Oneindia Ground Report:మమతా సర్కార్ పై ప్రజాగ్రహం..ఏకమైన దేశం..!!
కోల్‌కతాలోని ఆర్‌జీ కార్ మెడికల్ కాలేజ్‌లో అత్యాచారం ఆపై హత్యకు గురైన జూనియర్ డాక్టర్ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఇక క్రమంగా ఆ కేసుకు సంబంధించిన అంశాలు వెలుగులోకి వస్తుండటంతో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై సామాన్య ప్రజల్లో ఆగ్రహం తీవ్రంగా వ్యక్తమవుతోంది. ఆమె పాలనపై ప్రజలు కోపంతో ఊగిపోతున్నారు. ఈ ఘటనతో కేవలం మెడికల్ కమ్యూనిటీ మాత్రమే ఏకం కాలేదు... దేశం యావత్తు తరలివచ్చి బాధితురాలికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తోంది. బెంగాల్ ప్రభుత్వం, పోలీసు శాఖ వ్యవహరించిన తీరును తప్పుబడుతోంది.
ఈ నేపథ్యంలోనే ఘటనకు సంబంధించి వన్ ఇండియా సామాన్య ప్రజల నుంచి పలు రంగాలకు చెందిన వారితో మాట్లాడి అభిప్రాయం సేకరించింది. ఈ ఘోరమైన నేరాన్ని ప్రతి ఒక్కరూ ముక్త కంఠంతో ఖండించారు.కేసును హ్యాండిల్ చేసిన విధానం సరిగ్గా లేదని దేశవ్యాప్తంగా ఉన్న డాక్టర్లు నిరసన చేపట్టి బాధిత కుటుంబానికి, డ్యూటీలో ఉన్న డాక్టర్లకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు.

ఢిల్లీలోని రాంమనోహర్ లోహియా హాస్పిటల్‌లో పనిచేస్తున్న రెసిడెండ్ డాక్టర్లు స్ట్రైక్‌ను అంతటితో ఆపేయాలని భావించారు. కానీ దేశవ్యాప్తంగా తమ సహచర డాక్టర్లు నిరసనకు దిగడంతో తిరిగి వారి నిరసన కార్యక్రమాలను చేపట్టారు. అంతేకాదు తమలో ఒకరిగా ఉన్న డాక్టర్‌కు అలాంటి పరిస్థితి తలెత్తడం చాలా దురదృష్టకరమని భావించిన వారు న్యాయం జరిగే వరకు తమ పోరాటం ఆగదనే స్పష్టమైన సంకేతాలు పంపారు.

మమతా బెనర్జీ ప్రభుత్వం పాత్ర..పూర్తి నిర్లక్ష్యం
కోల్‌కతా ఘటనపై ప్రజాగ్రహం పెరిగిపోతోంది. కేసును హ్యాండిల్ చేసిన విధానంపై మమత సర్కార్ ఉదాసీనత ప్రదర్శించిందని గట్టిగా నమ్ముతున్నారు ప్రజలు. ఎఫ్ఐఆర్ నమోదు చేయడంలో జాప్యం, జూనియర్ డాక్టర్ ఆత్మహత్య చేసుకుందని చిత్రీకరించే ప్రయత్నం చేసిన యాజమాన్యం,ఆ తర్వాత ఆధారాలను ధ్వంసం చేయడం వంటి చర్యలు పలు అనుమానాలు తావిచ్చాయి.మమతా సర్కార్ కేసును డీల్ చేయడంలో విఫలమైందని హైదరాబాద్‌కు చెందిన ఒక వ్యక్తి అభిప్రాయపడ్డారు. విచారణ సహేతుకంగా లేదని, విచారణ ప్రక్రియ చూస్తే అందులో అన్ని లోపాలే కనిపిస్తున్నాయని అభిప్రాయపడ్డారు.ప్రాణాలను డబ్బుతో వెలకట్టలేమని మండిపడ్డారు. అసలైన నేరస్తులను వదిలేసి, సంజయ్ రాయ్ అనే వ్యక్తిని పావుగా వాడుతున్నారని, ఘటన వెనుక పెద్దల హస్తం ఉందనేది తేటతెల్లం అవుతోందని చాలామంది అభిప్రాయపడ్డారు.

సత్వర న్యాయం జరగాలి: ప్రధాని మోదీ
దేశ స్వాతంత్ర్య దినోత్సవం రోజున ప్రసంగించిన ప్రధాని మోదీ, కోల్‌కతా అత్యాచారం హత్య లాంటి ఘోరమైన నేరాలకు సత్వరమే న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఘటనకు సంబంధించి వేగవంతమైన విచారణ చేపట్టి నిందితులకు కఠిన శిక్ష పడాలని ప్రధాని మోదీ అన్నారంటే దేశవ్యాప్తంగా ప్రజలు కోల్‌కతా ఘటన పట్ల ఎంతటి ఆగ్రహంతో ఉన్నారో అర్థమవుతోంది. బెంగాల్ ప్రభుత్వం ఈ విషయంలో పూర్తిగా విఫలమైందనే సంకేతాలు పంపారు ప్రధాని మోదీ. వెంటనే ఈ అంశాన్ని సీరియస్‌గా తీసుకుని వ్యవస్థపై నమ్మకం కలిగేలా చర్యలు తీసుకోవాలని మోదీ కోరారు. న్యాయం చేయాలన్న ఉద్దేశం కంటే రాజకీయ ప్రయోజనాలకే మమత ప్రభుత్వం ఎక్కువ ప్రాధాన్యత ఇస్తోందనే సంకేతాలు ప్రధాని మాటల ద్వారా తెలుస్తున్నాయి. ప్రజల నమ్మకానికి బెంగాల్ ప్రభుత్వం తూట్లు పొడిచిందనేది ప్రధాని మోదీ మాటల ద్వారా అర్థమవుతోంది.

ఎవరు బాధ్యత తీసుకుంటారు..?
కోల్‌కతా అత్యాచారం ఘటనను చేధించడంలో మమత సర్కార్ విఫలమైందని దేశం బలంగా నమ్ముతోంది.కేసును చేధించే క్రమంలో ప్రదర్శించిన ఉదాసీనత, మమత బెనర్జీ ప్రభుత్వ పాలనపై ఒక మాయని మచ్చగా నిలిచింది.దేశ పౌరులు మమత ప్రభత్వం నుంచి సమాధానం ఆశిస్తుండగా, మరోవైపు వైద్య సమాజం డాక్టర్ల రక్షణ కోసం, న్యాయం కోసం పోరాడుతోంది. కోల్‌కతా అత్యాచారం లాంటి ఘటనలకే కాకుండా ఇలాంటి మరెన్నో ఘటనలకు న్యాయం జరగడం లేదనేది దేశప్రజల అభిప్రాయం.మార్పు కోసం దేశప్రజలు ఒక్క తాటిపైకి వస్తున్నారు.ఈ ఘోరమైన నేరం వెనక ఉన్న అసలు వ్యక్తులను పట్టుకుని శిక్షించే వరకు తమ పోరాటం ఆగదని సామాన్య ప్రజలు హెచ్చరిస్తున్నారు.












Click it and Unblock the Notifications