బీజేపీ ఎంపీల ఆరోపణలపై స్పందించిన కాబోయే సీజేఐ గవాయ్-రాష్ట్రపతి పాలనపై..!
రాష్ట్రాల అసెంబ్లీలు పంపిన బిల్లుల పెండింగ్, వక్ఫ్ చట్టంపై దాఖలైన పిటిషన్ల విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులపై కేంద్రంలో బీజేపీ ఎంపీలు మండిపడుతున్నారు. ఉపరాష్ట్రపతి జగ్ దీప్ ధన్ కర్ తో పాటు బీజేపీ ఎంపీ నిశికాంత్ దూబే తాజాగా ఈ విషయంలో సుప్రీంకోర్టును టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పించారు. దీనిపై విపక్షాలు కూడా మండిపడ్డాయి. ఇవాళ ఇదే అంశంపై సుప్రీంకోర్టు కాబోయే ఛీఫ్ జస్టిస్ బీఆర్ గవాయ్ స్పందించారు.
బీజేపీ నేతలు న్యాయవ్యవస్థను లక్ష్యంగా చేసుకుని చేస్తున్న విమర్శలపై జస్టిస్ బీఆర్ గవాయ్ స్పందించారు. వక్ఫ్ చట్టాన్ని వ్యతిరేకిస్తూ బెంగాల్లో చోటు చేసుకుంటున్న హింసపై దాఖలైన పిటిషన్లపై జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ ఆగస్టీన్ జార్జ్ మాసిహ్ తో కూడిన బెంచ్ విచారణ జరుపుతోంది.ఈ సందర్భంగా పిటిషనర్లు బెంగాల్లో రాష్ట్రపతి పాలన విధించి కఠిన చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టును కోరారు. దీనిపై స్పందించిన గవాయ్.. మీరు రాష్టపతికి రిట్ ఆఫ్ మాండమస్ (తగిన చర్యలు తీసుకోమని ఆదేశించడం) జారీ చేయాలని కోరుతున్నారా అని ప్రశ్నించారు.

ఇప్పటికే తాము(న్యాయవ్యవస్థ) కార్యనిర్వాహక వ్యవస్దలోకి చొరబడుతున్న విమర్శలు ఎదుర్కొంటున్నట్లు జస్టిస్ బీఆర్ గవాయ్ తెలిపారు. వచ్చే నెలలో సుప్రీంకోర్టు తదుపరి ఛీఫ్ జస్టిస్ గా బాధ్యతలు చేపట్టబోతున్న జస్టిస్ బీఆర్ గవాయ్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఆయన వక్ఫ్ చట్టంపై ప్రస్తుతం సుప్రీంకోర్టులో జరుగుతున్న విచారణను ఛీఫ్ జస్టిస్ హోదాలో కొనసాగించబోతున్నారు.
తాజాగా తమిళనాడు అసెంబ్లీ పంపిన బిల్లుల్ని రాష్ట్రపతి వద్ద పెండింగ్ లో పెట్టిన గవర్నర్ బీఎన్ రవిపై ఆగ్రహం వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు..ఆ 10 బిల్లులూ ఆటోమేటిగ్గా ఆమోదం పొందినట్లేనని తీర్పు ఇచ్చింది. దీనిపై స్పందించిన ఉపరాష్ట్రపతి సుప్రీంకోర్టు సూపర్ పార్లమెంట్ లా వ్యవహరిస్తోందన్నారు. మరోవైపు వక్ఫ్ చట్టం విషయంలో పురాతన ముస్లింల కట్టడాలకు పత్రాలు ఎక్కడి నుంచి వస్తాయంటూ సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. దీనిపై స్పందించిన బీజేపీ ఎంపీ నిశికాంత్ దూబే.. సుప్రీంకోర్టే చట్టాలు చేసేస్తే.. ఇక పార్లమెంట్ మూసుకోవాలని వ్యాఖ్యానించారు. వీరిద్దరి వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. అయితే బీజేపీ వీటికి దూరంగా ఉంది.












Click it and Unblock the Notifications