తగ్గేదేలే!.. సనాతన ధర్మం వివాదంపై ఉదయనిధి స్టాలిన్
Udayanidhi Stalin: సనాతన ధర్మంపై తాను చేసిన వ్యాఖ్యలపై ఉదయనిధి స్టాలిన్ మరోసారి స్పందించారు. తన వ్యాఖ్యలను వక్రీకరించారని, ప్రాణాహాని బెదిరింపులు కూడా వచ్చాయని ఆయన పేర్కొన్నారు. దేశంలో పెరుగుతున్న ద్వేషపూరిత ప్రసంగాలు, తప్పుడు వార్తలపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. చెన్నైలో జరిగిన ఓ కార్యక్రమంలో తమిళనాడు ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ మాట్లాడుతూ.. ఇండియాలో, ముఖ్యంగా మైనారిటీ వర్గాలకు ద్వేషపూరిత ప్రసంగాలు పెరిగిపోతున్నాయని అన్నారు. సోషల్ మీడియాలో వివిధ రకాల తప్పుడు ప్రచారాలు జరగుతున్నాయని, దేశంలో ఒక ఫాసిస్ట్ ముఠా ఉందని, దాని పని సోషల్ మీడియాలో తప్పుడు సమాచారం వ్యాప్తి చేసి ప్రజలను తప్పుదోవ పట్టించడమేనని ఆయన అన్నారు.
'ఫ్యాక్ట్ చెక్' బృందాన్ని అభినందించిన ఉదయనిధి స్టాలిన్
తప్పుడు వార్తలను అరికట్టడానికి ముఖ్యమంత్రి మార్గదర్శకత్వంలో 'డెడికేటెడ్ ఫ్యాక్ట్ చెక్ టీమ్' పేరుతో ఒక అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున్నారని ఉదయనిధి స్టాలిన్ తెలిపారు. ఈ బృందం విద్యార్థులకు కూడా శిక్షణ ఇస్తోందని ఆయన అన్నారు. తమిళనాడులో తప్పుడు వార్తల వ్యాప్తి తగ్గుతోందని, ఈ ప్రయత్నాలను తాను అభినందిస్తున్నానని ఆయన తెలిపారు. ఈ బృందం 47,000 మందికి శిక్షణ ఇచ్చిందని, నిజమైన, తప్పుడు వార్తల మధ్య తేడాను గుర్తించాలని ప్రజలను కోరారు.

'నా తలకు వెల కట్టారు'
సనాతన ధర్మంపై తాను చేసిన వ్యాఖ్యలను కూడా ఉదయనిధి స్టాలిన్ ప్రస్తావించారు. తప్పుడు, తప్పుదోవ పట్టించే సమాచారం ముందుగానే ప్లాన్ చేయబడి ఉంటుందని ఆయన అన్నారు. మూడేళ్ల క్రితం తాను ఓ కార్యక్రమంలో అందరూ సమానంగా ఉండాలని, పుట్టుకతో ఎటువంటి అసమానతలు ఉండకూడదని చెప్పానని, కానీ ప్రజలు దానిని వక్రీకరించి తాను మారణాహోమానికి పిలుపునిచ్చినట్లు చిత్రీకరించారని ఉదయనిధి స్టాలిన్ ఆవేదన వ్యక్తం చేశారు. "కొందరు నా తలకి వెల కట్టారు. నన్ను క్షమాపణలు కోరమన్నారు. నేను క్షమాపణలు చెప్పలేనని, వారు కోరుకున్నది చేయవచ్చని చెప్పాను. తమిళ ప్రజలు అబద్ధాలు, అసత్యాలను నమ్మరు. ఆలోచించడం, పనిచేయడం, ప్రశ్నలు వేయడం మనకు నేర్పినది మన పెరియారే" అని స్టాలిన్ అన్నారు.
సెప్టెంబర్ 2023లో ఉదయనిధి స్టాలిన్ "సనాతన ధర్మం" సామాజిక న్యాయం, సమానత్వానికి వ్యతిరేకమని.. దానిని మలేరియా, డెంగ్యూ లాగా నిర్మూలించాలని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా పెద్ద వివాదాన్ని సృష్టించాయి. ఒక స్వామీజీ ఉదయనిధి తల నరికి తెచ్చిన వారికి రూ. 10 కోట్లు బహుమతి ఇస్తానని ప్రకటించారు.












Click it and Unblock the Notifications