బెంగళూరు జైల్లో శశికళతో టీటీవీ దినకరన్ భేటీ: మౌనవ్రతం, ఐటీ దాడుల సమన్లకు!
బెంగళూరు: ఆదాయానికి మించిన అక్రమాస్తుల కేసులో బెంగళూరులోని పరప్పన అగ్రహార సెంట్రల్ జైల్లో శిక్ష అనుభవిస్తున్న వీకే శశికళ నటరాజన్ ను మంగళవారం ఆమె కుటుంబ సభ్యులు కలుసుకున్నారు. ఆర్ కే నగర్ ఎమ్మెల్యే టీటీవీ దినకరన్ మంగళవారం జైల్లో మౌనవ్రతం చేస్తున్న శశికళతో భేటీ అయ్యి ఐటీ దాడుల సమన్ల విషయంలో సమాచారం ఇచ్చారని తెలిసింది.

రాజకీయాలు
ఆర్ కే నగర్ ఉప ఎన్నిలో విజయం సాధించిన తరువాత టీటీవీ దినకరన్ రెండోసారి బెంగళూరు చేరుకుని పరప్పన అగ్రహార సెంట్రల్ జైల్లో శశికళతో చర్చించారు. తమిళనాడులో ప్రస్తుతం జరుగుతున్న రాజకీయ పరిణామాలపై టీటీవీ దినకరన్ శశికళకు వివరించారని తెలిసింది.

కుటుంబంలో ఆధిపత్యపోరు
కొంత కాలంగా శశికళ కుటుంబ సభ్యుల్లో ఆధిపత్యపోరు ఎక్కువ అయ్యింది. ముఖ్యంగా జయా టీవీ సీఇవో వివేక్, టీటీవీ దినకరన్ వర్గాల మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. జయలలిత ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వీడియో విడుదల చెయ్యడంతో వివేక్ సోదరి, శశికళ వదిన ఇళవరసి కుమార్తె క్రిష్ణప్రియ బహిరంగంగానే టీటీవీ దినకరన్, ఆయన వర్గీయుల మీద మండిపడ్డారు.

ఐటీ శాఖ సమన్లు
ఆదాయపన్ను శాఖ అధికారులు శశికళ కుటుంబ సభ్యుల మీద 187 ప్రాంతాల్లో దాడులు చేసిన సమయంలో ఆదాయానికి మించిన అక్రమాస్తులు సంపాధించారని వెలుగు చూసింది. దాదాపు రూ. 4,500 కోట్లకు సంబంధించిన ఆస్తుల వివరాలు తెలుసుకోవడానికి, శశికళను జైల్లో విచారణ చెయ్యడానికి జనవరి మొదటి వారంలో ఐటీ శాఖ అధికారులు ఆమెకు సమన్లు జారీ చేశారు.

జైల్లో మౌనవ్రతం
అన్నాడీఎంకే పార్టీ నుంచి బహిష్కరణకు గురైన శశికళ గత డిసెంబర్ 5వ తేదీ నుంచి బెంగళూరు సెంట్రల్ జైలులో మౌనవ్రతం చేస్తున్నారని టీటీవీ దినకరన్ మీడియాకు చెప్పారు. ఐటీ శాఖ అధికారులు ఇచ్చిన సమన్లకు తాను మౌనవ్రతం చేస్తున్నానని, ఫిబ్రవరిలో విచారణకు సహకరిస్తానని ఐటీ శాఖ అధికారులకు శశికళ సమాధానం ఇచ్చారు.

న్యాయవాదులు
ఐటీ శాఖ అధికారులు అడిగే ప్రశ్నలకు ఏం సమాధానం చెప్పాలి అనే వివరాలను న్యాయవాదులు, అకౌంటెంట్ల నుంచి వివరాలు తెలుసుకున్న టీటీవీ దినకరన్ శశికళకు చెప్పారని తెలిసింది. మౌనవ్రతం చేస్తున్న శశికళ టీటీవీ దినకరన్ చెప్పిన మాటలు మౌనంగానే విన్నారని ఆయన సన్నిహితులు అంటున్నారు.












Click it and Unblock the Notifications