ట్రంప్ సుంకాల దెబ్బ.. కూలిపోనున్న 500 ఏళ్ల చరిత్ర గల పరిశ్రమ!
భారతదేశంలో తయారయ్యే కార్పెట్లు ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు పొందాయి. ఉత్తరప్రదేశ్‌లోని భదోహి ప్రాంతం 'కార్పెట్ సిటీ'గా ప్రసిద్ధి చెందింది. ఇక్కడి నుంచి ఎగుమతి అయ్యే కార్పెట్లలో 60 శాతం కేవలం అమెరికాకే వెళ్తాయి. ప్రస్తుతం 50 శాతం అమెరికన్ సుంకాల కారణంగా ఈ పరిశ్రమపై తీవ్ర సంక్షోభం నెలకొంది.
కార్పెట్ పరిశ్రమపై కమ్ముకున్న సంక్షోభం
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇండియాపై విధించిన కొత్త సుంకాల కారణంగా భారత కార్పెట్ పరిశ్రమ సంక్షోభంలో పడింది. మొదట 25 శాతం, ఇప్పుడు 50 శాతం సుంకం కారణంగా అమెరికాకు కార్పెట్లను ఎగుమతి చేసే వ్యాపారం దాదాపుగా నిలిచిపోయింది. ఇదే పరిస్థితి కొనసాగితే వేల కోట్ల రూపాయల విలువైన కార్పెట్లు కంపెనీలలోనే ఉండిపోతాయి. అంతేకాకుండా ఈ పరిశ్రమపై ఆధారపడిన లక్షలాది మంది కార్మికులు నిరుద్యోగులుగా మారే ప్రమాదం ఉంది.

60 శాతం ఎగుమతులు అమెరికాకే..
భారత హస్తకళల కార్పెట్లు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందాయి. కేంద్ర టెక్స్టైల్ మంత్రిత్వ శాఖ కార్పెట్ ఎగుమతి ప్రోత్సాహక మండలి (Carpet Export Promotion Council) నివేదిక ప్రకారం, భారత్ నుంచి ఏటా రూ. 17 వేల కోట్లకు పైగా విలువైన కార్పెట్లు విదేశాలకు ఎగుమతి అవుతాయి. వీటిలో 60 శాతం ఒక్క అమెరికాకే ఎగుమతి అవుతాయి. కార్పెట్ పరిశ్రమ ఒక కుటీర పరిశ్రమ కాబట్టి, దీనిపై లక్షలాది మంది గ్రామీణ కార్మికులు ఆధారపడి జీవిస్తున్నారు.
భారత ఎగుమతిదారుపై అధిక భారం
కార్పెట్ వ్యాపారులు ఇప్పుడు నష్టాన్ని భరించలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గతంలో 25 శాతం సుంకం విధించినప్పుడు అమెరికన్ దిగుమతిదారులు భారత కార్పెట్లను కొనడానికి వెనకాడారు. ఇప్పుడు సుంకం 50 శాతానికి పెరగడంతో ఆర్డర్లు పూర్తిగా రద్దవుతున్నాయి. దీంతో ఇప్పటికే తయారైన సరుకు పెద్ద ఎత్తున గోడౌన్లలో నిలిచిపోయింది. దీనివల్ల వ్యాపారులకు బ్యాంక్ వడ్డీలు, కార్మికుల జీతాలు, సరఫరాదారుల చెల్లింపులు వంటి వాటిని భరించడం కష్టంగా మారింది.
ప్రభుత్వం సహాయం చేయాలని విజ్ఞప్తి
కార్పెట్ ఎగుమతి ప్రోత్సాహక మండలి సభ్యులు అస్లమ్ మెహబూబ్, సంజయ్ గుప్తా ఈ సుంకాల వల్ల పాకిస్థాన్, ఆఫ్ఘనిస్తాన్ వంటి పోటీ దేశాలకు ప్రయోజనం కలుగుతుందని వెల్లడించారు. భారత్‌కు పోటీగా ఉన్న చైనా, టర్కీల యంత్రాల ద్వారా తయారైన కార్పెట్లకు తక్కువ సుంకం విధిస్తున్నారు.
ఈ పరిశ్రమను రక్షించడానికి ప్రభుత్వం బెయిలౌట్ ప్యాకేజీ ఇవ్వాలని, మూసివేసిన ప్రోత్సాహక పథకాలను తిరిగి ప్రారంభించాలని వ్యాపారులు కోరారు. ఇది కేవలం వ్యాపార సమస్య మాత్రమే కాదు, 13 లక్షల మంది కార్మికుల జీవితాలకు సంబంధించినదని సంజయ్ గుప్తా పేర్కొన్నారు. ఈ పరిశ్రమలో పనిచేసే వారు ఎక్కువగా గ్రామీణ ప్రాంతాలవారు, రైతులు కూడా ఈ పనిని పార్ట్-టైమ్‌గా చేస్తూ జీవిస్తున్నారు. ఒకవేళ వీరు నిరుద్యోగులైతే ఉపాధి కోసం ముంబై, ఢిల్లీ వంటి నగరాలకు వలస వెళ్లే పరిస్థితి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. దాదాపు 500 ఏళ్ల చరిత్ర ఉన్న భారత కార్పెట్ పరిశ్రమను రక్షించడం ప్రభుత్వ బాధ్యత అని వ్యాపారులు పేర్కొంటున్నారు. ప్రభుత్వం జోక్యం చేసుకుని సహాయం అందించకపోతే, ఈ పరిశ్రమ పూర్తిగా నాశనమయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించారు.












Click it and Unblock the Notifications