పార్టీ ఎమ్మెల్యేపై బహిష్కరణ వేటు వేసిన టీటీవీ దినకరన్
ముఖ్యమంత్రి విజయ్ సారథ్యంలో తమిళనాడులో టీవీకే ప్రభుత్వం కొలువుదీరిన తొలి రోజుల్లోనే అక్కడి రాజకీయాల్లో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. ప్రతిపక్ష ఏఐఏడీఎంకే నిలువునా చీలింది. చీలిక వర్గానికి నాయకత్వాన్ని వహిస్తోన్న సీవీ షణ్ముగం కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు. ఆయన నేతృత్వంలోని అన్నా డీఎంకే వర్గం టీవీకేకు మద్దతు ప్రకటించింది. ఈ ఉదయమే షణ్ముగం ఈ ప్రకటన చేశారు. ఇంకాస్సేపట్లో ఆయన విజయ్ తో సమావేశం కాబోతోన్నారు.
తాజగా మరో కీలక పరిణామం చోటు చేసుకుంది తమిళనాడు రాజకీయాల్లో. అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం (AMMK) పార్టీకి చెందిన ఏకైక ఎమ్మెల్యే ఎస్ కామరాజ్ పై బహిష్కరణ వేటు పడింది. పార్టీ నుంచి తక్షణమే ఆయనను బహిష్కరిస్తోన్నట్లు ఏఎంఎంకే ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్ వెల్లడించారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ ఉదయం శాసనసభలో ముఖ్యమంత్రి విజయ్, అధికార టీవీకేకు మద్దతుగా మాట్లాడటమే దీనికి కారణం.

కామరాజ్ పార్టీ సిద్ధాంతాలకు విరుద్ధంగా వ్యవహరించాడని, టీవీకే మద్దతు ఇవ్వకూడదనేది పార్టీ విధానపరమైన నిర్ణయామని టీటీవీ దినకరన్ వివరించారు. తాము ఎడప్పాడి పళనిస్వామి సారథ్యంలోని ఏఐఏడీఎంకేకు మాత్రమే మద్దతు ఇస్తోన్నామని తెలిపారు. దీనికి భిన్నంగా టీవీకేకు మద్దతుగా మాట్లాడటాన్ని తీవ్రంగా పరిగణణలోకి తీసుకున్నామని, పార్టీ నియమ నిబంధనలు, క్రమశిక్షణకు ఆయన చర్యలు విఘాతం కలిగించాయని దినకరన్ స్పష్టం చేశారు.
కామరాజ్ ప్రవర్తన ఏఎంఎంకే కార్యకర్తలు, మిత్రపక్షాల నాయకులు, తమపై విశ్వాసంతో ఓటు వేసిన మన్నార్‌గుడి ప్రజలకు తీరని ద్రోహంగా పరిగణించామని తెలిపారు. పార్టీలో గందరగోళాన్ని సృష్టించేలా వ్యవహరించిన కామరాజ్ ప్రాథమిక సభ్యత్వంతో సహా అన్ని పార్టీ పదవుల నుండి తక్షణమే తొలగిస్తున్నట్లు దినకరన్ తెలిపారు.
మొన్నటి ఎన్నికల్లో మన్నార్ గుడి నియోజకవర్గం నుంచి కామరాజ్ ఎన్నికయ్యారు. సుమారు 2,000లకు పైగా ఓట్ల తేడాతో తన సమీప ప్రత్యర్థి, డీఎంకే అభ్యర్థి టీఆర్బీ రాజాను ఓడించారు. సీపీఐ, డీఎంకే గట్టిపట్టు ఉన్న నియోజకవర్గం ఇది. తొలిసారిగా ఏఎంఎంకే అభ్యర్థి ఇక్కడ గెలిచారు.












Click it and Unblock the Notifications