యోగి సర్కార్‌కు బిగ్ షాక్: సీనియర్ మంత్రి గుడ్‌బై..సమాజ్‌వాది పార్టీలో చేరిక
లక్నో: అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడింది. ఉత్తర ప్రదేశ్, ఉత్తరాంచల్, గోవా, మణిపూర్, పంజాబ్‌లల్లో ఎన్నికల నగారా మోగింది. ఏడు దశల్లో ఈ ఎన్నికలను నిర్వహించనుంది ఈసీ. ఫిబ్రవరి 10వ తేదీన తొలి దశ పోలింగ్ మొదలవుతుంది. చివరిదశ మార్చి 7వ తేదీన ముగుస్తుంది. 10న ఓట్ల లెక్కింపు ఉంటుంది. ఎన్నికలను ఎదుర్కొంటోన్న అయిదింట్లో పంజాబ్ మినహా మిగిలిన నాలుగు రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది.
Recommended Video
అదే హోదాలో అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొనబోతోంది. వరుసగా రెండోసారి ప్రభుత్వాన్ని నెలకొల్పాలనే పట్టుదలతో కనిపిస్తోంది. దేశంలోనే అతి పెద్ద రాష్ట్రంగా ఉన్న ఉత్తర ప్రదేశ్‌లో వరుసగా రెండోసారి అధికారంలో రావడానికి అందుబాటులో ఉన్న అన్ని వనరులను వినియోగించుకుంటోంది. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సారథ్యంలో ఇక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది బీజేపీ. ఆయన సారథ్యంలో ఎన్నికల బరిలోకి దిగింది. 403 అసెంబ్లీ స్థానాలు ఉన్న అతిపెద్ద రాష్ట్రం ఉత్తర ప్రదేశ్.
ఏడు విడతల్లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ నిర్వహించనుంది ఈసీ. 2017 నాటి ఎన్నికల్లో బీజేపీ..తన మిత్రపక్షం అప్నాదళ్ (సోనేలాల్)తో కలిసి 312 సీట్లను కైవసం చేసుకుంది. తిరుగులేని ఆధిపత్యం ఇది. వరుసగా రెండోసారి ప్రభుత్వాన్ని నెలకొల్పాలనే లక్ష్యంతో బీజేపీ ఎన్నికల బరిలో దిగింది. ప్రతిపక్ష సమాజ్‌వాది పార్టీ, బహుజన్ సమాజ్‌వాది పార్టీ, కాంగ్రెస్‌కు ఎలాంటి అవకాశాన్ని ఇవ్వకూడదనే ఉద్దేశంతో కనిపిస్తోంది. అందుకే అందుబాటులో ఉన్న అన్ని వనరులను కూడా వినియోగించుకుంటోంది.

అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొనడానికి సర్వసన్నద్ధంగా ఉన్న బీజేపీకి అనూహ్యంగా బిగ్ షాక్ తగిలింది. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మంత్రివర్గ సహచరుడు తన పదవికి రాజీనామా చేశారు. సమాజ్‌వాది పార్టీలో చేరారు. ఆ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ సమక్షంలో సమాజ్‌వాది కండువాను కప్పుకొన్నారు. మొన్నటిదాకా ఆయన యోగి ప్రభుత్వంలో కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రిగా పని చేశారు. దళితులు, వెనుకబడిన తరగతుల ప్రజలకు యోగి ప్రభుత్వం న్యాయం చేయలేకపోయిందని ఆయన ఆరోపించారు.
ఇదివరకు స్వామి ప్రసాద్ మౌర్య.. బహుజన్ సమాజ్‌వాది పార్టీలో చాలాకాలం పాటు కొనసాగారు. ప్రదౌన అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బీఎస్పీ అభ్యర్థిగా రెండుసార్లు విజయం సాధించారు. 2017 నాటి అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపీలో చేరారు. అదే నియోజకవర్గం నుంచి పోటీ చేసి, గెలిచారు. అనంతరం యోగి ఆదిత్యనాథ్ సారథ్యంలోని కేబినెట్‌లో కార్మిక శాఖ మంత్రిగా పని చేశారు. తన పదవీకాలంలో ఏనాడూ స్వేచ్ఛగా నిర్ణయాలను తీసుకోలేకపోయానని, ఉపాధిని కల్పించలేకపోయామని తాజాగా విమర్శలు గుప్పించారు.












Click it and Unblock the Notifications