భూ వివాదం: బట్టలూడదీసి, మహిళను తలకిందులుగా వేలాడదీసి కొట్టారు
లక్నో: ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో అత్యంత దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బలరామ్ పూర్ జిల్లాలో భూమిని బదిలీ చేయడానికి నిరాకరించినందుకు ఓ నడి వయస్సు స్త్రీని క్రూరంగా హింసించారు. బట్టలూడదీసి, చెట్టుకు తలకిందులుగా వేలాడ దీసి, కొట్టారు. ఈ సంఘటన సోమవారంనాడు చోటు చేసుకుంది.
ఫిర్యాదు చేయడానికి తులసీపూర్ పోలీసు స్టేషన్‌కు వెళ్లిన ఆమెకు అవమానమే ఎదురైంది. ఆ ఫిర్యాదును తీసుకోవడానికి పోలీసులు నిరాకరించడమే కాకుండా స్టేషన్ నుంచి గెంటేశారు.
ఆ విషయం ఎట్టకేలకు జిల్లా కలెక్టర్ ప్రీతి శుక్లాకు చేరింది. దాంతో సంఘటనపై ప్రీతి శుక్లా దర్యాప్తునకు ఆదేశించారు. ఆమె పట్ల అనుచితంగా వ్యవహరించిన ఇన్‌స్పెక్టర్ ఎస్‌కె రాయ్, సబ్ ఇన్‌స్పెక్టర్ ఆలోక్ కుమార్ సింగ్‌లను సస్పెండ్ చేయించారు. తులసీపురం పోలీసు స్టేషన్‌లో ఎఫ్ఐఆర్ నమోదు చేయించారు.

వాజిద్ అలీ, సజీద్ అలీ, మొహమ్మద్ ముత్విల్, మొహమ్మద్ మత్లబ్ అనేవారిని నిందితులుగా చేర్చారు. వారంతా పరారీలో ఉన్నారు. ఆ మహిళా రైతుది బలరామ్‌పూర్‌లోని గుడార - జద్దాపూర్ గ్రామం. నిందితులు ఆమె భూమిని ఆక్రమించుకున్నారు. ఆమె కోర్టుకు వెళ్లింది. కోర్టు భూమిపై స్టే ఉత్తర్వులు జారీ చేసి విచారణ జరుపుతోంది.
ఈ స్థితిలో కేసును ఉపసంహరించుకుని భూమిని తమకు బదలాయించాలంటూ నిందితులు కొంత కాలం నుంచి ఆమెను హింసిస్తున్నట్లు చెబుతున్నారు. రెండు నెలల క్రితం కూడా ఆమెను, ఆమె కుమారుడిని నిందితులు హింసించారు. దీంతో కొడుకు ఊరు వదిలి పారిపోయాడు. అప్పటి నుంచి తన కుమారుడి జాడ తెలియడం లేదని మహిళ ఆవేదన వ్యక్తం చేస్తోంది.












Click it and Unblock the Notifications