West Bengal Assembly Elections 2021 narendra modi mamata banerjee trinamool congress bjp నరేంద్ర మోదీ మమతా బెనర్జీ తృణమూల్ కాంగ్రెస్ బీజేపీ politics
'ఆ ఇల్లు నాది కాదు.. రాత్రైతే పిల్లలు గదిలో.. మేము ఫుట్‌పాత్‌పై' - బీజేపీ యాడ్ వెనుక అసలు నిజం ఇదీ..
ప్రధానమంత్రి ఆవాస్ యోజన(పీఎంఏవై) పథకం కింద పశ్చిమ బెంగాల్‌లో 24లక్షల పేద కుటుంబాలు కొత్తగా ఇళ్లు నిర్మించుకున్నారని ఇటీవల బీజేపీ పత్రికా ప్రకటన ఇచ్చింది. కొత్తగా నిర్మించిన ఓ ఇంటి ముందు... ఆ ఇంటి మహిళ నిలబడిన ఫోటోను ప్రకటనలో చూడవచ్చు.'ప్రధానమంత్రి ఆవాస యోజన పథకం వల్లే ఈరోజు నా సొంతింటి కల నెరవేరింది...' అని ఆమె పేర్కొన్నట్లుగా ఆ ప్రకటనలో ముద్రించారు. అయితే అసలు నిజం మాత్రం ఇందుకు పూర్తి విరుద్దంగా ఉంది. ఆ ప్రకటనలో ఉన్న మహిళ ఇప్పటికీ అద్దె ఇంట్లోనే ఉంటోంది... ఆ ఫోటోలో ఉన్న ఇంటికి,ఆమెకు సంబంధం లేదు... ప్రముఖ జాతీయ మీడియా ఈ విషయాలను బయటపెట్టింది...

ఆ ఇల్లు నాది కాదు.. : లక్ష్మీ దేవి
బీజేపీ పత్రిక ప్రకటనలో కనిపించిన ఆ మహిళ కోల్‌కతాలోని బౌబజార్ పరిధిలో ఉన్న మలంగ ప్రాంతానికి చెందిన లక్ష్మీ దేవి. ఆ ప్రకటనలో ఉన్న ఫోటో తనదేనని... కానీ దాని గురించి తనకేమీ తెలియదని అన్నారు. ఆ ప్రకటనలో తన సొంతింటి కల నెరవేరిందని చెప్పడం పూర్తిగా అబద్దమన్నారు. తనకు కేంద్రమంత్రి ఆవాస్ యోజన పథకం అందలేదని... అసలు ఆ పథకమేంటో కూడా తనకు తెలియదని చెప్పారు. ఆ ప్రకటనలో చూపించిన ఇల్లు తనది కాదన్నారు. ఇప్పటికీ కుటుంబంతో కలిసి ఇరుకు అద్దె గదిలోనే నివసిస్తున్నానని తెలిపారు. తన ఫోటో పత్రికలో అచ్చయిందని చుట్టుపక్కల వాళ్లు చెప్పేదాకా తనకు తెలియదన్నారు.

రాత్రైతే పిల్లలు ఇంట్లో... మేము ఫుట్‌పాత్‌పై...
'బౌబజార్‌లోని ఒక చిన్న అద్దె గదిలో మేము నివాసముంటున్నాను. నేను, నా ఆరుగురు కుటుంబ సభ్యులు కలిసి ఆ ఒక్క గదిలోనే నివసిస్తున్నాం. నెల అద్దె రూ.500. రాత్రిపూట పిల్లలు ఇంట్లో పడుకుంటే... మేము బయట రోడ్డు పక్కన ఫుట్‌పాత్‌పై పడుకుంటాం.ఇప్పటికీ మా ఇంటికి టాయిలెట్ వసతి కూడా లేదు.. సమీపంలోని పబ్లిక్ టాయిలెట్‌నే డబ్బులు చెల్లించి ఉపయోగించుకుంటాం...' అని లక్ష్మీ దేవి వాపోయారు. నిజానికి పత్రిలో తన ఫోటో చూసి తనకు భయమేసిందన్నారు. అసలు ఆ ఫోటో ఎవరు తీశారో... ఎప్పుడు తీశారో కూడా తనకు తెలియదన్నారు. బహుశా బాబుఘాట్ మేళాలో తాను టాయిలెట్స్ క్లీన్ చేయడానికి వెళ్లినప్పుడు ఎవరైనా తీసి ఉండవచ్చునని చెప్పారు.

నా అనుమతి కోరలేదు : లక్ష్మీ దేవి
తనను ఫోటో తీసేందుకు లేదా దాన్ని పత్రికలో అచ్చు వేసేందుకు ఎవరూ తన అనుమతి కోరలేదన్నారు. దీని గురించి స్థానిక బీజేపీ నేతలెవరినైనా కలిసి మాట్లాడారా అని అడిగితే... లేదని బదులిచ్చారు. తాను చదువుకోలేదని... ఇవన్నీ తనకు పెద్దగా తెలియవని చెప్పారు. ఇదే విషయంపై స్పందించేందుకు మీడియా ప్రతినిధులు బీజేపీ ఎంపీ అర్జున్ సింగ్‌ను సంప్రదించగా... అందుకు ఆయన విముఖత వ్యక్తం చేశారు. ప్రస్తుతం బెంగాల్‌లో టీఎంసీ,బీజేపీ హోరాహోరీగా ఎన్నికల ప్రచారం సాగిస్తున్న సంగతి తెలిసిందే. ఐదేళ్లు అవకాశమిస్తే బెంగాల్‌లో 70 ఏళ్ల అభివృద్ది చేసి చూపిస్తానని ప్రధాని మోదీ చెప్తున్నారు. మరోవైపు దుర్యోధన,దుశ్వాసనులు మనకు వద్దు అని మమతా బెనర్జీ ప్రచారం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో బెంగాల్ పోరులో ప్రజలు ఎవరికి పట్టం కట్టబోతున్నారన్న దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.