ముంబై బుల్లెట్ రైలు ప్రాజెక్ట్‌లో పెను ప్రమాదం
Mumbai-Ahmedabad bullet train: గుజరాత్‌లో దిగ్భ్రాంతికర ఘటన చోటు చేసుకుంది. ప్రతిష్ఠాత్మక ముంబై- అహ్మదాబాద్ బుల్లెట్ రైలు ప్రాజెక్ట్‌లో భారీ ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ఓ కార్మికుడు దుర్మరణం పాలయ్యాడు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని ఆసుపత్రికి తరలించి, చికిత్స అందిస్తోన్నారు.
గుజరాత్‌లోని ఆనంద్ జిల్లాలో ఈ సాయంత్రం ఈ దుర్ఘటన జరిగింది. ముంబై-అహ్మదాబాద్ బుల్లెట్ రైలు ప్రాజెక్టులో భాగంగా నిర్మాణంలో ఉన్న బ్రిడ్జి కుప్పకూలింది. మాహి నదీపై నిర్మితమౌతోన్న వంతెన ఇది. నేషనల్ హైస్పీడ్ రైల్ కార్పొరేషన్ దీన్ని నిర్మిస్తోంది. బుల్లెట్ రైలు నిర్మాణం కోసం స్పెషల్ పర్పస్ వెహికల్ కింద కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సంస్థ ఇది.

ఈ బుల్లెట్ రైలు ప్రాజెక్ట్ నిర్మాణ పనులు ప్రస్తుతం కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా ఆనంద్ జిల్లాలో మాహీ నదిపై ఓ బ్రిడ్జి రూపుదిద్దుకుంటోంది. గడ్డర్లతో దీన్ని నిర్మిస్తోన్నారు. సాయంత్రం 5 గంటల సమయంలో ఒక్కసారిగా ఆ వంతెన కుప్పకూలింది. గడ్డర్లన్నీ ఒకవైపున ఒరిగిపోయాయి. సిమెంట్ బ్లాక్‌లన్నీ చెల్లాచెదురుగా పడ్డాయి.
ఈ ఘటనలో అక్కడే ఉన్న ముగ్గురు కార్మికులు వాటి కింద చిక్కుకున్నారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు, అగ్నిమాపక- రాష్ట్ర విపత్తు నిర్వహణ సిబ్బంది, హైస్పీడ్ రైల్ కార్పొరేషన్ అధికారులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలు చేపట్టారు. జేసీబీలు, హెవీ వెయిట్ క్రేన్లను తెప్పించి శిథిలాలను తొలగించే పనులు చేపట్టారు.

ఆనంద్ జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ గౌరవ్ జసాని సహాయక పనులను పర్యవేక్షించారు. గాయపడ్డ కార్మికులను సమీప ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఓ కార్మికుడు మరణించినట్లు తెలుస్తోంది. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు డాక్టర్లు వెల్లడించారు.
ఈ ప్రమాదంపై నేషనల్ హై స్పీడ్ రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ ఓ ప్రకటన విడుదల చేసింది. మాహీ నదిపై నిర్మితమౌతోన్న బ్రిడ్జి కుప్పకూలినట్లు వెల్లడించింది. ముగ్గురు కార్మికులు కాంక్రీట్ బ్లాక్‌ల మధ్య చిక్కుకున్నారని, క్రేన్లు, ఎక్సావేటర్లను సహాయంతో రెస్క్యూ ఆపరేషన్‌లను చేపట్టినట్లు వివరించింది.












Click it and Unblock the Notifications