చేతిలో చిల్లిగవ్వ ఉండట్లేదు- సినిమాలు చేస్తేనే డబ్బులొస్తాయ్: రాజీనామాకు రెడీ
ప్రముఖ మలయాళ నటుడు, కేంద్రమంత్రి సురేష్ గోపీ సంచలన వ్యాఖ్యలు చేశారు. మంత్రి పదవి నుంచి తప్పుకోవాలని భావిస్తున్నానని, పదవికి రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నానని వెల్లడించారు. సినిమాల్లోకి పూర్తిస్థాయిలో నటించాలని కోరుకుంటోన్నానని వ్యాఖ్యానించారు. ఫిల్మ్ ఇండస్ట్రీకి దూరం కావడం, రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరిస్తోన్నందున ఆదాయం కూడా బాగా తగ్గిందని పేర్కొన్నారు.
కేరళ నుంచి బీజేపీ తరఫున లోక్‌సభకు ఎన్నికైన తొలి ఎంపీ ఆయనే. గత ఏడాది జరిగిన లోక్ సభ ఎన్నికల్లో త్రిశూర్ నుంచి ఆయన ఘన విజయం సాధించారు. ఆ తరువాత పెద్దగా సినిమాల్లో కనిపించలేదు. కేరీర్ ఉచ్ఛస్థితిలో ఉన్నప్పుడే రాజకీయాల్లోకి అడుగు పెట్టారాయన. 2016లో బీజేపీలో చేరారు. సినిమాలకు దూరం అయ్యారు. తొలుత రాజ్యసభకు నామినేట్ అయ్యారు. అనంతరం లోక్ సభలో ఎంట్రీ ఇచ్చారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కేబినెట్ లో పెట్రోలియం, పర్యాటక సహాయ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. తాజాగా కన్నూర్‌లో బీజేపీ నిర్వహించిన ఓ సమావేశంలో మాట్లాడారు. సినీ కెరీర్‌ను వదిలేయాలని, కేంద్ర మంత్రిని కావాలని ఎప్పుడూ కోరుకోలేదని సురేష్ గోపీ స్పష్టం చేశారు. మళ్లీ సినిమాల్లో నటించాలని ఉందని, అదే తన చివరి మజిలీ అని పేర్కొన్నారు. సినిమాలకు దూరమైనప్పటి నుంచి తన ఆదాయం కూడా గణనీయంగా తగ్గిందని చెప్పారు.
కేంద్ర మంత్రి పదవి నుంచి తాను వైదొలగాల్సి వస్తే ఆ స్థానాన్ని సదానందన్ మాస్టర్‌తో భర్తీ చేయాలని సురేష్ గోపీ తెలిపారు. అలా చేయడం వల్ల కేరళ రాజకీయ చరిత్రలో కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టినట్టు అవుతుందని తాను గట్టిగా నమ్ముతున్నానని చెప్పారు. సదానందన్ మాస్టర్ ఉపాధ్యాయుడిగా పని చేశారు. బీజేపీ కేరళ ఉపాధ్యక్షుడిగా పనిచేస్తున్నారు. గతంలో జరిగిన రాజకీయ దాడిలో రెండు కాళ్లు కోల్పోయారు. ఆయన రాజ్యసభ సభ్యుడు కూడా.












Click it and Unblock the Notifications