భర్త, ప్రియుడు ఇద్దరూ కావాలి: కరెంట్ పోల్ ఎక్కి మహిళ ఆందోళన
గోరఖ్‌పూర్: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని గోరఖ్‌పూర్‌లో వింత ఘటన వెలుగుచూసింది. భర్త, పిల్లలు ఉన్న ఓ మహిళ మరో వ్యక్తితో వివాహేతర సంబంధాన్ని ఏర్పరచుకుంది. ఈ విషయం బయటపడటంతో భర్త, ప్రియుడు ఇద్దరితోనూ కలిసి ఉంటానంటూ పట్టుబట్టింది. ఇందుకు ఇంట్లోవాళ్లు అంగీకరించకపోవడంతో విద్యుత్ స్తంభం ఎక్కి ఆందోళన చేపట్టింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. పిప్రాయిచ్ ప్రాంతానికి చెందిన 34 ఏళ్ల మహిళకు చాలా ఏళ్ల క్రితమే ఓ వ్యక్తితో వివాహమైంది. వీరికి ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు. అయితే, గత ఏడేళ్లుగా ఆ మహిళ పొరుగు ఊరికి చెందిన మరో వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఇటీవల ఈ విషయం భర్తకు తెలియడంతో ఆమెను నిలదీశాడు. దీంతో ఇరువురి మధ్య గొడవ జరిగింది.

ఈ క్రమంలోనే ఆమె ఊహించని ప్రతిపాదన భర్త ముందు పెట్టింది. ప్రియుడు కూడా తమతోనే ఉంటాడని, అలాగైతే ఇంటి ఆర్థిక సమస్యలు కూడా తొలుగుతాయని భర్తను కోరింది. ఇందుకు అతడు అంగీకరించకపోవడంతో ఆత్మహత్య చేసుకుంటానంటూ బెదిరింపులకు గురిచేసింది. అంతేగాక, ఓ మెడికల్ కాలేజీ మీద నుంచి దూకేందుకు ప్రయత్నించగా.. అక్కడున్నవారు ఆమెను కాపాడారు.
ఆ తర్వాత రైల్వే ట్రాక్‌పై పడుకుని విషం తాగింది. అప్పుడు కూడా స్థానికులు గమనించి ఆమెను ఆస్పత్రిలో చేర్చడంతో ప్రాణాలతో బయటపడింది. తాజాగా, బుధవారం గ్రామంలోని విద్యుత్ స్తంభం ఎక్కి నిరసన చేపట్టింది. గమనించిన స్థానికులు వెంటనే విద్యుత్ అధికారులకు ఫోన్ చేయడంతో విద్యుత్ సరఫరా నిలిపివేశారు. ఆ తర్వాత పోలీసులు అక్కడికి చేరుకుని బలవంతంగా ఆమెను కిందికి దించారు.
ఈ నేపథ్యంలో సదరు మహిళపై స్థానికులు కూడా మండిపడుతున్నారు. విద్యుత్ అధికారులు ఇలాంటి చర్యలకు పాల్పడవద్దని గట్టిగా హెచ్చరించారు. మరోవైపు, ఆమె భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఎంత చెప్పినా వినకుండా తరచూ ఇలాంటి చర్యలకు పాల్పడుతోందని, ఆమెకు ఏదైనా జరిగితే తమది బాధ్యత కాదని స్పష్టం చేశాడు.












Click it and Unblock the Notifications