నిర్మలమ్మ బడ్జెట్: కొత్త యాప్: ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలంటే?: ఆ భారంపైనే అందరి భయాలు
న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్.. ఇంకొద్దిసేపట్లో బడ్జెట్ ప్రతిపాదనలను పార్లమెంట్‌లో ప్రవేశపెట్టబోతోన్నారు. ఉదయం 11 గంటలకు బడ్జెట్‌ను సమర్పిస్తారు. కేంద్రంలో భారతీయ జనతా పార్టీ సారథ్యంలోని ఎన్డీఏ ప్రభుత్వం బడ్జెట్‌ను ప్రవేశపెట్టబోతోండటం వరుసగా ఇది తొమ్మిదోసారి. ఇదివరకెప్పుడూ లేని కొన్ని ప్రత్యేక పరిస్థితుల మధ్య నిర్మలా సీతారామన్ బడ్జెట్‌ను రూపొందించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ సారి బడ్జెట్‌లో కరోనా వైరస్ సెస్ లేదా సర్‌ఛార్జ్‌ను విధించే అవకాశం ఉందంటూ వార్తలు వస్తోన్న నేపథ్యంలో.. అదనపు వడ్డింపులు ఉంటాయనే అభిప్రాయాలు వ్యక్తమౌతోన్నాయి.

సెస్ లేదా సర్‌ఛార్జ్ ఖాయమేనా?
కరోనా వైరస్ మిగిల్చిన నష్టాన్ని భర్తీ చేసుకోవడానికి వచ్చే బడ్జెట్‌లో కరోనా సెస్ లేదా సర్‌ఛార్జ్‌ను విధించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోందని, ఈ దిశగా కొన్ని వరుస భేటీలను కూడా నిర్వహించిందనే వార్తలు ఇదివరకే వినిపించాయి. సెస్ స్వరూపం ఎలా ఉండాలి? ఎంత శాతాన్ని అమల్లోకి తీసుకుని రావాలి? ఏఏ వర్గాలకు చెందిన ప్రజలకు దీన్ని వడ్డించాలనే విషయంపై కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ కసరత్తు పూర్తి చేసిందని అంటున్నారు. 2021-2022 ఆర్థిక సంవత్సరానికి గాను పార్లమెంట్‌లో ప్రవేశపెట్టబోయే బడ్జెట్ ప్రతిపాదనల్లో వాటిని చేర్చుతారని చెబుతున్నారు.

పేపర్ లెస్..
కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోన్న ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని పేపర్ లెస్ బడ్జెట్‌ను రూపొందించారు. బడ్జెట్ ప్రతిపాదనల గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. కొత్తగా మొబైల్ యాప్‌ను రూపొందించింది. Union Budget 2021 appను గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఆండ్రాయిడ్, ఐఓఎస్ యూజర్లు దీన్ని తమ మొబైల్ ఫోన్లలో ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. దీనితోపాటు https://www.indiabudget.gov.in అనే వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

యాప్‌లో ఏముంటాయి?
ఈ యాప్ ద్వారా మొత్తం 14 పేజీల కేంద్ర బడ్జెట్ ప్రతిపాదనల యాక్సెస్ యూజర్లకు లభిస్తుంది. బడ్జెట్ వివరాలు, కేటాయింపులు, గ్రాంట్లు, ఆర్థిక బిల్లు.. ఇవన్నీ చూడొచ్చు. ఇంగ్లీష్, హిందీ భాషల్లో బడ్జెట్ డాక్యుమెంట్లను ఇందులో పొందుపరుస్తారు. యాప్ ద్వారా బడ్జెట్ ప్రతిపాదనలను విడుదల చేయబోతోండటం ఇదే తొలిసారి. బడ్జెట్ ప్రతిపాదనలన్నీ సంబంధిత మంత్రిత్వ శాఖ వెబ్‌సైట్‌లో పొందుపరిచే వారు. ఈ సారి దానికి భిన్నంగా యాప్ ద్వారా ప్రజలకు చేరవేయబోతోంది కేంద్రం. డిజిటలీకరణలో భాగంగా.. ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు ఆర్థికమంత్రిత్వ శాఖ అధికారులు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications