కలకలం: రోడ్డు పక్కన ట్రక్కులో 2 లక్షలకుపై కరోనా వ్యాక్సిన్ డోసులు, పరారీలో డ్రైవర్, క్లీనర్
భోపాల్: సెకండ్ వేవ్‌లో దేశంలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్న క్రమంలో శనివారం కరోనా వ్యాక్సిన్ మూడో దశ ప్రారంభమైంది. అయితే, కరోనా వ్యాక్సిన్ల కొరతతో 18-44ఏళ్ల వయస్కులకు తాము ఇప్పుడే వ్యాక్సిన్ వేయలేమని ఇప్పటికే పలు రాష్ట్రాలు ప్రకటించాయి. దేశంలో ఈ విధంగా వ్యాక్సిన్ల కొరత ఉండగా.. మధ్యప్రదేశ్‌లో ఓ కరోనా వ్యాక్సిన్ల ట్రక్కు రోడ్డు పక్కన ఉండటం కలకలం రేపుతోంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని నర్సింగ్‌పూర్ జిల్లాలోని కరేలీ ప్రాంతంలో బస్టాండ్‌కు సమీపంలో శనివారం ఉదయం ఓ ట్రక్కు ఆగింది. చాలా సేపు అక్కడే ఉండటంతో అనుమానం వచ్చిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.
ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. ట్రక్కు డోర్లను తెరిచి చూడగా.. అందులో సుమారు 2,40,000 డోసుల కోవాగ్జిన్ టీకాలు కనిపించాయి. డ్రైవర్, క్లీనర్ అక్కడ లేకపోవడంతో.. ట్రక్కు మీదున్న నెంబరుతో డ్రైవర్ మొబైల్ లొకేషన్‌ను ట్రేస్ చేశారు. అతడు హైవే సమీపంలోని చెట్ల పొదల్లో ఉన్నట్లు గుర్తించారు.

కాగా, ట్రక్కులోని ఏసీ పనిచేస్తోందని, డోసులు సురక్షితంగానే ఉన్నాయని పోలీసులు తెలిపారు. వాటి విలువ దాదాపు 8 కోట్లు ఉంటుందని అంచనా వేశారు. ట్రక్కును స్వాధీనం చేసుకున్న పోలీసులు.. డ్రైవర్, క్లీనర్ కోసం గాలిస్తున్నారు.
Recommended Video
మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటికే కరోనా వ్యాక్సిన్ కొరతను ఎదుర్కొంటున్నట్లు సీఎం శివరాజ్ సింగ్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో మే 1 నుంచి 18-44 ఏళ్ల వయస్కులకు కొన్ని జిల్లాల్లోనే వ్యాక్సిన్ ఇస్తున్నట్లు అధికారులు తెలిపారు. అందరికీ వ్యాక్సిన్ ఇచ్చేందుకు మరికొంత సమయం పడుతుందని అన్నారు.












Click it and Unblock the Notifications