దారుణం: కాలువలో కత్తి గాట్లతో యువతి, ఫొటోలు, వీడియోలు తీశారు కానీ..
మీరట్: మనషుల్లో మానత్వం కరువవుతోందనడానికి ఈ ఘటన నిదర్శనంగా నిలుస్తోంది. ఓ యువతిని దుండగులు తీవ్రంగా గాయపరిచి, గొంతుకోసి కాలువలో పడేశారు. అయితే, ఆమెను గమనించిన స్థానికులు ఆమె ఫొటోలు, వీడియోలు తీశారు కానీ, ఆస్పత్రికి తీసుకెళ్లే ప్రయత్నం చేయలేదు. పోలీసులు వచ్చే వరకూ కూడా ఫొటోలు, వీడియోలు తీస్తూ ఉండటం విచారకరం. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మీరట్‌లో ఆ దారుణం చోటు చేసుకుంది.

ప్రేమించిన వ్యక్తిని పెళ్లాడతాననడంతోనే..
తాను ప్రేమించిన వ్యక్తిని వివాహం చేసుకుంటానని చెప్పడంతో తన కుటుంబసభ్యులే తనపై దాడి చేసి గాయపర్చారని బాధిత యువతి పోలీసుల విచారణలో చెప్పారు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాధిత యువతి సోదరుడితోపాటు ఆమె బందువు ఒకర్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సీనియర్ పోలీస్ ఆఫీసర్ అవినాశ్ పాండే తెలిపారు.

అమానవీయంగా ప్రవర్తించొద్దు..
అయితే, తీవ్రంగా గాయపడిన ఓ యువతి కాలువలో పడివుంటే ఆమెను ఆస్పత్రికి తరలించకుండా ఫొటోలు, వీడియోలు తీసిన జనాలపై పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరైనా బాధితులు ప్రమాదంలో ఉంటే సాయం చేయాలని గానీ, మానవత్వం లేకుండా వ్యవహరించడం సరికాదని హితవు పలికారు. సరైన సమయంలో బాధితులను ఆస్పత్రికి తరలించకపోతే వారి ప్రాణాలకే ప్రమాదమని చెప్పారు. ప్రమాదంలో ఉన్న బాధితులను ఆస్పత్రికి చేర్చినవారిని పోలీసులు కేసుల గురించి ప్రశ్నించకూడదని సుప్రీంకోర్టు కూడా తెలిపిందని గుర్తుచేశారు.

మహిళలపై జరుగుతున్న నేరాలపై యూపీ సర్కారు సీరియస్..
కాగా, గత శుక్రవారం గోరఖ్‌పూర్ జిల్లాలో ఓ యువతిని ఇద్దరు వ్యక్తులు సామూహిక అత్యాచారం చేశారు. అంతేగాక, ఆమె శరీరంపై సిగరేట్లతో కాల్చారు. గత శనివారం లఖింపూర్ ఖేరి జిల్లాలో ఓ 13 ఏళ్ల బాలికను అత్యాచారం చేసిన దుండగులు, ఆ తర్వాత ఆమెను దారుణంగా చంపేశారు. ఈ కేసులో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. నేరాలు పెరిగిపోతున్న నేపథ్యంలో యూపీ ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. నిందితులను కఠినంగా శిక్షించేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. మహిళా, శిశు భద్రతా సంస్థను ఏర్పాటు చేసింది. అడిషనల్ డీజీపీ స్థాయి పోలీసు అధికారి నేతృత్వంలో ఇది పనిచేస్తుంది. మహిళలు, యువతులు, చిన్నారులపై జరిగే నేరాలపై ఈ విభాగం ప్రత్యేక దృష్టిని సారిస్తోంది.












Click it and Unblock the Notifications