానాలకు పోలింగ్ నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది కేంద్ర ఎన్నికల సంఘం. జూన్ 1వ తేదీ నాటితో ఏడు దశల పోలింగ్ ముగుస్తుంది. 4వ తేదీన ఓట్లను లెక్కిస్తారు.
ఈ ఎన్నికల నేపథ్యంలో.. ప్రచార వేడి పతాక స్థాయికి చేరుకుంది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ- ఎన్డీఏ, ప్రతిపక్షాల ఉమ్మడి కూటమి ఇండియా ఈ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. గెలిచి తీరాలనే పట్టుదలను ప్రదర్శిస్తోన్నాయి. దీనికోసం అవసరమైన వ్యూహాలను రూపొందించుకున్నాయి.

పశ్చిమ బెంగాల్‌లోని 42 లోక్‌సభ స్థానాలకు అన్ని దశల్లో అంటే ఏడు విడతల్లో పోలింగ్ జరుగనుంది. ఈ నెల 19వ తేదీన తొలివిడతలో కూచ్‌బిహార్, అలీపూర్‌దార్, జల్‌పాయ్‌గురి లోక్‌సభ నియోజకవర్గాల్లో పోలింగ్‌కు ఏర్పాట్లు పూర్తయ్యాయి.
ఈ నేపథ్యంలో- అధికార తృణమూల్ కాంగ్రెస్.. తన ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసింది. పార్టీ అధినేత్రి, ముఖ్యమంత్రి మమత బెనర్జీ దీన్ని విడుదల చేశారు. పలు సంక్షేమ, ప్రజాకర్షక పథకాలను ఇందులో ప్రకటించారు.
1. దారిద్ర్యరేఖకు దిగువన ఉన్న ప్రతి కుటుంబానికి కూడా సంవత్సరానికి 10 వంటగ్యాస్ సిలిండర్లను ఉచితంగా సరఫరా చేస్తామని మమత బెనర్జీ హామీ ఇచ్చారు. పేద కుటుంబాలు ఒక్క రూపాయి కూడా వంటగ్యాస్ సిలిండర్ల కోసం చెల్లించనక్కర్లేదు. దానికి అయ్యే ఖర్చు మొత్తాన్ని కూడా ప్రభుత్వమే భరిస్తుంది.

2. రేషన్ కార్డు ప్రతి కుటుంబానికీ ప్రతి నెలా అయిదు కేజీల బియ్యం ఉచితంగా పంపిణీ. కార్డుదారుల ఇళ్ల వద్దకే రేషన్ బియ్యాన్ని చేరవేస్తామని మమత బెనర్జీ భరోసా ఇచ్చారు. ఈ విషయంలో ఆ పార్టీ ఏపీలో అమలవుతున్న ఇంటింటికీ బియ్యం పంపిణీ పథకాన్ని అనుసరించినట్టయింది.
3. పెట్రోల్, డీజిల్ ధరలను నియంత్రించడానికి ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు. దీనికోసం ఇంధన ధరల స్థిరీకరణ నిధిని అందుబాటులోకి తెస్తామని పేర్కొన్నారు. వాహనదారులకు అనుకూలంగా ఉండేలా పెట్రోల్, డీజిల్ ధరలను నిర్ధారిస్తారు. దానిపై ఎంత పెరిగినప్పటికీ- దానికి అయ్యే ఆర్థిక భారాన్ని ప్రభుత్వమే భరిస్తుంది.
4. ఉన్నత విద్య స్కాలర్‌షిప్‌లను అందుకుంటోన్న ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ విద్యార్థుల భారీగా పెంపు. వృద్ధాప్య పెన్షన్‌ను అందుకుంటోన్న వారికి ఇప్పుడు మంజూరు చేస్తోన్న పెన్షన్ మొత్తానికి అదనంగా ప్రతి నెలా 1,000 రూపాయలు మంజూరు. సంవత్సరానికి 12,000 రూపాయల అదనంగా ఇస్తామని హామీ.
5. కన్యశ్రీ పథకం కింద ప్రతి విద్యార్థినికీ స్కాలర్‌షిప్ మంజూరు. లక్ష్మీర్ భండార్ పథకం కింద ప్రతి మహిళకూ ఆర్థికంగా చేయూత కల్పించడం, స్వాస్థ్య సాథీ స్కీం కింద మహిళలకు 10 లక్షల వరకు ఆరోగ్య బీమా కవరేజీని అందిస్తామని మమత బెనర్జీ ప్రకటించారు.
6. 25 సంవత్సరాల లోపు వయస్సు గల గ్రాడ్యుయేట్లు, డిప్లొమా చదివిన విద్యార్థులందరికీ కూడా ఏడాది పాటు అప్రెంటిస్‌షిప్ కల్పన. ఇందులో భాగంగా ప్రతి నెలా స్టైపెండ్ మంజూరు.
7. స్వామినాథన్ కమిషన్ సిఫారసుల మేరకు రైతులందరికీ కనీస మద్దతు ధర తప్పనసిరిగా మంజూరు. దానికి చట్టబద్ధత కల్పిస్తామని హామీ. అన్ని పంటలకు కూడా సగటున రైతులు పెట్టే పెట్టుబడి వ్యాయానికి 50 శాతానికి పైగా కనీస మద్దతు ధర కల్పించేలా చర్యలు. 8. దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న ప్రతి కుటుంబానికీ పక్కా ఇళ్లు మంజూరు.












Click it and Unblock the Notifications