శ్రీకృష్ణ జన్మభూమి మథురలో మద్యం,మాంసంపై సంపూర్ణ నిషేధం... యూపీ సర్కార్ ప్రకటన...
శ్రీకృష్ణ జన్మభూమి అయిన మథురలోని బృందావన్‌కు 10కి.మీ పరిధిలో మద్యం,మాంస విక్రయాలపై ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం నిషేధం విధించింది. 22 మున్సిపల్ వార్డులు ఉన్న ఆ ప్రాంతం మొత్తాన్ని పుణ్యక్షేత్రంగా ప్రకటించింది. ఈ మేరకు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించింది.
ఆగస్టు 30న శ్రీకృష్ణాష్ఠమి సందర్భంగా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మథురను సందర్శించిన సంగతి తెలిసిందే. శ్రీకృష్ణోత్సవ 2021 కార్యక్రమంలో పాల్గొన్న ఆయన... మథురలో మద్యం,మాంసం విక్రయాలపై సంపూర్ణ నిషేధం విధించబోతున్నట్లు ప్రకటించారు. చెప్పినట్లుగానే తాజాగా అందుకు ఆదేశాలిచ్చారు.
ఇప్పటివరకూ మద్యం,మాంసం విక్రయాలతో ఉపాధి పొందుతున్నవారు పాల వ్యాపారంలోకి మారాలని ఆ సందర్బంగా యోగి ఆదిత్యనాథ్ సూచించారు. తద్వారా ఒకప్పుడు అత్యధికంగా పాలను ఉత్పత్తి చేసిన మథురకు పూర్వ వైభవాన్ని తీసుకురావాలని కోరారు. ప్రభుత్వ నిర్ణయంతో తమ ఉపాధిని కోల్పోయేవారు ప్రత్యామ్నాయంగా పాల వ్యాపారం ఏర్పాటు చేసుకునేలా సంబంధిత అధికారులు గైడెన్స్ ఇవ్వాలని ఆదేశాలిచ్చారు. భవిష్యత్తులో మథుర పుణ్యక్షేత్ర అభివృద్ది కోసం భారీగా నిధులు ఖర్చు చేయాలని యూపీ సర్కార్ భావిస్తోంది.

యూపీలో 33 కరోనా ఫ్రీ జిల్లాలు :
ఉత్తరప్రదేశ్‌లోని 33 జిల్లాలను కరోనా ఫ్రీ జిల్లాలుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఆ 33 జిల్లాల్లో ఒక్క యాక్టివ్ కేసు కూడా లేదని తెలిపింది. గడిచిన 24 గంటల్లో మొత్తం 67 జిల్లాల్లో కొత్త కరోనా కేసులేవీ నమోదు కాలేదని పేర్కొంది. ప్రస్తుతం రాష్ట్రంలో కేవలం 199 యాక్టివ్ కేసులు మాత్రమే ఉన్నాయి. వైరస్ పాజిటివిటీ రేటు 0.01శాతానికి పడిపోయింది. గడిచిన 24 గంటల్లో 2.26లక్షల శాంపిల్స్‌ను పరీక్షించగా... కేవలం 11 కరోనా కేసులు మాత్రమే నమోదయ్యాయి. రాష్ట్రంలో ఇప్పటివరకూ 7.42 కోట్ల కరోనా టెస్టులు నిర్వహించారు. ఇప్పటివరకూ 8.47 కోట్ల మందికి వ్యాక్సిన్ వేశారు. గడిచిన 24 గంటల్లో 12లక్షల మందికి వ్యాక్సిన్లు వేశారు.
కరోనా ఫ్రీ జిల్లాల జాబితాలో అలీగఢ్, అమ్రోహా, అయోధ్య, బాగ్‌పత్, బల్లియా, బలరాంపూర్, బండ, బస్తీ, బహ్రాయిచ్, బిజ్నోర్, భడోహి, చిత్రకూట్, చందౌలి, ఎటా, డియోరియా, ఫతేపూర్, ఘాజీపూర్, గోండ, హమీర్‌పూర్, హపూర్, హర్దోయ్, కస్గంజ్, లలిత్‌పూర్ మొరాదాబాద్, ముజఫర్‌నగర్, పిలిభిత్, రాంపూర్, సహరాన్‌పూర్, షామ్లీ, సిద్ధార్థ్ నగర్,సోన్‌భద్ర ఉన్నాయి.












Click it and Unblock the Notifications