TRP scam:చిక్కుల్లో అర్నాబ్ గోస్వామి: బార్క్ మాజీ సీఈఓ సంచలన ఆరోపణలు,మళ్లీ జైలుకేనా..?
ముంబై: చెప్పేవి శ్రీరంగనీతులు చేసేవి అడ్డమైన పనులు అని చెప్పేందుకు ప్రముఖ జర్నలిస్టు రిపబ్లిక్ టీవీ ఎడిటర్ అర్నాబ్ గోస్వామే నిదర్శనం అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. తన ఛానెల్‌ను ప్రమోట్ చేసుకునేందుకు స్విచ్ ఎక్కడ నొక్కాలో అక్కడే నొక్కారు. నోరు తెరిస్తే అవినీతి గురించి క్లాసులు పీకే అర్నాబ్ మాత్రం అదే లంచంతో తమ ఛానెల్‌ను ప్రమోట్ చేసుకుంటున్నారు. ఇదే విషయం బార్క్ మాజీ సీఈఓ పార్థ్ దాస్ గుప్తా అరెస్టుతో బయటపడింది. తనను కూడా లంచం ఇచ్చి మేనేజ్ చేశారని పోలీసుల విచారణలో సంచలన ఆరోపణలు చేశారు పార్థ్ దాస్ గుప్తా.
అర్నాబ్ గోస్వామి కథ క్లోజేనా.. బాలీవుడ్ ఇండస్ట్రీ కథనాలపై ఢిల్లీ హైకోర్టులో పిటిషన్..!

టీఆర్‌పీల కోసం ముడుపులు
టీఆర్‌పీ రేటింగ్స్ స్కామ్‌లో అరెస్టయిన బ్రాడ్‌కాస్ట్ రీసెర్చ్ ఆడియెన్స్ కౌన్సిల్ (బార్క్)మాజీ సీఈఓ పార్థ్ దాస్‌గుప్తా సంచలన ఆరోపణలు చేశారు. ముంబై పోలీసుల విచారణలో తన ఛానెల్‌ను ప్రమోట్ చేసేందుకు రిపబ్లిక్‌టీవీ యజమాని మరియు ఎడిటర్ అర్నాబ్ గోస్వామి తనకు లక్షల్లో లంచం ఇవ్వడంతో పాటు మరో ఖరీదైన చేతి గడియారం ఇచ్చారని చెప్పినట్లు సమాచారం.పార్థ్ దాస్‌గుప్తా ఇంట్లో సోదాలు నిర్వహించిన ముంబై పోలీసులు తన ఇంటినుంచి మూడు కిలోల వెండిని స్వాధీనం చేసుకున్నారు. 2013 నుంచి 2019 మధ్య తాను బార్క్ సీఈఓగా ఉన్న సమయంలో అర్నాబ్ గోస్వామి ఇచ్చిన డబ్బులతోనే ఈ మూడు కిలోల వెండిని కొనుగోలు చేసినట్లు పార్థ్ దాస్‌గుప్తా చెప్పినట్లు సమాచారం. ఇంగ్లీష్ న్యూస్ ఛానెల్ రిపబ్లిక్ టీవీ మరియు హిందీ రిపబ్లిక్ భారత్‌లను ప్రమోట్ చేసేందుకు ముడుపులు ముట్టజెప్పినట్లు పార్థ్ దాస్ గుప్తా ముంబై పోలీసులతో వివరించారు.

పార్థ్ దాస్ గుప్తా వద్ద రహస్య సమాచారం
డిసెంబర్ 24వ తేదీన ముంబై క్రైంబ్రాంచ్ పోలీసులు గోవా నుంచి పూణేకు వస్తున్న పార్థ్ దాస్ గుప్తాను పూణే జిల్లాలో అరెస్టు చేశారు. అర్నాబ్ గోస్వామి లంచం ఇవ్వడంతో టీఆర్‌పీ రేటింగ్స్‌ను మ్యానుపులేట్ చేశారని నిర్థారణ అయ్యిందని ముంబై పోలీసులు ధృవీకరించారు. టీఆర్‌పీ రేటింగ్స్ కోసం వినియోగించే బారోమీటర్ ఎవరి ఇళ్లపై అయితే ఫిక్స్ చేయడం జరిగిందో రహస్యంగా ఉండాల్సిన ఆ సమాచారంను దాస్‌గుప్తాకు ఇవ్వడం జరిగిందని పోలీసులు తెలిపారు. ఈ సమాచారం వినియోగించి ఆ ఇళ్లల్లో వారిని తమ ఛానెల్ అయిన రిపబ్లిక్ టీవీ చూడాలంటూ వారికి కూడా డబ్బులు ఎరవేసినట్లు పోలీసుల విచారణలో బయటపడింది. ఇంగ్లీష్ భాష అర్థం కాకపోయినప్పటికీ ఆ ఛానెల్ చూడాల్సిందిగా అర్నాబ్ సూచించినట్లు సమాచారం.

కేసులో మొత్తం 15 మంది అరెస్టు
కొన్ని ఇళ్లల్లో ఫలాన సమయంలో కచ్చితంగా రిపబ్లిక్ టీవీ ఛానెల్ పెట్టి ఉంచాల్సిందిగా ఆదేశాలు వెళ్లాయని వారికి కూడా డబ్బులు ముట్టజెప్పారని పోలీసులు చెప్పారు. అంతేకాదు ఇదంతా టీఆర్‌పీ స్కామ్‌తో సంబంధం ఉన్న వారి నేతృత్వంలోనే జరిగినట్లు పోలీసులు కోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లో పేర్కొన్నారు. ఇక టీఆర్‌పీ స్కామ్‌లో పోలీసులు ఇప్పటి వరకు బార్క్ మాజీ సీఈఓ పార్థ్ దాస్ గుప్తాతో సహా 15 మందిని అరెస్టు చేయడం జరిగింది. తాజా ఆరోపణలతో అర్నాబ్ గోస్వామికి చిక్కులు తప్పవనే వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే అర్నాబ్ గోస్వామి బెయిల్‌పై విడుదలయ్యారు. ఒక వేళ ఈ ఆరోపణలు నిజమైతే ఊచలు లెక్కబెట్టాల్సిందే అని కొందరు సీనియర్ జర్నలిస్టులు చెబుతున్నారు. ఈ మధ్య దేశవ్యాప్తంగా ఆయా భాషల్లో తమ ఛానెల్స్‌ను ప్రారంభిస్తామంటూ రిపబ్లిక్ యాజమాన్యం ప్రకటించింది. అయితే ఇది ఎంత వరకు సాధ్యపడుతుందో వేచి చూడాల్సిందేన.