మహారాష్ట్రలో శివసేనకు పెరుగుతున్న ముస్లింల మద్దతు-కాంగ్రెస్ తో పోటాపోటీ..!
మహారాష్ట్రలో గతంలో కాంగ్రెస్, ఎన్సీపీలతో కలిసి మహావికాస్ అఘాడీ పేరుతో కూటమి ఏర్పాటు చేసి అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన శివసేన ఉద్ధవ్ వర్గం తాజాగా లోక్ సభ ఎన్నికల్లో సాధించిన ఫలితాలు తమ మిత్రులనే ఆశ్చర్య పరిచాయి. ముఖ్యంగా రాష్ట్రంలోని పలు ముస్లిం ప్రాబల్యం ఉన్న సీట్లను శివసేన ఉద్ధవ్ వర్గం దక్కించుకుంది. దీంతో ఇప్పుడు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లోనూ అక్కడే పోటీ చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటోంది. ఇది కూటమిలో భాగమైన కాంగ్రెస్ ను చికాకు పెడుతోంది.
మహారాష్ట్రలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. వీటిలో సత్తా చాటుకునేందుకు మహావికాస్ అఘాడీ కూటమి సిద్దమవుతోంది. ఇందులో భాగంగా కూటమిలో భాగంగా ఉన్న కాంగ్రెస్, ఎన్సీపీ, శివసేన ఉద్ధవ్ వర్గం సీట్ల పంపకాలపై చర్చలు జరుపుతున్నాయి. వీటిలో ముంబై పరిధిలోకి వచ్చే ఆరు మైనార్టీల ప్రాబల్యం ఉన్న సీట్లను ఇప్పుడు ఉద్ధవ్ సేన అడుగుతోంది. దీంతో ఆయా సీట్లలో ఇన్నాళ్లూ పాతుకుపోయిన కాంగ్రెస్ పార్టీ వాటిని వదులుకునేందుకు సిద్దపడడం లేదు. దీంతో చర్చలు ఇంకా కొనసాగుతున్నాయి.

ఇదంతా ఓ ఎత్తయితే అసలు ముస్లిం ప్రాబల్యం ఉన్న సీట్లను శివసేన ఉద్ధవ్ వర్గం ఇంతలా పట్టుబట్టి అడుగుతుండటం రాష్ట్రంలో రాజకీయ పరిశీలకుల్ని సైతం ఆశ్చర్య పరుస్తోంది. ఎందుకంటే బాల్ థాక్రే హయాం నుంచీ పూర్తిగా హిందూ అజెండాతో పనిచేసిన శివసేన అంటేనే ముస్లింలకు పడదు. అలాంటిది కాంగ్రెస్, ఎన్సీపీలతో జతకట్టి హిందూ అజెండాను పక్కనబెట్టిందన్న ఆరోపణలతో శివసేన చీలిపోయింది కూడా. అందులో నుంచి వచ్చిన షిండే వర్గం ఉద్ధవ్ థాక్రేను పదవీచ్యుతుడిని చేసి బీజేపీతో కలిసి అధికారం చేజిక్కించుకుంది.
దీంతో చేసేది లేక కాంగ్రెస్, ఎన్సీపీలతో కలిసి రాజకీయాలు చేస్తున్న ఉద్ధవ్ వర్గానికి ఇప్పుడు వారి ఓటు బ్యాంక్ అయిన ముస్లింలు చేరువవుతున్నారు. ఇదే విషయాన్ని తాజా లోక్ సభ ఎన్నికల ఫలితాలు నిరూపించాయి. దీంతో ఇప్పుడు శివసేన ఉద్ధవ్ వర్గం ముంబై పరిధిలోని ఆరు ముస్లిం ప్రభావిత నియోజకవర్గాలు బైకుల్లా, కుర్లా, ఘట్కోపర్, వెర్సోవా, జోగేశ్వరీ ఈస్ట్, మాహింలో పోటీ చేస్తామంటోంది. కానీ కాంగ్రెస్ వీటిని ఇచ్చేందుకు ఇష్టపడటం లేదు.












Click it and Unblock the Notifications