రాహుల్ గాంధీతో ఆ ఒక్కమాటైనా చెప్పించగలరా?: ఉద్ధవ్‌కు అమిత్ షా సవాల్
ముంబై: శివసేన (యూబీటీ) అధినేత ఉద్ధవ్ థాక్రేపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా విమర్శలు గుప్పించారు. బాలాసాహెబ్ థాక్రే, వీర్ సావర్కర్‌లను అవమానించిన వారి పక్షానే ఉద్ధవ్ ఉన్నారంటూ మండిపడ్డారు. మహారాష్ట్ర ఎన్నికల నేపథ్యంలో బీజేపీ మేనిఫెస్టోను ఆదివారం అమిత్ షా విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.
మహా వికాస్ అఘాడీలో భాగమైన శివసేన (యూబీటీ), కాంగ్రెస్, ఎన్సీపీ(శరద్ పవార్)లపై మహారాష్ట్ర ప్రజలకు నమ్మకం లేదన్నారు అమిత్ షా. ప్రతిపక్షాలు (కాంగ్రెస్, శరద్ పవార్ ఎన్సీ, ఉద్ధవ్ థాక్రే శివసేన) బుజ్జగింపు రాజకీయాలు చేస్తున్నామని మండిపడ్డారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఎన్నికల వేళ ఇచ్చిన హామీలను ఇంకా నెరవేర్చలేదన్నారు.

బాలాసాహెబ్, వీర సావర్కర్లను అవమానించిన కాంగ్రెస్ పక్షానే ఉద్ధవ్ థాక్రే నిలబడ్డారని అమిత్ షా విమర్శించారు. వీర్ సావర్కర్ గురించి రెండు మాటలు మాట్లాడాలని రాహుల్ గాంధీని ఉద్ధవ్ థాక్రే కోరగలరా? అని అమిత్ షా సవాల్ విసిరారు. మత ప్రాతిపదికన రిజర్వేషన్లను రాజ్యాంగం నిషేధించిందని, ముస్లింలకు ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల రిజర్వేషన్లు కల్పించడాన్ని మహారాష్ట్ర ప్రజలు సమర్థిస్తారా? అని ఆయన ప్రశ్నించారు.
అయోధ్య రామమందిరం, పౌరసత్వ చట్ట సవరణ, యూనిఫాం సివిల్ కోడ్ లాంటి అనేక అంశాల్లో కాంగ్రెస్ నుంచి వ్యతిరేకత వచ్చింది. అలాంటి వారితో ప్రస్తుతం ఉద్ధవ్ థాక్రే ఉన్నారు. అబద్ధపు వాగ్ధానాలతో లాభం లేదనే విషయాన్ని శరద్ పవార్(ఎన్సీపీ)కు తెలియజేయాలనుకుంటున్నాను. యూపీఏ హయాంలో కేంద్రమంత్రిగా పనిచేసిన ఆయన.. మహారాష్ట్ర ప్రజల అభివృద్ధి కోసం చేసిన పనులేంటో చెప్పాలని అమిత్ షా డిమాండ్ చేశారు.
కాగా, మహారాష్ట్రలో నవంబర్ 20న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. నవంబర్ 23న ఫలితాలు వెలువడనున్నాయి. ఈ ఎన్నికల్లో గెలిచి మరోసారి మహారాష్ట్రంలో అధికారాన్ని నిలబెట్టుకోవాలని మహాయుతి కూటమి శాయశక్తులా ప్రయత్నిస్తుండగా.. ఈసారి అధికారం దక్కించుకోవాలని మహా వికాస్ అఘాడీ కూటమి విశ్వప్రయత్నాలు చేస్తోంది.












Click it and Unblock the Notifications