జై తెలంగాణ నినాదాలతో దద్ధరిల్లిన లోకసభ: మోగా ఘటనపైనా ఆందోళన
న్యూఢిల్లీ: లోకసభ మంగళవారంనాడు జైతెలంగాణ నినాదాలతో హోరెత్తుతోంది. సభ ప్రారంభం కాగానే తెలంగాణ రాష్ర్టానికి ప్రత్యేక హైకోర్టును ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) పార్లమెంటు సభ్యులు ఆందోళనకు దిగారు. స్పీకర్ సుమిత్రా మహాజన్ వాయిదా తీర్మానాన్ని తిరస్కరించారు. స్పీకర్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ టీఆర్‌ఎస్ ఎంపీలు పొడియాన్ని చుట్టు ముట్టారు.
వుయ్ వాంట్ జస్టిస్, జైతెలంగాణ , వుయ్ వాంట్ హైకోర్టు అంటూ నినాదాలు చేశారు. తెలంగాణ రాష్ర్టానికి ప్రత్యేక హైకోర్టును ఏర్పాటు చేయాలని ఫ్లకార్డులను ప్రదర్శించారు. దీంతో స్పీకర్ సభను పది నిమిషాలపాటు వాయిదా వేశారు. సభ 11.20 గంటలకు తిరిగి ప్రారంభం అయిన తర్వాత కూడా టీఆర్‌ఎస్ ఎంపీలు తమ ఆందోళన కొనసాగించారు. దాంతో సభ మరోసారి వాయిదా పడింది.
సుమిత్రా మహాజన్ ఎంతగా నచ్చజెప్పినప్పటికీ వారు వినిపించుకోలేదు. తన మాట వినకపోతే చర్యలు తీసుకుంటానని కూడా ఆమె హెచ్చరించారు. ప్రభుత్వం ప్రత్యేక హైకోర్టును ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉందని, అయితే వివాదం కోర్టులో ఉందని మంత్రి వెంకయ్య నాయుడు చెప్పారు.

ఉమ్మడి హైకోర్టును విభజించి తెలంగాణ రాష్ర్టానికి ప్రత్యేక హైకోర్టును ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ టిఆర్ఎస్ఎంపీలు పార్లమెంట్ ఆవరణలో ఆందోళనకు దిగారు. పార్లమెంట్ ఆవరణలో ఉన్న మహాత్మాగాంధీ విగ్రహం వద్ద ధర్నాకు దిగారు.
మంగళవారంనాడు సభ ప్రారంభం కాగానే స్పీకర్ ప్రశ్నోత్తరాల సమయాన్ని చేపట్టారు. అయితే, హైకోర్టును విభజించాలని టిఆర్ఎస్ ఎంపీలు ఓవైపు ఆందోళనకు చేస్తుండగా పంజాబ్‌లోని మోగా సంఘటనపై ఇతర ప్రతిపక్షాలు చర్చకు పట్టుబట్టాయి. పంజాబ్ ఘటనపై తక్షణ చర్చకు పార్లమెంటు ఉభయ సభల్లోనూ కాంగ్రెసు వాయిదా తీర్మానం ప్రతిపాదించింది. దాన్ని లోకసభ స్పీకర్ సుమిత్రా మహాజన్ తిరస్కరించారు.
పంజాబ్‌లో యువతిపై జరిగిన దారుణంపై చర్చించాల్సిందిగా విపక్ష సభ్యులు పట్టుబట్టారు. ప్రశ్నోత్తరాల సమయంలో చర్చను చేపట్టడం కుదరదని జీరో అవర్‌లో అవకాశం కల్పిస్తామని స్పీకర్ తెలిపినప్పటికీ సభ్యులు శాంతించకుండా తమ ఆందోళనను కొనసాగించారు.












Click it and Unblock the Notifications