'కాంగ్రెస్ ముక్త భారత్': మోడీ పిలుపుకు మరో రెండు అడుగులు
న్యూఢిల్లీ: 'కాంగ్రెస్ ముక్త్ భారత్' 2014 సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చిన పిలుపు. దీని అర్ధం ఏమిటంటే కాంగ్రెస్ పార్టీ లేని భారతదేశాన్ని ఆయన కోరుకోవడం. అయితే ఆ దిశగా మరో రెండు అడుగులు ముందుకు పడ్డాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తాజాగా ఐదు రాష్ట్రాలకు జరిగిన ఎన్నికల తర్వాత వెల్లడైన ఫలితాలను చూస్తే కాంగ్రెస్ ఖాతా నుంచి రెండు రాష్ట్రాలు చేజారిపోయాయి. ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ఆ పార్టీ ఒక పుదుచ్చేరిలో మాత్రమే అధికారం సొంత చేసుకోగలిగింది. పుదుచ్చేరి అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ కూటమి 17 సీట్లను కైవసం చేసుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది.
దీంతో పుదుచ్చేరిని కాంగ్రెస్ తన ఖాతాలో వేసుకుంది కాబట్టి ఇక దేశంలో కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు కర్ణాటక, మణిపూర్, మేఘాలయ, మిజోరామ్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ మాత్రమే మిగిలాయి. 125 ఏళ్ల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో దశాబ్దాలుగా తిరుగులేని అధికారాన్ని చలాయించి ప్రస్తుతం దేశంలో తీవ్ర సంక్షోభ స్థితిని ఎదుర్కొంటోంది.
2014 ఎన్నికల్లో కేంద్రంలో కనీసం ప్రతిపక్ష హోదాను కూడా సొంతం చేసుకోలేకపోయిన కాంగ్రెస్ అనంతరం వివిధ రాష్ట్రాల ఎన్నికల్లోనూ ఆ పార్టీ పుంజుకోలేకపోతోంది. ముఖ్యంగా బీహార్, మహారాష్ట్ర, జమ్మూ కాశ్మీర్, ఢిల్లీ ఎన్నికల్లో ఘోర ఓటమిని చవిచూసింది.
కాగా, మహారాష్ట్రలో అధికారాన్ని బీజేపీకి చేజిక్కించుకుంది. బీహార్‌లో ఆర్జేడీ-జేడీఎస్ పొత్తుతో నితీశ్ కుమార్ సీఎం అయ్యారు. ఇక ఢిల్లీలో బీజేపీ, కాంగ్రెస్‌లకు ముచ్చెమటలు పట్టించి ఆప్ అధికారాన్ని సొంతం చేసుకుంది. అయితే ఇప్పుడు ఈశాన్య రాష్ట్రాల్లో కంచుకోటగా ఉన్న అసోంను కూడా బీజేపీకి సమర్పించుకుంది.
కేరళ కోసం ఎంతో చమటోర్చినా తిరిగి అధికారాన్ని నిలబెట్టుకోలేకపోయింది. ఇక తమిళనాడు విషయానికి వస్తే డీఎంకే కూటమితో పోత్తు పెట్టుకుని ఆధికారంలోకి రాలేకపోయింది. 294 అసెంబ్లీ స్థానాలున్న పశ్చిమబెంగాల్ లో కేవలం 44 సీట్లను తెచ్చుకుని మూడో స్థానంలో నిలిచింది.
ఇలా 2014 తర్వాత జరిగిన అన్ని ఎన్నికల్లో పార్టీ ఘోర పరాజయాన్ని చవిచూస్తోంది. మరోవైపు వచ్చే ఏడాది ఉత్తరప్రదేశ్‌కు ఎన్నికలు జరగనున్నాయి. కేంద్రంలో అధికారం దక్కించుకోవడానికి కీలకమైన ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ఎంత సత్తా చూపుతుందన్నదే ఆ పార్టీ భవిష్యత్తును నిర్దేశిస్తుందని విశ్లేషకులు అంటున్నారు.
ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ ఘోర పరాజయం పొందడంతో సొంత పార్టీ నేతలే కాంగ్రెస్‌పై పెదవి విరుస్తున్నారు. ఆత్మశోధన కాదు, సత్వర్య చర్యలు అవసరమని ఆ పార్టీ సీనియర్ నేత శశి థరూర్ అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా పార్టీకి యువ నాయకత్వం ఎంతో అవసరమన్నారు.

కేరళలో గత ఏడాది యూడిఎఫ్ కాంగ్రెస్ కూటమి విజయానికి ఇదే కారణమన్నారు. కాంగ్రెస్ అధిష్టానం ఈ విషయాన్ని గ్రహించి పార్టీలో యువ నాయకత్వాన్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని శశి థరూర్ అభిప్రాయపడ్డారు.












Click it and Unblock the Notifications