భారత్ నిర్ణయం వెనుక అమెరికా బెదిరింపులు? ట్రంప్ మంత్రి క్లారిటీ..!
అమెరికా-ఇరాన్ యుద్దం కొనసాగుతున్న సమయంలో అంతర్జాతీయంగా చమురు ధరలు ఆకాశాన్నంటాయి. ఈ నేపథ్యంలో భారత్ తన ముడి చమురు దిగుమతుల్ని వైవిధ్య పరచాలని నిర్ణయం తీసుకుంది. అప్పటివరకూ రష్యా నుంచి డిస్కౌంట్ పై అందుతున్న చమురును కాదని ఇతర మార్గాలపై దృష్టిపెట్టింది. దీని వెనుక అమెరికా (US) బెదిరింపులు ఉన్నాయన్న చర్చ జరుగుతోంది. దీనిపై అమెరికా విదేశాంగశాఖ మంత్రి మార్కో రూబియో క్లారిటీ ఇచ్చారు.
ఇండియా టుడేకు ఇచ్చిన ఎక్స్ క్లూజివ్ ఇంటర్యూలో మార్కో రూబియో భారత్ చమురు దిగుమతుల వైవిధ్యం నిర్ణయం వెనుక ఉన్న కారణాలను వివరించారు. ముడి చమురు దిగుమతులను వైవిధ్యపరచాలన్న భారతదేశపు నిర్ణయం, అమెరికా ఒత్తిడి వల్ల కాకుండా, దాని స్వంత ప్రయోజనాల దృష్ట్యానే తీసుకున్నట్లు రూబియో స్పష్టం చేశారు. మూడు రోజుల భారత పర్యటనలో ఉన్న రూబియో.. ఒకే సరఫరాదారుపై ఎక్కువగా ఆధారపడటం వల్ల దేశాలు అంతరాయాలకు గురయ్యే అవకాశం ఉందని తెలిపారు. భారతదేశం తన ఇంధన పోర్ట్‌ఫోలియోను వైవిధ్యపరచడంలో నిజమైన పురోగతి సాధించిందని ఆయన పేర్కొన్నారు. అది బెదిరింపుల వల్లనో లేదా అలాంటి ఇతర కారణాల వల్లనో చేయలేదన్నారు. రష్యా ముడి చమురు కొనుగోళ్ల విషయంలో డొనాల్డ్ ట్రంప్‌తో విభేదాలు ఉన్నందున, ఈ అంశం భారతదేశానికి మరింత సున్నితమైనదిగా భావిస్తున్నారు.

గతేడాది భారత్ రష్యా చమురును కొనుగోలు చేస్తోందంటూ, ట్రంప్ భారతీయ వస్తువులపై అదనంగా 25 శాతం సుంకాన్ని విధించడం ద్వారా మొత్తం సుంకాన్ని 50 శాతానికి పెంచారు. ఈ ఆదాయం ఉక్రెయిన్‌లో రష్యా చేస్తున్న యుద్ధానికి ఆజ్యం పోస్తోందని అమెరికా ఆరోపించగా, ట్రంప్ సహాయకుడు పీటర్ నవారో అయితే భారతదేశాన్ని క్రెమ్లిన్‌కు ఒక లాండ్రోమాట్ అని అభివర్ణించారు. ఈ ఏడాది ప్రారంభంలో ఆ అదనపు సుంకాన్ని ట్రంప్ తొలగించారు. అయితే రష్యానే భారత్ కు అతిపెద్ద సరఫరాదారుగా ఉన్నప్పటికీ, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల మధ్య తన ముడి చమురు దిగుమతులను పెంచుకున్న తరుణంలో ఈ చర్య తీసుకున్నారు. భారత చమురు కొనుగోళ్లలో రష్యా వాటా 46.6 శాతం నుండి 33.5 శాతానికి తగ్గిందని గణాంకాలు సూచిస్తున్నాయి. ఇదే అంశంపై గత వారం కేంద్ర మంత్రి హర్దీప్ పూరి మాట్లాడుతూ.. తన ముడి చమురు అవసరాలలో 80 శాతం పైగా దిగుమతి చేసుకునే భారత్.. తన సరఫరా నెట్‌వర్క్‌ను 27 దేశాల నుండి 41 దేశాలకు విస్తరించిందని స్పష్టం చేశారు.














Click it and Unblock the Notifications
