నిషేధం ఉన్నా.. ఉబేర్ రన్: నాటి రేప్‌యత్నం పట్టించుకోని యాజమాన్యం
న్యూఢిల్లీ: పాతికేళ్ల మహిళపై జరిగిన అత్యాచార ఘటన నేపథ్యంలో ఉబేర్ క్యాబ్ సర్వీసులపై విధించిన నిషేధం అమలు ఢిల్లీలో పరస్పర ఆరోపణలకు దారితీస్తోంది. నిషేధం విధించి మూడు రోజులైనా ఈ క్యాబ్ సర్వీసులు కొనసాగుతుండటంతో సందిగ్ధ పరిస్థితి ఏర్పడింది. కేంద్ర ప్రభుత్వం ఇందుకు సంబంధించి నిర్ణయం తీసుకున్నప్పటికీ దాని అమలు బాధ్యత ఎవరిదన్నది తేలడం లేదట.
నిషేధం అమలుపై అటు ఢిల్లీ ప్రభుత్వం, ఇటు ట్రాఫిక్ పోలీసులు బాధ్యతలనుంచి తప్పించుకుంటున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఈ సర్వీసుపై నిషేధం విధించేందుకు అవసరమైన వనరులు తమవద్ద లేవని ఢిల్లీ ప్రభుత్వ రవాణా విభాగం స్పష్టం చేసింది. నిర్ణయం తీసుకున్నవాళ్ళే నిషేధం అమలుచేయాలంటూ ఢిల్లీ ట్రాఫిక్ పోలీసులు తేల్చిచెప్పేశారు.
ఉబేర్ వెబ్ క్యాబ్‌లపై వెంటనే నిషేధం అమలుచేయాలని, ఇతర సర్వీసులకు కూడా దీన్ని వర్తింపజేయాలని ఢిల్లీ ట్రాఫిక్ పోలీసులను ఆదేశించినట్లు రవాణా విభాగం అధికారి తెలిపారు. నిషేధం విధించి మూడు రోజులైనా ఇంకా నగర రోడ్లపై ఉబేర్ క్యాబ్‌లు తిరగడాన్ని ప్రస్తావించినప్పుడు ఆయన ఈ వివరణ ఇచ్చారు.

తక్షణమే అమలులోకి వచ్చే విధంగా సోమవారంనాడే ఈ క్యాబ్‌ల నిషేధ నిర్ణయాన్ని ఢిల్లీ ప్రభుత్వం తీసుకుంది. అయినప్పటికీ కూడా ఈ సర్వీసులు నగరంలో కొనసాగుతూనే ఉన్నాయి. బుకింగ్‌లు కూడా జరుగుతున్నాయి. కాగా, తమకు ఇంతవరకు ప్రభుత్వం నుంచి ఎలాంటి లేఖ రాలేదని ట్రాఫిక్ విభాగం చెబుతోంది.
కాగా, ఉబెర్ క్యాబ్ అత్యాచార ఉదంతం పైన రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తోంది. నిందితుడు శివకుమార్ అకృత్యాలు ఒక్కొ క్కటీ బయటకు వస్తున్నాయి. ఈ అత్యాచార ఘటన జరగడానికి పదిరోజుల ముందు శివకుమార్ యాదవ్ పైన వచ్చిన ఫిర్యాదును ఉబెర్ క్యాబ్ యాజమాన్యం నిర్లక్ష్యం చేసిందని, దాని ఫలితంగానే డిసెంబర్ 6నాటి అత్యాచార ఘటన అన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఈ మేరకు ఓ మహిళ ట్విట్టర్‌లో పెట్టిన వివరాలు కలకలం రేపుతున్న విషయం తెలిసిందే. నవంబర్ 26న తాను ఉబెర్ క్యాబ్ బుక్ చేసుకున్నానని దానికి డ్రైవర్ శివకుమారేనని ఓ మహిళ ట్విట్టర్‌లో పేర్కొంది. ఆ సమయంలో తనపట్ల శివకుమార్ అసభ్యంగా ప్రవర్తించడంతో ఫిర్యాదు చేశానని, ఉబెర్ ట్రావెల్స్ యాజమాన్యం పట్టించుకోలేదని వాపోయారు.












Click it and Unblock the Notifications