ఒకప్పుడు పాక్ లో.. ఇప్పుడు భారత్ లో.. ఈ గ్రామానికి పర్యటకులు క్యూ.. ఎందుకంటే..?
భారత్.. ఎన్నో ప్రకృతి రమణీయమైన ప్రదేశాలకు నెలవుగా ఉంది. అటు కాశ్మీర్ నుంచి కన్యా కుమారి వరకు ప్రతి చోట ఎన్నో పర్యటక, చారిత్రక, సంస్కృతిక ప్రదేశాలు ఆకట్టుకుంటున్నాయి. భారత్ కు వేల సంవత్సరాల చరిత్ర ఉన్న కారణంగా అనేక చారిత్రక కట్టడాలకు ఈ ప్రాంతం నిదర్శనంగా నిలిచింది. అయితే భారత్ సరిహద్దులోని ఎత్తయిన కొండలు, లోయల మధ్య ఉన్న గ్రామాలు ఇప్పుడు పర్యటకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఇవి ప్రకృతి ప్రేమికులను విశేషంగా ఆకర్షిస్తున్నాయి. సహజ సిద్ధంగా ఏర్పడిన ఈ కొండ లోయల్లోని ఓ గ్రామమే తుర్టుక్.
ఒకప్పుడు పాకిస్థాన్ లో భాగమైన ఈ గ్రామం.. ఇప్పుడు భారత్ పరిధిలో ఉంది. 1971 ఇండో- పాక్ యుద్ధం తర్వాత ఈ గ్రామం భారత్ లో చేరింది. పర్యటకులను విశేషంగా ఆకర్షిస్తోంది. ప్రస్తుతం ఈ గ్రామం లడఖ్ లోని నుబ్రా లోయలో.. ష్యోక్ నది ఒడ్డున ఉంది. ఈ ప్రాంతంలో బాల్టి జాతి ప్రజలు నివసిస్తున్నారు. వీరి భాష, ఆహారపు అలవాట్లు, సంస్కృతి లడఖ్ లోని మిగిలిన ప్రాంతాల కంటే చాలా భిన్నంగా.. చాలా ప్రత్యేకంగా ఉంటాయి.
ఇక తుర్టుక్ గ్రామం నియంత్రణ రేఖ కు సుమారు 8 నుంచి 9 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇక ఈ గ్రామంలోని ప్రజలు హిందీ, బాల్టి, లడఖి వంటి భాషల్ని మాట్లాడుతారు. 2010 వరకు భద్రతా కారణాల దృష్ట్యా ఈ గ్రామంలోకి పర్యాటకులకు అనుమతి ఉండేది కాదు. కానీ ఇటీవలి కాలంలో ప్రముఖ పర్యాటక కేంద్రంగా ఈ గ్రామం ఉంటోంది. ప్రస్తుతం ఇక్కడ హోమ్ స్టేలు, గెస్ట్ హౌజ్ లు విస్తరించాయి. ఇక టూరిస్టులు ఈ ప్రాంతానికి చేరుకోవాలంటే లేహ్ అధికారుల నుంచి 'ఇన్నర్ లైన్ పర్మిట్' తీసుకోవాల్సి ఉంటుంది.

తుర్టుక్ గ్రామం లేహ్ నుండి సుమారు 205 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ప్రయాణానికి దాదాపు 6 నుండి 8 గంటలు పడుతుంది. లేహ్ నుండి ప్రైవేట్ ట్యాక్సీని అద్దెకు తీసుకుని వెళ్లొచ్చు. దారిలో ప్రపంచంలోనే ఎత్తైన మోటరబుల్ రోడ్లలో ఒకటైన ఖార్దుంగ్ లా పాస్ మీదుగా ప్రయాణించాల్సి ఉంటుంది. ఇదొక మరచిపోలేని అనుభూతిని ఇస్తుంది. ఇక్కడ చాలా వరకు హోమ్ స్టేలలో బెడ్స్, స్థానిక ఆహారం, వేడి నీళ్లు అందుబాటులో ఉంటాయి. అయితే ఇక్కడ నెట్ వర్క్/ఇంటర్నెట్ చాలా తక్కువగా ఉంటుంది.












Click it and Unblock the Notifications