ట్విట్టర్‌కు షాకిచ్చిన రేప్ బాధితురాలి కుటుంబం-యుద్ధం ప్రకటించిన రాహుల్-ప్రజాస్వామ్యంపై దాడిగా...
సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్విట్టర్‌పై కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ యుద్ధం ప్రకటించారు. భారత్‌లో ట్విట్టర్ డేంజర్ గేమ్ ఆడుతోందని సంచలన ఆరోపణలు చేశారు. దేశ రాజకీయ విధానాల్లో జోక్యం చేసుకుంటున్న ట్విట్టర్‌తో ప్రజాస్వామ్యానికి ముప్పు ఉందన్నారు.ఇటీవల రాహుల్ గాంధీ ట్విట్టర్ ఖాతాను తాత్కాలికంగా నిలిపివేసిన నేపథ్యంలో తాజాగా తన యూట్యూబ్ ఛానెల్ ద్వారా ఆయన ఓ సందేశాన్ని విడుదల చేశారు.
'ఓ కార్పోరేట్ కంపెనీ మన దేశ రాజకీయాల్లో జోక్యం చేసుకుంటోంది. ఇది ప్రజాస్వామ్యానికి శ్రేయస్కరం కాదు. మన రాజకీయాలను మనమే డిసైడ్ చేసుకుందామా... లేక వ్యాపారం చేసుకునే ఓ కంపెనీని డిసైడ్ చేయనిద్దామా. ఇది కేవలం రాహుల్ గాంధీపై దాడి కాదు. లేక కేవలం రాహుల్ గాంధీ ట్విట్టర్ ఖాతాను నిలిపివేయడం కాదు. నా ట్విట్టర్ ఖాతాకు 20 మిలియన్ల ఫాలోవర్స్ ఉన్నారు. వారి భావప్రకటనా హక్కును ట్విట్టర్ హరిస్తోంది. ప్రస్తుతం దేశ ప్రజాస్వామ్యం ముప్పును ఎదుర్కొంటోంది. పార్లమెంటులో ప్రతిపక్షాలను మాట్లాడనివ్వడం లేదు. మీడియాను నియంత్రిస్తున్నారు. ట్విట్టర్ లాంటి తటస్థ వేదికల్లో అభిప్రాయాలను పంచుకుందామంటే అది పక్షపాత వైఖరితో వ్యవహరిస్తోంది. ప్రభుత్వం చెప్పింది వారు వింటున్నారు. మన రాజకీయ విధానాల్లో ఒక కంపెనీ జోక్యాన్ని ఒక రాజకీయ నాయకుడిగా నేను అంగీకరించను.' అని రాహుల్ గాంధీ వెల్లడించారు.

దేశ రాజధాని ఢిల్లీలోని నంగమ్ ప్రాంతంలో ఈ నెల 3న ఓ మైనర్ బాలికపై పూజారి,మరో ముగ్గురు వ్యక్తులు గ్యాంగ్ రేప్‌కు పాల్పడి హత్య చేసిన సంగతి తెలిసిందే. ఆ మరుసటిరోజు రాహుల్ గాంధీ ఆ కుటుంబాన్ని పరామర్శించారు. ఆ ఫోటోలు,వీడియోలను తన ట్విట్టర్ ఖాతాలో రాహుల్ షేర్ చేశారు. అయితే అత్యాచార బాధితురాలి తల్లి ఫోటోను బయటపెట్టారనే కారణంతో ట్విట్టర్ ఆయన ఖాతాను తాత్కాలికంగా నిలిపివేసింది. ఆ తర్వాత కాంగ్రెస్ అధికారిక ఖాతాతో పాటు దాదాపు 5వేల మంది ఆ పార్టీ నేతలు,కార్యకర్తల ఖాతాలను నిలిపివేసింది. దీనిపై కాంగ్రెస్ శ్రేణులు భగ్గుమన్నాయి. బీజేపీ డైరెక్షన్ మేరకే ట్విట్టర్ కాంగ్రెస్‌ను టార్గెట్ చేసిందని వారు విమర్శిస్తున్నారు.
మరోవైపు గ్యాంగ్ రేప్ బాధితురాలి కుటుంబ సభ్యులు మాట్లాడుతూ... రాహుల్ తమ ఫోటోలను ట్విట్టర్‌లో పోస్ట్ చేయడం పట్ల తమకేమీ అభ్యంతరం లేదన్నారు. మృతురాలి అస్థికలను శుక్రవారం(ఆగస్టు 13) హరిద్వార్‌లోని గంగా నదిలో కలిపిన సందర్భంగా వారు ఈ వ్యాఖ్యలు చేశారు. బాధితురాలి కుటుంబ సభ్యుల ఫోటోలను బయటపెట్టాడనే కారణంతో ట్విట్టర్ రాహుల్ ఖాతాను నిలిపివేయగా.. ఆ కుటుంబ సభ్యులే తమకేమీ అభ్యంతరం లేదని చెప్పడం చర్చనీయాంశంగా మారింది.
కాగా,ఢిల్లీలోని నంగల్ ప్రాంతంలో ఈ నెల 3న 9 ఏళ్ల బాలికపై 55 ఏళ్ల వయసున్న ఓ పూజారి,మరో ముగ్గురు సిబ్బంది కలిసి గ్యాంగ్ రేప్‌కి పాల్పడ్డారు. ఆపై బాలికను హత్య చేసి ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్‌తో చనిపోయినట్లుగా చిత్రీకరించారు.బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయకుండా వారికి మాయ మాటలు చెప్పి మభ్యపెట్టారు. అసలేం జరిగిందో తెలుసుకునే లోపే బాలిక మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు. బిడ్డ మృతిపై అనుమానాలు వెంటాడటంతో ఆమె తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. అలా ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తించింది.












Click it and Unblock the Notifications