మన్నార్ గుడి మాఫియా ఫ్యామిలీ ఫైట్: ఎమ్మెల్యేలు జంప్ కావడానికి ఆయనే కారణం!
చెన్నై: తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత లేకపోవడంతో అన్నాడీఎంకే పార్టీలో చీలికలు వచ్చిన విషయం తెలిసిందే. పార్టీని, సీఎం కుర్చీని హైజాక్ చేసి తమిళనాడు మీద పెత్తనం చెలాయించాలని చూసిన శశికళ చివరికి బెంగళూరు సెంట్రల్ జైలుకు వెళ్లారు.
శశికళ జైలుకు వెళ్లే సమయంలో తన సోదరి వనితామణి కుమారుడు టీటీవీ దినకరన్ కు పార్టీ ఉప కార్యదర్శి పగ్గాలు అప్పగించి వెళ్లారు. దినకరన్ పిచ్చిచేష్టలతో తమిళనాడు ప్రభుత్వం అతలాకుతలం అయ్యింది. ఇటీవల సీఎం పళనిసామి, పన్నీర్ సెల్వం వర్గాలు ఒక్కటి అయ్యాయి.

తమిళనాడు ప్రభుత్వం గాడినపడుతున్న సమయంలో టీటీవీ దినకరన్ 22 మంది ఎమ్మెల్యేలను తనవైపు తిప్పుకుని ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిసామి మీద తిరుగుబాటు చేయించారు. పుదుచ్చేరిలోని రిసార్ట్ లో ఉన్న 5 మంది ఎమ్మెల్యేలు ఆదివారం అక్కడి నుంచి గోడదూకేశారు.
ఆ ఐదు మంది ఎమ్మెల్యేలు శశికళ సోదరుడు దివాకరన్ కు సన్నిహితంగా ఉంటున్నారని తెలిసింది. దివాకరన్ కావాలనే ఐదు మంది ఎమ్మెల్యేలను గోడ దూకించారని టీటీవీ దినకరన్ మండిపడుతున్నారు. ఎమ్మెల్యేలు జంప్ కావడానికి దివాకరన్ కుమారుడు జయంత్ కారణం అని తెలుసుకున్న దినకరన్ తన మేనమామ దివాకరన్ మీద కారాలు మిరియాలు నూరుతున్నారని, ఆయనకు పార్టీతో ఏమి సంబంధం అని ప్రశ్నిస్తున్నారని అన్నాడీఎంకే వర్గాలు అంటున్నాయి.












Click it and Unblock the Notifications