ఎత్తుకెళ్లి అమ్మాయిపై ఇద్దరు కానిస్టేబుళ్ల గ్యాంగ్ రేప్
లక్నో: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో దిగ్భ్రాంతికరమైన సంఘటన చోటు చేసుకుంది. ఓ 14 ఏళ్ల అమ్మాయిని ఇద్దరు పోలీసు కానిస్టేబుళ్లు అపహరించి, ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బదాయు జిల్లాలో గల ముసాఝగ్ పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది.
అత్యాచారానికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కుంటున్న ఇద్దరు కానిస్టేబుళ్లను సస్పెండ్ చేసినట్లు శుక్రవారం వార్తలు వచ్చాయి. సంఘటన పూర్వపరాలు ఇలా ఉన్నాయి - కానిస్టేబుళ్లు వీర్ పాల్ సింగ్ యాదవ్, అవినాష్ యాదవ్ డిసెంబర్ 31వ తేదీన అమ్మాయిని ఇంటి నుంచి ఎత్తుకుపోయారు.

అమ్మాయిని పోలీసు స్టేషన్ ఆవరణలోకి తీసుకుని వెళ్లి అక్కడ ఆమెపై అత్యాచారానికి పాల్పడినట్లు సిటీ పోలీసు సూపరింటిండెంట్ లల్లన్ సింగ్ మీడియాకు చెప్పారు. బాధితురాలి తల్లి ఫిర్యాదుతో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఆ పోలీసులు ఇద్దరు పరారీలో ఉన్నారు.
ఇద్దరు పోలీసు కానిస్టేబుళ్లను విధుల నుంచి సస్పెండ్ చేశారు. వారి ఆచూకి కనుక్కోవడానికి పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మహిళలపై దారుణాలు పెరిగిపోతుండడం పట్ల ఆందోళన వ్యక్తమవుతోంది.












Click it and Unblock the Notifications