నెత్తురోడిన మాతృత్వం: నొప్పులు భరించలేక కత్తితో కడుపు కోసుకున్న గర్భిణి!
ఉత్తరప్రదేశ్‌లోని బహ్రైచ్ జిల్లాలో మానవత్వాన్ని కలచివేసే ఓ విషాద ఘటన చోటుచేసుకుంది. ప్రసవ వేదనను భరించలేక ఓ గర్భిణి అత్యంత దారుణమైన నిర్ణయం తీసుకుంది. ఆస్పత్రికి వెళ్లే మార్గం లేకనో లేదా వేదన భరించలేకనో కానీ.. వంటింటి కత్తితో తన కడుపును తానే కోసుకున్న ఘటన స్థానికంగా సంచలనం సృష్టిస్తోంది.
అసలేం జరిగిందంటే?
నంద్వాల్ గ్రామానికి చెందిన నన్కై దేవి అనే 9 నెలల గర్భిణికి గురువారం ప్రసవ నొప్పులు మొదలయ్యాయి. ఆ సమయంలో ఆమె ఇంట్లో ఒంటరిగా ఉంది. నొప్పులు తీవ్రతరం కావడంతో ఆ బాధను భరించలేక ఆమె వంటింట్లో ఉన్న కత్తితో తన కడుపును కోసుకుంది. బిడ్డను బయటకు తీయాలనే ఆవేదనతో ఆమె ఈ సాహసం చేసినట్లు తెలుస్తోంది. ఆమె ఆర్తనాదాలు విన్న పొరుగువారు పరుగెత్తుకుంటూ వచ్చి చూడగా.. ఆమె రక్తపు మడుగులో పడి ఉంది. వెంటనే ఆమెను ఫఖర్‌పూర్‌లోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు తరలించారు. అక్కడ ఆమె ఓ ఆడబిడ్డకు జన్మనిచ్చింది.

పరిస్థితి విషమం
తీవ్ర రక్తస్రావం కావడంతో నన్కై దేవి పరిస్థితి విషమించింది. ప్రాథమిక చికిత్స అనంతరం ఆమెను బహ్రైచ్ జిల్లా ఆసుపత్రికి.. అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం లక్నోలోని సూపర్ స్పెషాలిటీ సెంటర్‌కు తరలించారు. ప్రస్తుతం ఆమె మృత్యువుతో పోరాడుతోంది. ఆమె కడుపుపై లోతైన గాయాలు ఉన్నాయని, కడుపు భాగం పూర్తిగా చీలిపోవడం వల్ల భారీగా రక్తం పోయిందని వైద్యులు వెల్లడించారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వీడియోలో ప్రసవ వేదన భరించలేకే తాను ఇలా చేసుకున్నట్లు ఆ మహిళ చెప్పడం అందరినీ కంటతడి పెట్టిస్తోంది.
ఒంటరి మహిళా.. నిస్సహాయతా?
స్థానికుల కథనం ప్రకారం.. ఆమె భర్త ఆరు నెలల క్రితమే మరణించారు. అప్పటి నుంచి ఆమె ఇంట్లో ఒంటరిగానే నివసిస్తోంది. ఆపద సమయంలో తోడు ఎవరూ లేకపోవడం, తీవ్రమైన శారీరక వేదన తోడవ్వడంతోనే ఆమె ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications